సభావేదికపై నిరంజన్‌రెడ్డిని పరిచయం చేస్తున్న కేసీఆర్
సాక్షి, వనపర్తి: కాంగ్రెస్, టీడీపీ కలిపి 58 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాయని, వారి పాలనలో పాలమూరులో శిథిలమైన చెరువులు, పెండింగ్ ప్రాజెక్టులు, వలసలు, కరువు కాటకా లు, మంచినీటి బాధలు, ఆకలిచావులే మిగిలాయని అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్ల ఉద్యమకాలంలో పాలమూరు జిల్లాలో సుమారు వందసార్లు పర్యటించి ఉం టానని గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వనపర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వదసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యా రు. ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలో సాగు, తాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, కంటి వెలుగు, కేసీఆర్ కిట్ తదితర పథకాలు ఇచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూపించామని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, మరోసారి అవకాశం కల్పిస్తే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ గొర్రెలకు తెలియదు
స్థానిక కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి అసెంబ్లీలో చర్చల సందర్భంగా గొర్రెలు, చేపపిల్లల పంపిణీపై అవహేళనగా మాట్లాడారని, కాంగ్రెస్ గొర్రెలకు గొర్రెల గురించి తెలియదన్నారు. తెలంగాణలో 30లక్షల మంది గొల్ల కురుమలు ఉన్నారని, వారికి రూ.4వేల కోట్ల బడ్జెట్ కేటాయించి 65 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని వివరించారు. ఉద్యమ సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులో చేపలు పట్టుకోడానికి వెళ్తే ఆంధ్ర వాళ్లు దాడి చేసినట్లు చెప్పారని, నేడు అదే మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసి ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పించామన్నారు.
రైతులకు భరోసా ఇచ్చాం
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని శాపాలు పెట్టారని, కానీ నేడు తెలంగాణలో రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోవడం లేదన్నారు. ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి లాఠీ దెబ్బలను రైతులు తినాల్సి వచ్చేదని, కానీ నేడు ఆ పరిస్థితులు పోయి స్వేచ్ఛగా లభించేలా చేశామన్నారు. మోజేతిలో బెల్లంపెట్టి నాకించారు కానీ గత పాలకులు మన బాధలను పంచుకోలేదన్నారు. రైతుబీమాతో రూ.5లక్షల పరిహారం అందిస్తూ ఆదుకుంటున్నామని, ఏడాదికి పంటల సాగుకు ప్రతి ఎకరాలకు రూ.8వేల చొప్పున ఇస్తున్నామన్నారు.
కత్తి ఎక్కడ తిప్పాలో తెలియదు
గురువారం గద్వాలలో నిర్వహించిన కాంగ్రెస్ సభకు వనపర్తి, నల్లగొండ టీఆర్‌ఎస్ సభలకు వచ్చి బఠాణీలు అమ్ముకునేంత మంది కూడా రాలేదని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనను బట్టేబాజ్, దగాఖోర్ వంటి మాటలు అన్నారని, బాగోతంలో వేషగాళ్ల మాదిరి కత్తులు తిప్పారే గానీ వాటిని ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 40 మంది రిటైర్ట్ ఇంజనీర్ల సాయంతో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులపై నివేదికలు తెప్పించుకుని ప్రాజెక్టుల డిజైన్ చేయించామన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చపెడితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రిపేర్ అయి రాలేదని పారిపోయాడని, అసెంబ్లీకి వచ్చేటప్పుడు ప్రిపేర్ అయి రాకుండా పీకడానికి వచ్చారా? అని ఒకింత ఆవేశంతో ప్రసంగించారు. కాంగ్రెస్ వాళ్లకు తెలివి, అవగాహన లేక పారిపోయారని విమర్శించారు.
చిన్నారెడ్డి, అరుణపై ఫైర్
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 64 లక్షల క్యూసె క్కుల నీళ్లు తీసుకుపోయే కాల్వను తవ్వి పొక్క పెట్టారని, అడ్డుకోవాల్సింది పోయి ఇదే ప్రాంతానికి చెందిన చిన్నారెడ్డి మంత్రి పదవి కోసం పోతిరెడ్డిపాడు వల్ల ఎలాంటి నష్టం లేదని పత్రికలకు వ్యాసాలు రాశారని గుర్తుచేశారు. అనంత పురం జిల్లాకు చెందిన రఘువీరారెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరో పొక్కపెట్టి హంద్రీనీవా ద్వారా 300 కి.మీ నీరు తీసుకెళ్లారని, అప్పుడు డీకే అరుణ సిగ్గు లేకుండా హారతులు ఇచ్చిందని గుర్తుచేశారు. అరుణ బండారం బయటపెడతామని, గద్వాలలో ఇంటింటికీ చూపెడతామన్నారు. నాడు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా సోనియా వద్ద పంచాయితీ పెట్టి టీఆర్‌ఎస్ మంత్రులు రాజీనామా చేశామని గుర్తుచేశారు.
టీఆర్‌ఎస్‌కు ఎదురులేదు
వనపర్తి: జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగవరంలో శుక్రవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పలువురు నాయకులు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన వారితో పాటు మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ కంటే వీరు మాట్లాడి టీఆర్‌ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాతో పాటు తమ నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భీమా–1, 2, కోయిల్ సాగర్, కేఎల్‌ఐ ప్రాజెక్టులను కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. ఒక్క నారాయణపేట నియోజకవర్గంలోనే రూ.850 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశారు. మాయకూటములు ఎన్ని వచ్చినా.. కేసీఆర్ టీంను కదిలించలేరు. అభివృద్ధి కోసం తెలంగాణలోని ప్రతీ పైసాను ఖర్చు చేస్తున్న కేసీఆర్‌ను, ఆయన ధర్మపాలన చూసి టీఆర్‌ఎస్‌లో చేరాను. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన పన్నులతో ఆంధ్రా ప్రాంతాన్ని అభివృద్ది చేసుకున్న ఘనంత సీమాంధ్ర పాలకులకే చెల్లింది. ప్రతిపక్ష పార్టీలను చిత్తు చేసి రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ కేతనం ఎగుర వేయటం ఖాయం. – రాజేందర్‌రెడ్డి, నారాయణపేట అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే
జేజమ్మ మంత్రిగా జిల్లాకు చేసింది శూన్యం..
మçహాకూటమి అలీబాబా 40 దొంగల గుంపుగా తయారైంది. గద్వాల జిల్లా కేంద్రంలో రోడ్‌షో నిర్వహించి టీఆర్‌ఎస్ నాయకులు, సీఎంపై సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. సినిమాల్లో నటించే తారను తీసుకువచ్చి మాట్లాడిస్తే ఓట్లు రాలవు. దశాబ్దాల కాలంగా విమర్శనాస్త్రాలు దూసుకున్న పార్టీలు ఇప్పుడు అధికారం కోసం దోస్తీ కడితే.. ప్రజలు విశ్వసించబోరు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రిగా పని చేసిన జేజమ్మ, మాజీ మంత్రి డీకే అరుణ పాలమూరుకు చేసింది శూన్యం. మక్తల్ నియోజకవర్గంలో 1.02లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ పంట పొలాలకు సాగునీరిస్తే విపక్షాల కంట్లో నీరు కారుతోందన్నారు. ఇట్లాంటి ప్రతిపక్ష మాయకూటములు ఎన్ని వచ్చినా టీఆర్‌ఎస్ ప్రభంజనాన్ని ఆపలేరు. – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే
రైతుబంధు పథకం చరిత్రాత్మకం
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశంలోనే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతోంది. ఇలాంటి చరిత్రాత్మక పథకం ద్వారా రబీలో చెక్కులు ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఎన్నికల పేరుతో అడ్డుకోవడానికి కుట్ర పన్నాయి. ఎన్నో సమస్యలు, సవాళ్లతో కూడిన తెలంగాణ ఏర్పడ్డాక.. నాలుగున్నర ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టం ద్వారా బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. ఇంటింటికీ శుద్ధజలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం 99 శాతం పూర్తి కావొచ్చింది. – అంజయ్య యాదవ్, షాద్‌నగర్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే
్చకాంగ్రెస్ టీడీపీది అనైతిక దోస్తీ..
కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ఎన్‌టీ.రామారావు టీడీపీని స్థాపిస్తే.. చంద్రబాబు స్వార్థ రాజకీయం కోసం ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కట్టి నైతిక విలువలు బొంద పెట్టారు. కాం గ్రెస్, టీడీపీ ఇతర చిన్నాచితక పార్టీలు ఎన్ని కలిసినా.. ఎన్ని మహాకూటములు వచ్చినా.. టీఆర్‌ఎస్ ప్రభంజనాన్ని ఆడ్డుకోలేవు. మరోసారి ప్రజా ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయం. – శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే
పచ్చబడిన నియోజకవర్గాలు
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే ప్రస్తుతం సగానికి పైగా.. అంటే ఎనిమిది నియోజకవర్గాల్లోని పంట పొలాలకు నీరందించాం. రానున్న ఎన్నికల్లో విజభేరి మోగించి అధికారంలోకి వచ్చాక మిగిలిపోయిన నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తాం. ప్రస్తుతం నిర్మించిన రిజర్వాయర్లకు అధనంగా మరిన్ని రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకుని పచ్చని పాలమూరుగా ఆవిష్కరింపజేసి వలసల జిల్లాకే వలసలు వచ్చేలా చేస్తాం. – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, వనపర్తి అభ్యర్థి
పాలమూరు పౌరుషాన్ని చూపించారు
పాలమూరు అంటే మట్టి మనుషులని విన్నాను... సభాపతిగా పని చేస్తున్న సమయంలో పాలమూరు సమస్యలపై ఎన్నోసార్లు చర్చ వచ్చేది. అప్పటి పాలమూరుకు.. మిత్రులు కేసీఆర్ సీఎం అయిన తర్వాత మారిన పాలమూరుకు చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ పిలుపుతో సభకు తరలిరావడం తో జనసంద్రాన్ని తలపిస్తోంది. సభ విజయవంతం చేయడం ద్వారా పాలమూరు పౌరుషాన్ని చాటారు. ప్రతిపక్షాల కుట్రపూరిత వ్యూహాలను సమర్దవంతంగా తిప్పికొట్టేందుకు కేసీఆర్ సైన్యం సిద్ధంగా ఉంది. – సురేష్‌రెడ్డి, మాజీ స్పీకర్
టీడీపీతో పొత్తా...ఛీ ఛీ
కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తుపై కేసీఆర్ మండిపడ్డారు. చంద్రబాబుతో పొత్తా.. ఛీ ఛీ అని అన్నారు. బాబు ఐరన్ లెగ్ అని ఎక్కడ కాలుపెడితే అక్కడ పచ్చని చెట్లు కూడా భస్మం అవుతాయని ఎద్దేవాచేశారు. మంత్రులు సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు గువ్వల బాల్‌రాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment