ఎల్బీనగర్ నియోజకవర్గం రాజకీయ నాయకులకు చిత్ర విచిత్రాలు చూపిస్తోంది. ఇక్కడ నుంచి బరిలోకి దిగుదామనుకున్న చాలా పార్టీల్లో అభ్యర్థుల విషయంలో గందరగోళం నెలకొంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు టికెట్ కేటాయించారు. అయితే, ఇన్నాళ్ల నుంచి పార్టీ జెండాను మోస్తూ, అధికారంలో లేకపోయినా ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ప్రాంతంలో పార్టీ ఉనికిని ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న కృష్ణప్రసాద్ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా మోసినవాళ్లను కాదని, టికెట్లు అమ్ముకుంటున్నారన్న అపప్రథ ఇప్పటికే టీడీపీ విషయంలో గట్టిగా వినవస్తోంది. ఇప్పుడు తాజా పరిణామాలతో ఇది మరోసారి రుజువైందని స్థానిక నాయకులు మండిపడుతున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన కృష్ణప్రసాద్.. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచే తాను రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆర్.కృష్ణయ్యకు టీడీపీ కేడర్ ఎంతవరకు సహకరిస్తుందన్నది అనుమానమే. కేవలం బీసీ సంఘాల కార్యకర్తల బలంతోనే కృష్ణయ్య ఇక్కడి నుంచి అనేది అంత సులభం కాదు.
ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కాదని, తన సొంత మనిషి ముద్దసాని రామ్మోహన్ గౌడ్కు టికెట్ ఇప్పించుకోవాలని మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ విశ్వప్రయత్నాలు చేశారు. అయితే, సుధీర్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి, తన టికెట్ ఖరారు చేయించుకున్నారు. దీంతో రామ్మోహన్ గౌడ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా ఎల్బీనగర్ బరిలోకి దిగాలనుకున్నారు.
సరిగ్గా ఇక్కడే సర్వే చక్రం తిప్పారు. ఏం చేశారో తెలియదు గానీ.. తెల్లవారేసరికి టీఆర్ఎస్ జాబితాలో రామ్మోహన్ గౌడ్ పేరు కనిపించింది. సోమవారం వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన అసలు ఎప్పుడు టీఆర్ఎస్లో చేరారో, ఎప్పుడు టికెట్ కోసం ప్రయత్నించారో, ఎలా సాధించారో ఎవ్వరికీ తెలియలేదు. టికెట్ మాత్రం ఇట్టే వచ్చేసింది.
అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఎల్బీనగర్
Published Wed, Apr 9 2014 11:12 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement