ఇబ్రహీంపట్నం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం టికెట్‌పై ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. చివరి నిమిషంలో టీడీపీ నేత సామ రంగారెడ్డి బీ–ఫారానికి నోచుకోకపోవడం సస్పెన్స్‌ని తలపిస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీకి దక్కడం.. అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు ఇష్టం లేకపోయినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పట్నం నుంచి పోటీ చేస్తానని సామ పేర్కొన్నారు.
అయితే ఆదివారం ఎన్‌టీఆర్ భవన్‌లో బీ–ఫారాల అందజేత కార్యక్రమానికి హాజరైన సామ రంగారెడ్డికి చుక్కెదురైంది. పార్టీ బీ–ఫారం ఇవ్వకపోవడంతో ఆయన నిర్ఘాంతపోయారు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు అక్కడే ఉన్నసామ రంగారెడ్డి చివరకు ఖాళీచేతులతో వెనుదిరిగారు.
రాజేంద్రనగర్ టీడీపీ అభ్యర్థి గణేష్‌గుప్తాకు పార్టీ బీఫాం అందజేసింది. బీ–ఫారాలు అందుకున్న 12 మంది నేతలతో ఆ పార్టీ ప్రతిజ్ఞ చేయించింది. ప్రతిజ్ఞ చేసిన వారిలో సామ సైతం ఉన్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆయనకు బీ–ఫారం అందజేయలేదని.. ఆయన సన్నిహితులు చెబుతున్నా వ్యూహాత్మకంగానే పక్కన బెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోపక్క టీడీపీ సీనియర్ నేత, స్థానికుడు రొక్కం భీంరెడ్డి సైతం ఈ స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో మంతనాలు మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఆయన అమరావతికి వెళ్లి బాబుని కలిశారు. 37 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నానని, ఇబ్రహీంపట్నం సీటును తనకే కేటాయించాలని కోరినట్లు సమాచారం.
అంతేగాక ఇబ్రహీంపట్నం స్థానానికి సామ రంగారెడ్డి పేరు ఖరారు చేయడంపై కాంగ్రెస్ కాస్త విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈయన స్థానికేతరుడని, ఈ నియోజకవర్గంలో పెద్దగా పట్టులేదని భావిస్తోంది. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న కాంగ్రెస్.. ఎన్నికల్లో సామ గెలుపు అంత సులువుకాదనే పునరాలోచనలో పడినట్లు సమాచారం.
దీంతో ఈ స్థానం తమకే కావాలని టీడీపీ అధిష్టానంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈ స్థానంపై కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి సైతం ఆశలు వదులుకోకపోవడం మరింత బాలాన్ని చేకూర్చుతోంది. పార్టీ తనకే బీ–ఫారం ఇస్తుందని ధీమా వ్యక్తం చేయడంతోపాటు సోమవారం నామినేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది
Comments
Please login to add a commentAdd a comment