తెలుగుదేశం పార్టీకి ఎల్బీ నగర్ నియోజకవర్గం చుక్కలు చూపిస్తోంది. నగర శివార్లలో ఎక్కువగా సీమాంధ్ర సెటిలర్లు ఉండే ఈ నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీ తరఫున ఇన్నాళ్ల నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కృష్ణప్రసాద్తో పాటు, ఎన్నాళ్లుగానో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామా రంగారెడ్డి కూడా గట్టిగా ప్రయత్నించారు. అయితే, బీసీ వర్గం ఓట్లను దండుకోడానికి ఆర్.కృష్ణయ్యను పార్టీలో చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయనను ఎల్బీనగర్ నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇది ఒక్కసారిగా అటు కృష్ణప్రసాద్, ఇటు సామా రంగారెడ్డి ఇద్దరికీ తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఇన్నాళ్ల నుంచి పార్టీ జెండాను మోస్తూ, అధికారంలో లేకపోయినా ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ప్రాంతంలో పార్టీ ఉనికిని ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న కృష్ణప్రసాద్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా మోసినవాళ్లను కాదని, టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన కృష్ణప్రసాద్.. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఇక ఎన్నాళ్ల నుంచో పార్టీని అంటిపెట్టుకుని, ఈ ప్రాంతంతో చిరకాల అనుబంధం ఉన్న సామా కుటుంబానికి చెందని నాయకుడు సామా రంగారెడ్డి కూడా చంద్రబాబు నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన వర్గీయులైతే ఏకంగా ఆర్.కృష్ణయ్య వాహనంపై దాడికి దిగారు. ఆయనను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుపడేందుకు కూడా ప్రయత్నించారు. చివరకు సామా రంగారెడ్డి కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
టీడీపీలో ఎల్బీనగర్ చిచ్చు
Published Wed, Apr 9 2014 3:40 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement