ప్రజా ఆశీర్వాద సభలో జై తెలంగాణ అని నినదిస్తున్న కేసీఆర్, పక్కన టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, సభకు భారీగా హాజరైన టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ‘బక్కోన్ని కొట్టడానికి చాత కాకే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా నుంచి చంద్రబాబును తెస్తున్నారు.. అంటే పాలమూరు ప్రజలం అంత ఇజ్జత్ లేకుండా ఉన్నామా? రేషం లేనోళ్లమా? ఆంధ్రా వలసవాద పార్టీ పెత్తనం పాలమూరులో అవసరమా’ అని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కాలేజీ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు సుమారు 60 వేల మందికి పైగా ప్రజలు, టీఆర్‌ఎస్ శ్రేణులు హాజరయ్యారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... పాలమూరు అంటే అభిమానం పాలమూరుపై నాకు ప్రత్యేక అభిమానం ఉంది.
ఇక్కడి ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు గర్వంగా ఉంది. అలాంటి జిల్లా ముందు ప్రస్తుతం ఓ చాలెంజ్ ఉంది. ఈ ఎన్నికల ఆషామాషీ ఎన్నికలు కావు. జిల్లా ప్రజల బతుకులు మార్చే ఎన్నిక. తొమ్మిదేళ్లు దత్తత తీçసుకుని జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయలేక జిల్లాను వలసల జిల్లాగా మార్చిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు పార్టీకి పాలమూర్‌లో ఏం పని? ప్రజలు మేల్కోవాలి. మన కంటిని మన వేలితోనే పొడిపించేందుకు ఇక్కడ టీడీపీ పోటీ చేస్తోంది.
పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్టు కట్టొద్దని కేంద్రానికి 30 ఉత్తరాలు రాయడంతో పాటు సుప్రీం కోర్టులెఓ వేసిందని నిజం కాదా? కరువు జిల్లాకు సాగునీళ్లు, తాగు నీళ్లు రానివ్వని టీడీపీ పార్టీ అభ్యర్థి ఓటేయాలా? మనం ఆలోచించి టీడీపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేయాలి. పాలమూరులో టీడీపీ అభ్యర్థి గెలిస్తే తెలంగాణ ఇజ్జత్ పోతది. పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టవద్దని కేసులు వేసింది నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థులు కారా? ఇలాంటి నాయకులు జిల్లాలోఉండడం మన దరిద్రం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమపథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు.
రౌడీయిజం చెల్లదు...
టీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు పట్టణం ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ రౌడీయిజం చెల్లదు. మన బతుకులు చిన్నాభిన్నం చేసిన టీడీపీని ఓడించి పాలమూరు సత్తానుతెలంగాణకు చాటాలి. తుమ్మ చెట్లు మొలిచే పెద్ద చెరువును ట్యాంక్ బంగా మార్చిన ఘనత శ్రీనివాస్‌గౌడ్‌ది. మెడికల్ కాలేజీ, 3,700 డబుల్ బెడ్‌రూం ఇళ్ల కట్టడం పూర్తయింది. జిల్లా కేంద్రానికి మరో బైపాస్ రోడ్డు రావాల్సి ఉంది. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆయన లక్ష మెజార్టీతో గెలవడం ఖాయం. ఈ సభకు 20, 30 వేల మంది వస్తారనుకుంటే.. ఇంత పెద్దమొత్తంలో వచ్చారు.. దీంతో శ్రీనివాస్‌గౌడ్ గెలుపు ఖయంగా కనిపిస్తోంది. ఉద్యోగ సంఘం నేతగా ఉద్యోగుల సమస్యలు శ్రీనివాస్‌గౌడ్‌కు తెలుసు. ఉద్యోగుల అన్ని డిమాండ్లను పరిష్కరించుకుందాం.శ్రీనివాస్‌గౌడ్‌ను గెలిపిస్తే వచ్చే ప్రభుత్వంలో మంచి స్థానంలో చూస్తారు.
ప్రధాని హోదాలో మోదీ గల్తీ బాత్ ఎలా?
దేశ ప్రధాన మంత్రి హోదాలో నరేంద్రమోదీ గారు తెలంగాణలో ప్రజలు కరెంట్, నీళ్ల కష్టాలు పడుతున్నారని గల్తీ బాత్ ఎలా మాట్లాడుతారు? నిజామాబాద్ సభలో ప్రధాని మాట్లాడుతు తెలంగాణలో కరెంట్ కష్టాలతో బాధపడుతున్నారని చెప్పి ఆయనలాంటి తెలివి తక్కువ ప్రధాని మరెవరూ లేరని అనిపించుకున్నారు. ఇప్పుడే హెలీక్యాప్టర్‌లో నిజామాబాద్‌కు వెళ్లి ప్రజలను అడుగుదాం. కరెంట్ కష్టాలు ఉన్నాయో, లేదో చూద్దామా? మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చుకోవాలని చూస్తుంటే కేంద్రంలో మత పిచ్చి ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉండడంతో అడ్డంకులు వస్తున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే నిర్ణయాన్ని పరిశీలిస్తున్నాం. ఉద్యోగులకు ఐఆర్‌తోపాటు పీఆర్‌సీ ఇస్తాం.
దద్దరిల్లిన ఆటాపాట...
ప్రజా ఆశీర్వాద సభాప్రాంగణం లో కళాకారుడు సాయిచంద్ ఆటపాటలతో దద్దరిల్లిపోయింది. పాలమూర్‌కు శ్రీనివాస్‌గౌడ్ చేసిన అభివృద్ది పనులను తన పాటల ద్వారా వివరిస్తూ సభను హోరెత్తించారు. సాయిచంద్ పాటలకు కొంత మంది యువకులు, యువతులు నృత్యాలు చేశారు. సీఎం కేసీఆర్ సభకు వచ్చే వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. కాగా, సీఎం కేసీఆర్ ప్రసంగం ముగుస్తున్న క్రమంలో ఒక్క సారిగా మైక్ కట్ కాగా ఆయన కొంత çఅసహనానికి గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మైక్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తగా సరిచేశాక కేసీఆర్ మాట్లాడారు. ఈ సభలో శాట్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఉపాధి హామీ మండలి డైరెక్టర్ కోట్ల కిషోర్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధ, రాములు, పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, శివరాజ్, కౌన్సెలర్లు ప్రసన్న, జ్యోతి, వనజ, రషీద్, అనిత, పెద్ద విజయ్‌కుమార్, ఇంతియాజ్, హాది, రవీందర్‌రెడ్డి, కృష్ణ ముదిరాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఏడు నెలల్లో పూర్తయిన తుమ్మిళ్లమహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి
ఏళ్ల తరబడి ఆర్‌డీఎస్ ఆయకట్టు రై తాంగం నీళ్ల కోసం గోస పడుతున్నారు. ఆ రైతాంగ సమస్యను కేవలం ఏడు నెలల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తి చేశామని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్‌డీఎస్ సమస్యను ఉద్యమ కా లంలో ఉద్యమ నేతగా పాదయాత్ర చేసినప్పు డే కేసీఆర్ గుర్తించారన్నారు. ఉమ్మడి జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని తెలిపారు. గతంలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో పండేదని.. ఇప్పుడు సాగునీటి వనరులు పెరగడంతో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని ఎంపీ తెలిపారు.
నీవు ప్రజలకేం చేస్తవ్? టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్
సర్పంచ్ పదవి కో సం సొంత తమ్ముడి ని కడతేర్చిన వ్యక్తి ప్రజలకు ఏం సేవ చేస్తారని టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఎర్ర శేఖర్ కుటుంబ సభ్యులెవరూ కూడా ప్రచారంలో పాల్గొనడం లేదని తెలిపారు. రెండు నెలల క్రితం వరకు పట్టణంలో ఎలాంటి గొడవలు లేవని.. ఇప్పుడు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ మేరకు సత్యమ్మన్న అభిమానులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూర్‌లో దాదాగిరీ సాగదని.. ఎవరైనా బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు సూచించారు. ఎన్నికల సమయంలో అందరు కుల సంఘాల సమావేశాలు పెడితే.. టీడీపీ అభ్యర్థి మాత్రం రౌడీ షీటర్లతో సమావేశమై ఒక్కొక్కరికి ఒక్క ఏరియా పంచి ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ నుంచి ఆంధ్రా పార్టీని సాగనంపాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు. టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తే పాలమూర్ ప్రజల జీవితాలు ఆగం అవుతాయని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment