అఖండ భారత్‌ నినాదం దేశానికి ముప్పు  | Suravaram Sudhakar Reddy Slams On PM Narendra Modi Govt | Sakshi
Sakshi News home page

అఖండ భారత్‌ నినాదం దేశానికి ముప్పు 

Published Tue, Aug 23 2022 1:29 AM | Last Updated on Tue, Aug 23 2022 1:29 AM

Suravaram Sudhakar Reddy Slams On PM Narendra Modi Govt - Sakshi

భువనగిరిలో ప్రదర్శన నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు. (ఇన్‌సెట్‌లో) మీడియాతో మాట్లాడుతున్న సురవరం, చాడ వెంకట్‌రెడ్డి 

సాక్షి, యాదాద్రి: ప్రధాని మోదీ తెచ్చిన అఖండ భారత్‌ నినాదంతో దేశానికి పెనుముప్పు పొంచి ఉందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన పరిపాలన గాడితప్పిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పునాదులను పెకిలించి దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడమే అఖండ భారత్‌ నినాదం వెనుక ఉన్న ముప్పు అని వివరించారు.

సోమవారం భువనగిరిలో సీపీఐ జిల్లా మహాసభల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అభ్యుదయ వాదులను, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ పేరిట ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేశారన్నారు. దేశంలో పేదలకు ఉచితాలు వద్దంటూ సంపన్నులకు రాయితీలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.

బడా కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. యూనివర్సిటీల్లో స్కాలర్‌ షిప్‌ తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోదీ ప్రభుత్వం విద్యకు దూరం చేస్తున్నదన్నారు. పార్లమెంట్‌లో విద్యుత్‌ సంస్కరణ బిల్లు ఆమోదం పొందగానే వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలవుతుందని సురవరం చెప్పారు.

పాలు, పెరుగు, చెప్పులు, తలకు రుద్దుకునే నూనెలకు సైతం జీఎస్టీ విధిస్తే పేదలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..  బీజేపీ పాగా వేయకూడదనే మునుగోడులో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement