మోదీది లోకవంచన: సురవరం
- డిసెంబర్ 31 వరకు బిల్లుల చెల్లింపులకు పాతనోట్లను అనుమతించాలి
- విదేశాల్లోని నల్ల ధనాన్ని తీసుకురావడంలో కేంద్రం విఫలం
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ ప్రధాని మోదీ ఆత్మవంచనతో కూడిన లోకవంచనకు పాల్పడుతున్నారంటూ సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్వేగభరితుడై మోదీ కార్చిన కన్నీళ్లు కోట్లాది దేశ ప్రజల కన్నీళ్లను తూడ్చలేవన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల దేశంలో ప్రజలు తీవ్రస్థారుులో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారన్నారు. డిసెంబర్ 31 వరకు ప్రజోపయోగ బిల్లుల చెల్లింపులు, ఖర్చుల కోసం రూ. వెరుు్య, 500 పాత నోట్లను చెల్లించేందుకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో మామూలు పరిస్థితులు ఏర్పడడానికి 50 రోజులు పడుతుందని మోదీయే చెబుతున్నందున, ఆ మేరకు ప్రజలకు కూడా ఆ అవకాశాన్ని కల్పించాలన్నారు.
మంగళవారం పార్టీ నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నల్లధన కుబేరులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, పనామా లీక్స్‌లో బయటపడిన వారందరి పేర్లపై చట్టపరంగా చర్య చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో బంగారం కొనుగోళ్లు జరిగి నట్లు, వేలకోట్లతో బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ అరుునట్లు తెలుస్తోందన్నారు. నల్లధనం దాచిన కుబేరులు ఈ చర్య నుంచి తప్పించుకున్నారనే వార్తలు రాగా, సామాన్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 31 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పాతనోట్లను కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం అనుమతిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వం, ఏవో పైపై చర్యలతో ప్రజల దృష్టిని మళ్లించేం దుకు ప్రయత్నిస్తోందన్నారు. స్విస్‌బ్యాంకు ల్లో నల్లధనాన్ని దాచుకున్న వారి జాబితా ను సాధించి, వారిపై పెద్ద మొత్తంలో టాక్స్ వేసేలా అమెరికా చేయగా లేనిది భారత్ ఎందుకు చేయలేక పోతున్నదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కోర్టు, ఇతర అంతర్జాతీయ వేదికలపై కేంద్రం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు.