auto - car collision
-
కోవూరుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
బిట్రగుంట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న 15 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా సర్వాయపాళెంకు చెందిన తాతా రమణమ్మ (55)ను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మృతి చెందింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కావలి మండలం సర్వాయపాళెం పంచాయతీ కోనేటివారిపాళెంకు చెందిన 15 మంది కూలీలు దగదర్తి మండలం ఉప్పరపాళెంలో మిరప కోతలకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి ఆటోలో వెళుతుండగా చెన్నై నుంచి ఏలూరు వెళుతున్న కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి ముందు వెళుతున్న కూలీల ఆటోను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో రెండుసార్లు బోల్తాకొట్టి రోడ్డు మార్జిన్లో పడిపోయింది. కూలీలంతా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బిట్రగుంట ఎస్ఐ చినబలరామయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. వారిలో తాతా రమణమ్మ అనే మహిళ మార్గమధ్యంలో మృతిచెందింది. -
రోడ్డు ప్రమాదం.. కారణమైన ఇద్దరు అరెస్టు..
సాక్షి, రంగారెడ్డి : గత నాలుగు రోజుల క్రితం(జూన్ 25వ తేది) రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లింగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఐదు మంది మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంచార్జ్ డీసీపీ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. కారు డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపినట్లు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఒప్పుకున్నారని చెప్పారు. అందుచేతనే ప్రమాదం జరిగిందని డీసీపీ తెలిపారు. వీరంతా ఆటోలో కూరగాయలను హైదరాబాద్ తీసుకువస్తూ మృత్యువాత పడ్డిన విషయం విదితమే. మృతుల్లో నలుగురు మహిళలే ఉండటం హృదయ విదారకం. సంబంధిత వార్త : కారు-ఆటో ఢీ : ఐదుగురి మృతి -
కారు ఆటో ఢీ, ఐదుగురి మృతి
-
లింగంపల్లిలో ఘోర ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి : యాదాద్రి జిల్లాలో ఆదివారం జరిగిన దుర్ఘటన మరవక ముందే మరో ఘోర ప్రమాదం ఐదుగురు శ్రమ జీవులను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లింగంపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, ఆటోలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆటోలో కూరగాయలను హైదరాబాద్ తీసుకువస్తూ మృత్యువాత పడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలే ఉండటం హృదయ విదారకం. వివరాలు.. చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు ప్రతిరోజు కూరగాయలను ఆటోలో వేసుకొని హైదరాబాద్ నగరానికి తీసుకువస్తారు. రోజు వారి మాదిరిగానే సోమవారం కూడా దాదాపు పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన శీను ఆటోలో కూరగాయలు వేసుకొని నగరానికి బయలుదేరారు. మంచాల మండలం లింగంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడిక్కడే తుది శ్వాస విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను చికిత్స కోసం ఇబ్రహీం పట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు ఆటో డ్రైవర్ శీను, సుజాత, మాధవి, మారు, అఫిలీగా గుర్తించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
ఆటో, కారు ఢీ: నలుగురికి గాయాలు
నల్లగొండ(భువనగిరి అర్బన్): ఆటోను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది. భువనగిరి మండలంలోని రాయగిరి శివారులో ఆటోను కారు వెనక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా ముత్తిరెడ్డి గూడెంకు చెందిన వారని సమాచారం.