సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంపై దాడి చేస్తున్న సంఘ్ పరివార్, బీజేపీలే దేశానికి ప్రధాన శత్రువులని, నరేంద్ర మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో విధ్వంసం సృష్టించిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌కు తాకట్టు పెట్టిన మోదీ సర్కారు దేశంలోనూ మత కోణంలో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. సంఘ్ పరివార్ చేతిలో బీజేపీ ప్రభుత్వం రిమోట్‌కంట్రోల్‌గా మారిందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో ఆ పార్టీ ప్రతినిధులకు సౌహార్ద సందేశమిచ్చారు.
‘‘దళితులు, మైనార్టీలను బలి తీసుకుంటున్నారు. లౌకికవాద యువతను చంపేస్తున్నారు. ముఖ్య ప్రభుత్వ పదవులు, యూనివర్సిటీలు, ఇతర సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు ప్రవేశించాయి. ఫాసిస్ట్ పాలనకు మోదీ సర్కారు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మతతత్వ సర్కారు అవలంబిస్తున్న విధానాలపై ప్రజల నుంచి నిరసన వస్తోంది. వామపక్ష పార్టీలు మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు విముక్తి కలిగించాలి’’ అని సురవరం అన్నారు.
దేశంలో అవినీతి పెరిగిపోయిందని, రైతులు కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ అనుకూల ఆర్థిక వ్యవస్థ కారణంగా దేశంలో 36 కుటుంబాలకే లబ్ధి కలుగుతోందని, సామాన్యుడు ఛిద్రమై పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వామపక్షాల ఐక్యత గతం కన్నా ఎంతో అవసరమని స్పష్టంచేశారు. ఈ దిశగా ఉమ్మడి పోరాటాలకు సీపీఐ తమ వంతు సహకారం అందిస్తుందన్నారు. వామపక్షాలు మాత్రమే ప్రజలను ఈ దుస్థితి నుంచి గట్టెక్కించగలవని చెప్పారు.
ఇంతటి దుస్థితి ఎప్పుడూ లేదు
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పౌర హక్కులకు ఇంతటి దుస్థితి ఎప్పుడూ లేదని సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఆరోపించారు. బెంగాల్, త్రిపురల్లో ఓటమి వామపక్ష శ్రేణుల్లో కొంత నిరుత్సాహాన్ని కలిగించిందని అన్నారు. అయితే ఢిల్లీ, మహారాష్ట్రల్లో కార్మిక ఆందోళనలు, నాసిక్–ముంబైల వరకు రైతుల ర్యాలీ, విద్యార్థుల ఆందోళనలు దేశంలో మార్పునకు సంకేతాలుగా కనపడుతున్నాయన్నారు.
– దీపాంకర్ భట్టాచార్య, సీపీఐఎంఎల్ నేత
సీపీఎం పెద్దన్న పాత్ర తీసుకోవాలి
దేశంలో వామపక్ష ఐక్యత కోసం కృషి చేయాల్సిన బాధ్యత సీపీఎంపై ఉందని ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ నాయకుడు శివశంకరన్ అన్నారు. దేశంలో ఉన్న వామపక్ష పార్టీల్లో అతిపెద్ద పార్టీ సీపీఎం అని, మహాసభకు హాజరైన వామపక్ష పార్టీలే కాక, విస్తృత వామపక్ష ఐక్య ఉద్యమాలను నిర్మించడంలో సీపీఎం ప్రధాన పాత్ర పోషించాలన్నారు.
– శివశంకరన్, ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ నేత
సవాళ్ల సమయమిది
మతానికి రాజకీయ రంగు పులిమి దేశంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకెళుతోందని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్‌పీ) నాయకుడు మనోజ్ భట్టాచార్య వ్యాఖ్యానించారు. సవాళ్లతో కూడుకున్న ఈ సమయంలో వామపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
– మనోజ్ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పీ నేత
బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి
దేశానికి ప్రస్తుతం మిలిటెంట్ ప్రజాస్వామిక ఉద్యమాలు అత్యవసరమని ఎస్‌యూసీఐ (సీ) నాయకుడు ఆశిష్ భట్టాచార్య అన్నారు. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
– ఆశిష్ భట్టాచార్య, ఎస్‌యూసీఐ(సీ) నేత
Comments
Please login to add a commentAdd a comment