సాక్షి, రంగారెడ్డి : యాదాద్రి జిల్లాలో ఆదివారం జరిగిన దుర్ఘటన మరవక ముందే మరో ఘోర ప్రమాదం ఐదుగురు శ్రమ జీవులను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లింగంపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, ఆటోలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆటోలో కూరగాయలను హైదరాబాద్ తీసుకువస్తూ మృత్యువాత పడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలే ఉండటం హృదయ విదారకం.
వివరాలు.. చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు ప్రతిరోజు కూరగాయలను ఆటోలో వేసుకొని హైదరాబాద్ నగరానికి తీసుకువస్తారు. రోజు వారి మాదిరిగానే సోమవారం కూడా దాదాపు పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన శీను ఆటోలో కూరగాయలు వేసుకొని నగరానికి బయలుదేరారు. మంచాల మండలం లింగంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడిక్కడే తుది శ్వాస విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను చికిత్స కోసం ఇబ్రహీం పట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు ఆటో డ్రైవర్ శీను, సుజాత, మాధవి, మారు, అఫిలీగా గుర్తించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment