
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం లేదా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నందున దీనిపై తమ వాదనలు కూడా వినాలంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మరో నలుగురు ఉమ్మడి హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఆర్.కృష్ణయ్యతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీసీ సంఘాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ముద్రగడ తదితరుల తరఫున సీనియర్ న్యాయవాది జి.గంగయ్యనాయుడు వాదనలు వినిపించనున్నారు.
తొలుత మాకు నోటీసులిచ్చి వాదనలు వినాలి
‘కాపులు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాల ప్రజలను బీసీల్లో చేర్చాలంటూ ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నాం. సామాజిక, విద్యా, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మా వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతి కోసం దశాబ్దాలుగా ఉద్యమాలు కొనసాగిస్తున్నాం. మా డిమాండ్ న్యాయమైందని బీసీ సంఘం కూడా తన నివేదికలో చెప్పింది. కాపులను బీసీల్లో చేర్చటాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు మాకు తెలిసింది. ఈ వ్యవహారంలో మా వాదనలు వినకుండా ఏవైనా ఆదేశాలిస్తే మాకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. కాపులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే తొలుత మాకు నోటీసులు ఇచ్చి మా వాదనలు వినండి’అని ముద్రగడ తదితరులు తమ కేవియట్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.