ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ నెల 15న నిర్వహించనున్న ఇందిరా పార్కు ఆక్రమణను విజయవంతం చేయాలని భాగస్వామ్య పక్షాలు
ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ నెల 15న నిర్వహించనున్న ఇందిరా పార్కు ఆక్రమణను విజయవంతం చేయాలని భాగస్వామ్య పక్షాలు, ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ఉద్యమంలో పాల్గొనే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక సంఘాలు ధర్నాచౌక్ ఆక్రమణలో భాగస్వాములయ్యేలా చూడాలని తీర్మానించాయి. పోలీసులు అడ్డంకులు సృష్టించినా, నిర్బంధిం చినా పార్కును చేరుకొని ప్రజాకాంక్షను ప్రభుత్వానికి చాటాలని నిర్ణయించాయి. ఇందిరా పార్కు ఆక్రమణ కార్యాచరణపై మంగళవారం రాత్రి మఖ్దూంభవన్‌లో సమావేశం జరిగింది.
ఇందిరాపార్కు నిరసనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రజాసంఘాలు హెచ్చరించాయి. పార్కు ఆక్రమణకు అనుమతి కోరుతూ 11న డీజీపీని, 12న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుసుకోవా లని తీర్మానించాయి. ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ 12న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలపాలని నిర్ణయించాయి. సమావేశంలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), ఎం.కోదండరాం (టీజేఏసీ), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), విమలక్క (అరుణోదయ) తదితరులు పాల్గొన్నారు.