‘సంఘ్’ చర్యలపై దేశవ్యాప్త ఆందోళన
సీపీఐ జాతీయ కార్యవర్గం యోచన
సాక్షి, హైదరాబాద్: దేశంలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న సంఘ్ పరివార్ శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని సీపీఐ భావిస్తోంది. దేశంలో లౌకికత్వం దెబ్బతినేలా, దేశ మౌలిక సూత్రాలను విచ్ఛిన్నం చేసేలా వివిధ రూపా ల్లో బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న మతోన్మాద ఎజెండాకు గట్టి సమాధానాన్ని ఇచ్చేలా ప్రచార కార్యక్రమాలను రూపొం దించాలని యోచిస్తోంది.
తప్పుడు వీడియోలు సృష్టించి జేఎన్‌యూ నేత కన్హయ్యపై దేశద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టడం, జాతీయ మీడి యా ద్వారా దానిపై పెద్దఎత్తున దుష్ర్పచారం సాగించడం వంటి వాటిపై ఉద్యమించే విషయంపై చర్చిస్తోంది. పార్టీగా విడిగా, విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్ పరంగా, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య, లౌకిక, ప్రగతిశీల, సామాజిక సంస్థలు, శక్తులను కలుపుకుని వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. పార్టీ రెండురోజుల జాతీయ కార్యవర్గసమావేశాలు సోమవారం హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి.
జాతీయస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, బీజేపీ ప్రభుత్వ విధానాలు, రిసెర్చీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య, కన్హయ్యపై కేసు, సంఘ్ దూకుడు, బెంగాల్, కేరళ సహా ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాల గురించి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తమ నివేదికలో వివరించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించాలని సీపీఐ జాతీయ కార్యవర్గం తీర్మానించింది. విద్యను, విశ్వవిద్యాలయాలను కాషాయీకరించేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ జాతీయ కార్యవర్గం మరో తీర్మానాన్ని ఆమోదించింది. అలహాబాద్ వర్సిటీలో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ను అడుగు పెట్టకుండా అడ్డుకున్న విద్యార్థి సంఘం అధ్యక్షురాలు రిచాశర్మ వర్సిటీ నుంచి బయటకు వెళ్లగొట్టే ప్రయత్నాలను ఖండించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య ఫ్రంట్ ఏర్పాటు చేసే అంశంపై చర్చిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. జాతీయ కార్యవర్గ భేటీలో దీనిపై చర్చించాక స్పష్టత వస్తుందన్నారు.