సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ఈ దిశలో కార్యాచరణను అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేలా కలిసొచ్చే శక్తులను ఒక్కతాటిపైకి తీసుకురావాలని అభిప్రాయపడింది. బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులను ఎక్కడికక్కడ ఎదుర్కొనేందుకు వీలుగా జాతీయ, రాష్ట్రస్థాయిల్లో లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తుల విశాల వేదిక ఏర్పాటు దిశగా సీపీఐ చొరవ తీసుకోవాలని పలువురు సభ్యులు సూచించినట్లు సమాచారం. గతంలో పాండిచ్చేరిలో చేసిన తీర్మానానికి అనుగుణంగా విశాల ప్రాతిపదికన లెఫ్ట్, డెమోక్రటిక్, సెక్యులర్, సామాజిక శక్తులను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు పార్టీ కృషిని మరింత పెంచాలని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు కోరినట్లు తెలిసింది.
రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం మఖ్దూంభవన్‌లో మొదలైన సందర్భంగా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై నివేదిక సమర్పించారు. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లుతున్న నష్టం, కార్మిక, ఇతర చట్టాలకు తూట్లు పొడవడం, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ఎన్‌ఆర్‌సీ పేరిట మైనారిటీ, ఇతర వర్గాల ప్రజలకు ఇబ్బందులు కల్పించడం, మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, తదితర అంశాలను ప్రస్తావించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
అలాగే ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో కోల్‌కతాలో జరగనున్న పార్టీ జాతీయ నిర్మాణ మహాసభల్లో చర్చించాల్సిన అంశాలు, పార్టీ నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శి నివేదికపై వివిధ రాష్ట్రాల వారీగా సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపాక, ఆదివారం వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
బీజేపీ ప్రభుత్వ వైఖరిపై కార్యాచరణ
Published Sun, Dec 8 2019 3:27 AM | Last Updated on Sun, Dec 8 2019 3:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment