
హైదరాబాద్: టీడీపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు రెండు పార్టీలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. పొత్తుల్లో భాగంగా సీట్లు వదుకోవాల్సి రావడంతో స్థానికంగా ఉన్న బలమైన నేతలను బుజ్జగించడానికి వేరే నియోజకవర్గ టికెట్ కేటాయించాల్సి వస్తోంది. దీంతో అక్కడ ఉన్న అభ్యర్థులు తిరుగుబాటు చేస్తున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థిని తానేనంటూ టీడీపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం టీడీపీ ఇంచార్జ్ రొక్కం భీం రెడ్డి ప్రకటించుకున్నారు. టీడీపీ అదిష్టానం సామ రంగారెడ్డికి ఎల్బీనగర్ కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టికెట్ కేటాయించిన సంగతి తెల్సిందే. అప్పటిదాకా ఇబ్రహీంపట్నంలో టీడీపీ కార్యక్రమాలను, పార్టీ బరువు బాధ్యతలను మోసిన రొక్కం భీం రెడ్డికి కాకుండా సామ రంగారెడ్డికి కేటాయించడంతో భీంరెడ్డి వర్గీయులు కోపంగా ఉన్నారు. గురువారం వనస్తలిపురంలోని వైదేహినగర్‌లో భీం రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పని చేస్తున్నానని తెలిపారు. గత 35 సంవత్సరాలుగా పార్టీలో వివిధ పదవుల్లో ఉంటూ ప్రజాసేవ చేశానని, టికెట్ ఇస్తానని గత సంవత్సరమే తనకు టీడీపీ అధిష్టానం నుంచి హామీ వచ్చిందని, తీరా ఎన్నికల వేళ ఇలా చేయడం బాగాలేదన్నారు. గత రెండు నెలల నుంచి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నానని, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. నిన్న టీడీపీ ప్రకటించిన అభ్యర్థి సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నంలో పోటీ చేయడానికి సుముఖంగా లేరని, తానే టీడీపీ తరపున ఇబ్రహీంపట్నం అభ్యర్థినని చెప్పారు.
ఎల్‌బీనగర్ సీటు ఇప్పించండి: సామ
అమరావతి: ఎల్బీనగర్ సీటు కావాలని కోరుతూ సామ రంగా రెడ్డి ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలో కలిశారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఎల్‌బీనగర్ సీటు వెళ్లిపోయిందని, ఇప్పుడేమీ చేయలేమని సామకు చంద్రబాబు తెలిపారు. పరిస్థితిని అర్ధం చేసుకుని ఇబ్రహీంపట్నంలో పోటీ చేయాలని సామకు బాబు సూచించినట్లు తెలిసింది. సామ రంగారెడ్డి గెలుపునకు పార్టీ పూర్తి సహకారం ఉంటుందని కూడా చెప్పారు. ఎల్‌బీనగర్ టికెట్ దక్కక పోవానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణయే కారణమని ఆరోపిస్తూ సామ అనుచరులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. సామ అనుచరులకు నామా నాగేశ్వరరావు సర్దిచెప్పి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సామ రంగారెడ్డిని వెంటబెట్టుకుని నామా నాగేశ్వరరావు హైదరాబాద్ బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment