2014 ఎన్నికల్లో నేను ఓడి కాంగ్రెస్ నాయకులు జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా.. మా అధినేత కేసీఆర్ జగిత్యాలను ఏనాడూ చిన్నచూపు చూడలేదు. నాలుగేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,250 కోట్లు కేటాయించి అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇక్కడి ప్రజలకు అందించారు. జిల్లా ఏర్పాటు.. జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు.. రాయికల్ మున్సిపాలిటీ దాని అభివృద్ధికి రూ. 25 కోట్ల మంజూరు దీనికి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరు చేయిస్తా. పట్టణ ప్రజల దశాబ్దాల కల యావర్‌రోడ్డు, పాత బస్టాండు విస్తరణ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం..’ అంటున్నారు జగిత్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్. ఆయన బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి.. ప్రచార తీరు.. హామీలు.. గెలుపు అవకాశాలు ఆయన మాటల్లోనే..
సాక్షి, జగిత్యాల: 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనతో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ఆ రెండు పార్టీల పుణ్యమా అని 1956లో ఏర్పాటైన జగిత్యాల మున్సిపాలిటీ ఇప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. పట్టణ ప్రజల దశాబ్దాల కల యావర్‌రోడ్డు విస్తరణ అంశాన్నీ ఆయా పార్టీలు పట్టించుకోలేదు. 58 ఏళ్లలో ఆయా పార్టీల పనితీరు.. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పనితీరు ప్రజల ముందుంది. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో అద్భుత పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారంచుట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ టీఆర్‌ఎస్ నెరవేర్చింది. డాక్టర్‌గా ప్రజల్లో నాకు మంచి ఆదరణ, గౌరవం ఉంది. ఇవే నా గెలుపునకు సహకరిస్తాయి. ప్రజల ఆశీర్వాదంతో ఈ సారి జగిత్యాలపై గులాబీ జెండా ఎగరేయబోతున్నాం. ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు.
ఓడినా ప్రజల మధ్యే..
వృత్తిరీత్యా నేను కంటి వైద్యనిపుణుడిని. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఇప్పటి వరకు 50వేల కంటి ఆపరేషన్లు ఉచితంగా చేశా. 2014 సాధారణ ఎన్నికలకు కొన్నిరోజుల ముందే నేను టీఆర్‌ఎస్‌లో చేరిన. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పార్టీ తరఫున జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయా. రాష్ట్రంలో మాత్రం మా పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఓడినా నిరుత్సాహపడలే. నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజు నుంచి ఇప్పటి వరకు ప్రజల మధ్యలోనే ఉంటున్న. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలందరికీ వివరిస్తూ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసిన. పార్టీ అధిష్టానం ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న. నిజామాబాద్ ఎంపీ కవిత, పార్టీ క్యాడర్ అందించిన సహాయసాకారాలు నాకు వరంలా కలిసొచ్చాయి. 2014కు ముందు జగిత్యాలలో అసలు టీఆర్‌ఎస్ కార్యాలయమే లేదు. నేను మోతెలో విశాలమైన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. దాని కేంద్రంగా ప్రజలకు సేవలందించా. ఆరు నెలల క్రితమే ఆస్పత్రిని మరో వైద్యుడికి అప్పగించి పూర్తిగా ప్రజల మధ్యే ఉంటున్న.
రూ. 1250 కోట్లతో అభివృద్ధి..
నేను ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని ఏనాడూ చిన్నచూపు చూపలేదు. మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు దీటుగా జగిత్యాలలో అభివృద్ధి పనులు, నిధులు మంజూరు చేసింది. రాయికల్ మండలం బోర్నపల్లిలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.70 కోట్లు విడుదల చేయగా.. పనులు ముగింపు దశలో ఉన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు.. కొత్తగా రాయికల్ మున్సిపల్ ఏర్పాటుతో పాటు రూ.25 కోట్లు, నియోజకవర్గంలో 26వేల మంది బీడీ కార్మికులకు జీవనభృతి, 58వేల మందికి ఆసరా పెన్షన్ల పంపిణీ, ఆరోగ్య శ్రీ పథకం కింద 9వేల మందికి కార్పొరేట్ వైద్యం, వెయ్యి మందికి సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల, 2800 మందికి కల్యాణలక్ష్మీ.. 750 మందికి షాదీముబారక్ చెక్కులు, 3,500 మందికి కేసీఆర్ కిట్ల పంపిణీ, చెరువుల పునరుద్ధరణ మొత్తంమీద నియోజకవర్గానికి నాలుగేళ్ల కాలంలో రూ.1250 కోట్లు మంజూరు చేయించిన. 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ ఇవి నా గెలుపునకు సహకరిస్తున్నాయనే పూర్తి విశ్వాసం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులూ కేసీఆర్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. ఉపాధ్యాయుల సీపీఎస్ సమస్య పరిష్కారం కేంద్ర ఆధీనంలోనిది. మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చే కృతనిశ్చయంతో కేసీఆర్ ఉన్నారు.
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
రెండు నెలల క్రితమే మా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉండడం ఎంతో సంతోషాన్నిచ్చింది. 2014 ఎన్నికల ఫలితాల ప్రకటన మరుసటి రోజే నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రజల మధ్య ఉంటున్న నేను.. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన. ఇప్పటివరకు నియోజకవర్గం మొత్తాన్నీ రెండు సార్లు చుట్టి వచ్చిన. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ కవిత పర్యటనలతో నియోజకవర్గంలో మరింత ఊపు వచ్చింది. పార్టీ క్యాడర్, నాయకులందరూ నాకు సలహాలు, సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించారు. ఫలితంగా ప్రచారానికి నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి నన్ను గెలిపించుకుంటామనీ తీర్మానాలు, వాగ్దానాలు చేస్తున్నారు.
అది ప్రతిపక్షాల కుట్ర
నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. చిరువ్యాపారులను ఇబ్బంది పెడతానని ప్రతిపక్షాలు నన్ను బద్‌నాం చేసే కుట్ర పన్నుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్‌ను విస్తరిస్తానని మాత్రమే నేను చెబుతున్న. ఏ ఒక్క చిరువ్యాపారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్న.
అదో మాయకూటమి
అభివృద్ధి నినాదం కాకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఉద్దేశంతో 58 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కూటమిగా ఏర్పడ్డాయి. మహాకూటమి పేరుతో ప్రజలను మాయచేసేందుకే వీరందరూ ఒక్కటయ్యారు. ఇన్నాళ్లూ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించని ఆ రెండు పార్టీలను ప్రజలు ఇప్పుడు నమ్మే స్థితిలో లేరు. జగిత్యాలలో కాదు అసలు రాష్ట్రంలోనూ మహాకూటమి ప్రభావం లేదు. జనాల్లో చర్చ లేదు. రాష్ట్రంలో మాదిరిగానే జగిత్యాలలోనూ టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూల పవనాలు
వీస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment