sama rangareddy
-
రంగారెడ్డిలో టీడీపీకి షాక్!
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా ఆధ్వర్యంలో త్వరలో బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో టీడీపీ నాయకత్వ లోపంతోనే పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పథకాలకు ఆకర్షితులై ప్రజా పాలన కోసం బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని, జిల్లాకు చెందిన నేతలందరూ బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు. -
గాంధీభవన్‌లోకి దూసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు!
సాక్షి, హైదరాబాద్: మల్రెడ్డి బ్రదర్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాంధీభవన్‌లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలను అడ్డుకునే ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ మిత్రద్రోహానికి పాల్పడుతోందని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం టికెట్‌ను మహాకూటమికి కేటాయిస్తే.. మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరపున నామినేషన్ వేసి కాంగ్రెస్ జెండాలతో ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అభ్యర్థి సామ రంగారెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మల్రెడ్డి బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. కాంగ్రెస్ కార్యకర్తల్ని సామ రంగారెడ్డి విజయం కోసం కృషి చేసే విధంగా టీపీసీసీ ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. మల్రెడ్డి బ్రదర్స్‌ను సస్పెండ్ చేసే వరకూ గాంధీభవన్ నుంచి కదిలేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. -
గాంధీభవన్‌లోని దూసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు!
-
సామ రంగారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు
నాంపల్లి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై నాంపల్లి పోలీసు స్టేషన్లో చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లక్ష్మారెడ్డి, రాజ్ కుమార్ 2005లో ‘ధృవతార’ పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో భాగంగా భూములు కొనుగోలు చేసి ఇల్లను నిర్మించేవారు. వీరు కొండాపూర్‌లో 2178 గజాల భూమిని కొనుగోలు చేసి భవన నిర్మాణం చేపట్టగా టీడీపీ నేత సామ రంగారెడ్డి అందులో భాగస్వామిగా చేరారు. 2010లో ప్రాజెక్టు సభ్యుడైన రాజ్ కుమార్‌ను తొలగించి సామ రంగారెడ్డి భార్య అలివేలును భాగస్వామిగా చేర్చుకున్నారు. అనంతరం 2015లో లక్ష్మారెడ్డిని కూడా తొలగించి సాయి విక్రమ్ రెడ్డి, జగదీష్‌రెడ్డి, అరవింద్‌రెడ్డిలను భాగస్వాములుగా చేర్చుకోవడమేగాకుండా కొండాపూర్‌లో కొనుగోలు చేసిన ఆస్తిని అమ్మేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మారెడ్డి తన సంతకాలను ఫోర్జరీ చేసి మోసం చేశారని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ గురువారం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం రెడ్‌హిల్స్‌లో ఉన్నందున తాము కేసును నమోదు చేసినట్లు నాంపల్లి ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
పట్నంలో హై‘డ్రామా’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం టికెట్‌పై ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. చివరి నిమిషంలో టీడీపీ నేత సామ రంగారెడ్డి బీ–ఫారానికి నోచుకోకపోవడం సస్పెన్స్‌ని తలపిస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీకి దక్కడం.. అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు ఇష్టం లేకపోయినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పట్నం నుంచి పోటీ చేస్తానని సామ పేర్కొన్నారు. అయితే ఆదివారం ఎన్టీఆర్ భవన్లో బీ–ఫారాల అందజేత కార్యక్రమానికి హాజరైన సామ రంగారెడ్డికి చుక్కెదురైంది. పార్టీ బీ–ఫారం ఇవ్వకపోవడంతో ఆయన నిర్ఘాంతపోయారు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు అక్కడే ఉన్నసామ రంగారెడ్డి చివరకు ఖాళీచేతులతో వెనుదిరిగారు. రాజేంద్రనగర్ టీడీపీ అభ్యర్థి గణేష్‌గుప్తాకు పార్టీ బీఫాం అందజేసింది. బీ–ఫారాలు అందుకున్న 12 మంది నేతలతో ఆ పార్టీ ప్రతిజ్ఞ చేయించింది. ప్రతిజ్ఞ చేసిన వారిలో సామ సైతం ఉన్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆయనకు బీ–ఫారం అందజేయలేదని.. ఆయన సన్నిహితులు చెబుతున్నా వ్యూహాత్మకంగానే పక్కన బెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క టీడీపీ సీనియర్ నేత, స్థానికుడు రొక్కం భీంరెడ్డి సైతం ఈ స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో మంతనాలు మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఆయన అమరావతికి వెళ్లి బాబుని కలిశారు. 37 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నానని, ఇబ్రహీంపట్నం సీటును తనకే కేటాయించాలని కోరినట్లు సమాచారం. అంతేగాక ఇబ్రహీంపట్నం స్థానానికి సామ రంగారెడ్డి పేరు ఖరారు చేయడంపై కాంగ్రెస్ కాస్త విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈయన స్థానికేతరుడని, ఈ నియోజకవర్గంలో పెద్దగా పట్టులేదని భావిస్తోంది. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న కాంగ్రెస్.. ఎన్నికల్లో సామ గెలుపు అంత సులువుకాదనే పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీంతో ఈ స్థానం తమకే కావాలని టీడీపీ అధిష్టానంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈ స్థానంపై కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి సైతం ఆశలు వదులుకోకపోవడం మరింత బాలాన్ని చేకూర్చుతోంది. పార్టీ తనకే బీ–ఫారం ఇస్తుందని ధీమా వ్యక్తం చేయడంతోపాటు సోమవారం నామినేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది -
పట్నంలో పోటీకి ఓకే
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం స్థానం నుంచి పోటీ చేసేందుకు సామ రంగారెడ్డి అంగీకరించారు. మొదటి నుంచి ఎల్బీనగర్లో పోటీ చేయాలని ఆయన ఆసక్తి కనబరిచినా కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి పోయింది. దీంతో ఇబ్రహీంపట్నం సీటు టీడీపీకి దక్కింది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. అయితే, పట్నంలో పోటీచేసేందుకు రంగారెడ్డి ససేమిరా అన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడేందుకు అమరావతికి వెళ్లారు. బాబు బుజ్జగింపులతో మొత్తబడ్డ ఆయన ఎట్టకేలకు పోటీకి అంగీకారం తెలిపారు. కాగా, ఈ టికెట్‌ను ఆశించి భంగపడ్డ రొక్కం భీంరెడ్డికి నచ్చజెప్పి రెబల్‌గా నిలబడకుండా టీడీపీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. క్యామ మల్లేష్‌తో సామ భేటీ కాంగ్రెస్ పార్టీలో మల్రెడ్డి రంగారెడ్డికి ప్రత్యర్థిగా నిలిచిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌తో టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. అయితే, తనకు అన్యాయం చేసిన పీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వ్యతిరేకం తప్ప మహాకూటమికి కాదని మల్లేష్ తెలిపారు. తన సంపూర్ణ మద్దతు ఉంటుందని సామ రంగారెడ్డికి చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా మల్రెడ్డి! పట్టు వదలకుండా ఢిల్లీలో తిష్టవేసి కాంగ్రెస్ టికెట్ కోసం పైరవీలు చేస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి తనకు టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే మల్రెడ్డి బరిలో ఉంటే క్యామ మల్లేష్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
పట్నం... సంచలనం
ఇబ్రహీంపట్నం రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్, అమరావతిలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలకు ఈ నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. కూటమిలో భాగంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సీట్ల సర్దుబాటు ఇందుకు కారణమైంది. మహాకూటమి అభ్యర్థిగా సామ రంగారెడ్డి (టీడీపీ)ని ఆ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించినప్పటి నుంచి ఒక్కసారిగా వేడెక్కిన పట్నం రాజకీయాలు గురువారమంతా హల్చల్ చేశాయి. టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే హస్తినకేగిన మల్రెడ్డి రంగారెడ్డి పార్టీ హైకమాండ్ వద్ద టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటుండగా, ఇదే స్థానాన్ని ఆశించిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సంచలనానికి తెరలేపారు. ఏకంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ కుమారుడిపైనే అవినీతి ఆరోపణలు చేసిన ఆయన అందుకు సాక్ష్యంగా ఆడియో రికార్డులు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. టికెట్రాని కాంగ్రెస్ నేతల పరిస్థితి ఇలా ఉంటే.. టికెట్ వచ్చిన టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. టికెట్ వచ్చినందుకు సంతోషపడాలో.. పట్నంలో పోటీ చేయమన్నందుకు ఆవేదన చెందాలో అర్థంకాని పరిస్థితుల్లో ఆయన అమరావతి బాట పట్టాల్సి వచ్చింది. బుధవారం రాత్రి పేరు ప్రకటించగా, గురువారం తెల్లారేసరికి తన అనుచరులతో కలిసి అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. తనకు ఈ సీటు వద్దేవద్దని పార్టీ అధినేత చంద్రబాబును వేడుకున్నారు. అయినా, బాబు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కచ్చితంగా పోటీచేయాలని తాను ప్రచారానికి వస్తానని.. గెలిపిస్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. సామను దారిలోకి తీసుకువచ్చే బాధ్యత మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు అప్పగించడం గమనార్హం. మొత్తంమీద గురువారం పట్నం రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఈ నియోజకవర్గంలో వైరివర్గాలుగా వ్యవహరిస్తున్న డీసీసీ సారథి మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు ఇరువురు టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నించారు. సామాజిక సమీకరణలు, పార్టీ పెద్దల సిఫార్సు లేఖలతో తలపట్టుకున్న అధిష్టానం.. ఈ టికెట్‌ను ఎవరికీ కేటాయించకుండా పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. మరోవైపు సీట్ల సర్దుబాటులో భాగంగా ఎల్బీనగర్ సీటు తమకివ్వాలని టీడీపీ పట్టుబట్టింది. ఈ స్థానంలో తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్థిగా సుధీర్‌రెడ్డి ఉన్నందున కాంగ్రెస్ ససేమిరా అంది. దీని స్థానే ఇబ్రహీంపట్నంను ప్రతిపాదించింది. తద్వారా ఈ వర్గ రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందని హస్తం పెద్దలు భావించారేమో కాబోలు. అయితే, ఎల్బీనగర్ బరిలో నిలవాలనే కృతనిశ్చయంలో ఉన్న సామ రంగారెడ్డిని ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామంతో ఇటు కాంగ్రెస్ ఆశావహులు మల్రెడ్డి సోదరులు, క్యామ.. అటు టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నివ్వెరపోయారు. తాను అడిగింది గాకుండా మరో స్థానం ఇవ్వడంపై సామ కంగుతిన్నారు. ఎల్బీనగర్గాకుండా పట్నం నుంచి పోటీచేసేది లేదని తేల్చిచెప్పారు. ఇదే అదనుగా మల్రెడ్డి బ్రదర్స్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోటీకి సామ నిరాకరణను అనువుగా చేసుకొని ఇబ్రహీంపట్నం సీటును కాంగ్రెస్‌కు వదిలేలా అటు టీడీపీ.. ఇటు సొంత పార్టీలోనూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీతో ఈ అంశంపై మాట్లాడినట్లు తెలిసింది. సీన్ కట్ చేస్తే.. సామ రంగారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పరిస్థితి ఇలా ఉండగా క్యామ మల్లేశ్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. టికెట్లను అమ్ముకున్నారంటూ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆడియో టేపులు విడుదల చేశారు. దీంతో ఆయన రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లుగానే భావించవచ్చు. మరోవైపు సామ రంగారెడ్డి పోటీచేయడానికి సుముఖంగా లేకపోవడాన్ని గమనించిన సీనియర్ నేత రొక్కం భీంరెడ్డి.. స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహించేది లేదని, తనకు కేటాయించాలని అసమ్మతి స్వరం వినిపించారు. అంతేగాకుండా తన తరఫున భార్యతో నామినేషన్ కూడా వేయించారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం రాజకీయం రసవత్తర నాటకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. -
నేనే ఇబ్రహీంపట్నం అభ్యర్థిని..
హైదరాబాద్: టీడీపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు రెండు పార్టీలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. పొత్తుల్లో భాగంగా సీట్లు వదుకోవాల్సి రావడంతో స్థానికంగా ఉన్న బలమైన నేతలను బుజ్జగించడానికి వేరే నియోజకవర్గ టికెట్ కేటాయించాల్సి వస్తోంది. దీంతో అక్కడ ఉన్న అభ్యర్థులు తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థిని తానేనంటూ టీడీపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం టీడీపీ ఇంచార్జ్ రొక్కం భీం రెడ్డి ప్రకటించుకున్నారు. టీడీపీ అదిష్టానం సామ రంగారెడ్డికి ఎల్బీనగర్ కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టికెట్ కేటాయించిన సంగతి తెల్సిందే. అప్పటిదాకా ఇబ్రహీంపట్నంలో టీడీపీ కార్యక్రమాలను, పార్టీ బరువు బాధ్యతలను మోసిన రొక్కం భీం రెడ్డికి కాకుండా సామ రంగారెడ్డికి కేటాయించడంతో భీంరెడ్డి వర్గీయులు కోపంగా ఉన్నారు. గురువారం వనస్తలిపురంలోని వైదేహినగర్లో భీం రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పని చేస్తున్నానని తెలిపారు. గత 35 సంవత్సరాలుగా పార్టీలో వివిధ పదవుల్లో ఉంటూ ప్రజాసేవ చేశానని, టికెట్ ఇస్తానని గత సంవత్సరమే తనకు టీడీపీ అధిష్టానం నుంచి హామీ వచ్చిందని, తీరా ఎన్నికల వేళ ఇలా చేయడం బాగాలేదన్నారు. గత రెండు నెలల నుంచి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నానని, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. నిన్న టీడీపీ ప్రకటించిన అభ్యర్థి సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నంలో పోటీ చేయడానికి సుముఖంగా లేరని, తానే టీడీపీ తరపున ఇబ్రహీంపట్నం అభ్యర్థినని చెప్పారు. ఎల్బీనగర్ సీటు ఇప్పించండి: సామ అమరావతి: ఎల్బీనగర్ సీటు కావాలని కోరుతూ సామ రంగా రెడ్డి ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలో కలిశారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఎల్బీనగర్ సీటు వెళ్లిపోయిందని, ఇప్పుడేమీ చేయలేమని సామకు చంద్రబాబు తెలిపారు. పరిస్థితిని అర్ధం చేసుకుని ఇబ్రహీంపట్నంలో పోటీ చేయాలని సామకు బాబు సూచించినట్లు తెలిసింది. సామ రంగారెడ్డి గెలుపునకు పార్టీ పూర్తి సహకారం ఉంటుందని కూడా చెప్పారు. ఎల్బీనగర్ టికెట్ దక్కక పోవానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణయే కారణమని ఆరోపిస్తూ సామ అనుచరులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. సామ అనుచరులకు నామా నాగేశ్వరరావు సర్దిచెప్పి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సామ రంగారెడ్డిని వెంటబెట్టుకుని నామా నాగేశ్వరరావు హైదరాబాద్ బయలుదేరారు. -
అమరావతిలోనే తేల్చుకుంటా..
హైదరాబాద్: సీట్ల పంపకం మహాకూటమికి పెద్ద తలనొప్పిగా మారింది. రెండు స్థానాలతో టీడీపీ నిన్న విడుదల జాబితా.. కాంగ్రెస్‌లో అసమ్మతిని రాజేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడం పట్ల సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంపై మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్లు తీవ్రంగా రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో మల్రెడ్డి ఉన్నట్లుగా తెలిసింది. అవసరమైతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగుతానని అనుచరులతో చెప్పినట్లు వార్తలు వినపడుతున్నాయి. క్యామ మల్లేష్ కూడా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే వనస్థలిపురంలోని ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి అనుచరులు మంతనాలు కూడా జరిపారు. మల్రెడ్డి సోదరుడు రాంరెడ్డి, సామ రంగారెడ్డితో రహస్య భేటీ జరిపినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థిగా సామ రంగారెడ్డి పేరు ప్రకటించడంపై మల్రెడ్డి, క్యామ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ విషయమై అమరావతి వెళ్లి చంద్రబాబు వద్దనే తేల్చుకుంటానని సామ రంగారెడ్డి చెప్పినట్లుగా తెలిసింది. ఎల్బీనగర్ కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని తనకు కేటాయించడంపట్ల సామ రంగారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 11 ఏళ్ల నుంచి టీడీపీని ఎల్బీనగర్లో బలోపేతం చేశానని సామ రంగారెడ్డి మీడియాతో తెలిపారు. ఎల్బీనగర్లో ఏ వార్డులోనూ కాంగ్రెస్‌కు టీడీపీ కంటే ఆధిక్యం రాదని అన్నారు. ఇబ్రహీంపట్నం టికెట్ తనకు రావడంతో కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి తన వద్దకు వచ్చి మంతనాలు జరిపారని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం టికెట్ ఎందుకు తనకు ఇచ్చారని మల్రెడ్డి ప్రశ్నించారని తెలిపారు. దమ్మూ, ధైర్యం లేని నేతల వద్ద పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
మరో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ తాజాగా మరో ఇద్దరు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించింది. ఇబ్రహీంపట్నం నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి గణేశ్‌గుప్తాలు టీడీపీ తరఫున పోటీచేస్తారని బుధవారం ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో టీడీపీ పోటీ చేయాలనుకుంటున్న 14 స్థానా ల్లో 11 చోట్ల అభ్యర్థులను ప్రకటించినట్టయింది. సామ ఎల్బీనగర్ స్థానాన్ని ఆశించగా, ఆయన్ను ఇబ్ర హీంపట్నం అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. ఇదేందబ్బా? ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ స్థానాలను అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించడంపై ఆయా స్థానాలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నా రు. ఇబ్రహీంపట్నం స్థానా న్ని ఆశించిన రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ బుధవారం మధ్యాహ్నమే తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నేడో, రేపో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అదే స్థానాన్ని ఆశించిన మరో నేత మల్రెడ్డి రంగారెడ్డి బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇక రాజేంద్రనగర్ స్థానాన్ని సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఆశించారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేశ్ సైతం ఆ స్థానంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సీటును అనూహ్యంగా టీడీపీకి కేటాయించడంతో వారిద్దరూ ఆందోళన చెందుతున్నారు. -
టీడీపీలో ఎల్బీనగర్ చిచ్చు
తెలుగుదేశం పార్టీకి ఎల్బీ నగర్ నియోజకవర్గం చుక్కలు చూపిస్తోంది. నగర శివార్లలో ఎక్కువగా సీమాంధ్ర సెటిలర్లు ఉండే ఈ నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీ తరఫున ఇన్నాళ్ల నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కృష్ణప్రసాద్‌తో పాటు, ఎన్నాళ్లుగానో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామా రంగారెడ్డి కూడా గట్టిగా ప్రయత్నించారు. అయితే, బీసీ వర్గం ఓట్లను దండుకోడానికి ఆర్.కృష్ణయ్యను పార్టీలో చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయనను ఎల్బీనగర్ నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇది ఒక్కసారిగా అటు కృష్ణప్రసాద్, ఇటు సామా రంగారెడ్డి ఇద్దరికీ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇన్నాళ్ల నుంచి పార్టీ జెండాను మోస్తూ, అధికారంలో లేకపోయినా ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ప్రాంతంలో పార్టీ ఉనికిని ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న కృష్ణప్రసాద్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా మోసినవాళ్లను కాదని, టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన కృష్ణప్రసాద్.. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎన్నాళ్ల నుంచో పార్టీని అంటిపెట్టుకుని, ఈ ప్రాంతంతో చిరకాల అనుబంధం ఉన్న సామా కుటుంబానికి చెందని నాయకుడు సామా రంగారెడ్డి కూడా చంద్రబాబు నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన వర్గీయులైతే ఏకంగా ఆర్.కృష్ణయ్య వాహనంపై దాడికి దిగారు. ఆయనను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుపడేందుకు కూడా ప్రయత్నించారు. చివరకు సామా రంగారెడ్డి కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.