RSS: హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించటం ఆశయంగా డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ (డాక్టర్ జీ) 1925లో విజయ దశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ను నాగపూర్‌లో స్థాపించారు. ఆ సంస్థ ఈ విజయదశమి రోజున 100వ ఏట ప్రవేశిస్తోంది. ఎటువంటి సభ్యత్వ నమోదు, ఐడెంటిటీ కార్డులు వంటివి లేకుండా ఒక సంస్థను వందేళ్లు దిగ్విజయంగా నడపడం మాటలు కాదు. దాదాపు 80 లక్షల మంది స్వయం సేవకులు కలిగిన 45 లక్షల సంఘస్థాన్ శాఖలు నడుపుతూ ఎటువంటి అంతర్గత కలహాలకూ తావు లేకుండా కొనసాగుతోంది ఆరెస్సెస్.
నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ హెడ్గే వార్‌ని 1921లో విదర్భలోని అకోలా జైలులో ఒక సంవత్సరం రోజులు నిర్బంధించారు. నాడు జైలులోని దేశభక్తుల మధ్య జరిగిన చర్చోపచర్చలలో డాక్టర్ హెడ్గేవార్ మదిలో పురుడు పోసుకున్నదే ఆరెస్సెస్. 1925 నుంచి 1940 వరకు డాక్టర్ హెడ్గేవార్, 1940 నుండి 1973 వరకు మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ), 1973 నుంచి 1993 వరకు మధుకర్ దత్తాత్రేయ దేవరస్‌లు సర్ సంఘ చాలకులుగా పనిచేసి ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికి తమ జీవితాలను ధారపోశారు. ఆరెస్సెస్ సంఘ శాఖలలో మొదటగా ధ్వజారోహణము, ఆసనములు, యోగ, క్రీడలు, ఆటలు, కర్రసాము, సమాజ హిత సూచనలు, భారతీయ చరిత్ర–సంస్కృతి–సంప్రదాయాలను తెలియజేసే ప్రసంగాలు, ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. చివరగా ప్రార్థన వంటి విషయాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.
సమాజంలోని రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, న్యాయవాదులు, డాక్టర్లు, వెనుకబడిన, అణగారిన వర్గాలకు ప్రాతి నిధ్యం వహించే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, ఆరోగ్య భారతి, విద్యా భారతి, స్వదేశీ జాగరణ మంచ్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, సంస్కార భారతి, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ సేవికా సమితి వంటి అనుబంధ సంస్థలను కలిపి ‘సంఘ్ పరివార్’గా భావిస్తారు. ఈ సంస్థలు అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఆయా రంగాలలో అవి పని చేసుకుని పోతున్నప్పటికీ అవసరమైన సందర్భాలలో ఆర్‌ఎస్ ఎస్ నుంచి సలహాలు, సూచనలు ప్రేరణ అందుతాయి.
చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!
1947– 48 మధ్య దేశ విభజన సమయంలో, 1962లో భారత్ – చైనా యుద్ధ సమయంలో, 1972లో భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో, భూకంపం, తుపానులు, కరోనా వంటి విపత్తులు, రైలు ప్రమాదాలు, కరవు కాట కాలు, కరోనా వంటి విపత్తుల సమయంలో ఆరెస్సెస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్ – చైనా యుద్ధ సమయంలో ఆరెస్సెస్ సేవలను గుర్తించిన నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1963లో రిపబ్లిక్ డే కవాతులో ఆరెస్సెస్‌ను పాల్గొనమని ఆహ్వానించడం గమనార్హం. దాదాపు 4 వేల మంది ఆరెస్సెస్ ప్రచారకులుగా (పూర్తి సమయ కార్యకర్తలుగా) కుటుంబ బంధాలకు దూరంగా దేశ, విదేశాల్లో పనిచేస్తూ తమ త్యాగ నిరతిని చాటుతున్నారు.
– ఆచార్య వైవి రామిరెడ్డి
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
(నేడు ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment