100 ఖాయం | KTR Talk About On Election Results | Sakshi
Sakshi News home page

100 ఖాయం

Dec 9 2018 1:42 AM | Updated on Dec 9 2018 8:58 AM

KTR Talk About On Election Results - Sakshi

మాట్లాడుతున​ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ఆ పార్టీ ముఖ్యనేత కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు పూర్తిగా సంతృప్తితో ఉన్నారని, పోలింగ్‌లో తమకే మద్దతు కనిపిస్తోందన్నారు. ఓటమి ఖాయమని అర్థం చేసుకున్న కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పటి నుంచే సాకులు వెతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పి.మహేందర్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో కేటీఆర్‌ మాట్లాడారు.

‘మాకొచ్చిన సమాచారం ప్రకారం 73 శాతం పోలింగ్‌ జరిగింది. ఇది ప్రభుత్వ అనుకూల ఓటేనని మా నిశ్చిత అభిప్రాయం. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజల తీర్పు ఏకపక్షంగా రాబోతోంది. టీఆర్‌ఎస్‌ పాలనకు, సంక్షేమానికి మద్దతుగా ప్రజలు ఓటు వేశారు. జాతీయ చానళ్లు అన్ని టీఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లు ఇచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం. టీఆర్‌ఎస్‌కు దాదాపుగా వంద సీట్లు రానున్నాయి. మూడింట రెండొంతుల స్థానాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడబోతోంది. అసెంబ్లీ రద్దు రోజు సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగానే పోలింగ్‌ వరకు అదే పరిస్థితి ఉంది. ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీల వారు చేసిన విమర్శలను, వారి గారడీలను ప్రజలు పట్టించుకో    ’అని ఆయన పేర్కొన్నారు. 

కుట్రలన్నీ విఫలమయ్యాయి 
‘కాంగ్రెస్‌ హేమాహేమీలు ఓడిపోనున్నా రు. ఇది ఖాయం. ఆ పార్టీలో సీఎం అభ్యర్థులుగా చెప్పుకున్న వారు సొంత నియోజకవర్గాలు దాటలేదు. మేం ఫలితాల కోసం వేచి చూస్తున్నాం. 11న టీఆర్‌ఎస్‌ విజయోత్సవాలు జరుగుతాయి. ప్రజలు మావైపే ఉన్నారు. రాహుల్‌ గాంధీ, చంద్రబాబు వందలకోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు పన్నారు. అవన్నీ విఫలమయ్యాయి. గెలుపు సాధ్యం కాదని  కాంగ్రెస్‌ నేతలు ముందుగానే సాకులు వెతుక్కుంటున్నారు.

అందుకే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈవీఎంలలో ఏదో జరుగుతుందని అంటున్నారు. కాంగ్రెస్‌ గెలిచినప్పుడు అలాగే అనుమానాలు వ్యక్తం చేశారా? ఈవీఎంలనీ.. ఇంకోటని మాకు పనికిమాలిన అనుమానాలు లేవు. కూటమిది అపవిత్ర, అవకాశవాద పొత్తు అని ప్రజలు గమనించారు. బాబు కూటమిలో చేరడం వల్ల ఓడిపోయామని ఫలితాల రోజు మాట్లాడేం దుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరుపై, ప్రజలపై మాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్‌ నేతలు ముందే ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారు. ఫలితాల రోజు చూడండి. చంద్రబాబుతో పొత్తు వల్లే ఓడిపోయామని కాంగ్రెస్‌ నేతలు అంటారు. మిగతా విషయాలు 11 తర్వాత మాట్లాడుకుందాం’అని కేటీఆర్‌ అన్నారు.

ప్రజలకు ధన్యవాదాలు 
ఎన్నికలలో నిర్వహణపై అధికార యంత్రాంగానికి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. భారీగా ఓటిం గ్‌లో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ‘ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటింగ్‌కు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు, అభినందనలు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్‌ జరిగింది. ఎక్కడా ఒక్క అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా, శాంతియుతంగా, ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘానికి, అధికారులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అభినందనలు. వినయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలలో మూడు నెలలుగా శ్రమించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ధన్యవాదాలు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, కార్యకర్తలు మరో మూడురోజులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి ఈ స్ఫూర్తిని ఓట్ల లెక్కింపు వరకు కొనసాగించాలి. చివరి ఓటు లెక్కించే వరకు అప్రమత్తంగా ఉండాలి’అని మంత్రి సూచించారు. ఓట్ల గల్లంతు జరిగిన మాట వాస్తవమేనని.. పార్లమెంటు ఎన్నికల వరకైనా ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే బాగుంటుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.  

కేసీఆర్‌కు 75 వేల మెజారిటీ 

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ 75 వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, డీకే అరుణ ఓడిపోతారని జోస్యం చెప్పారు. ‘పెరిగిన ఓటింగ్‌ శాతం అంతా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారు. మాకు ఉన్న సమాచారం ప్రకారం వంద సీట్లలో గెలుస్తాం. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో 75 వేలకుపైగా మెజారిటీతో గెలుస్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 24 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 16 నుంచి 17 సీట్లు గెలుస్తుంది. ఉమ్మడి కరీంనగర్‌లో 12 స్థానాల్లో మాదే విజయం. ఖమ్మంలోనూ మెజారిటీ సీట్లు మాకే వస్తాయి. బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్‌ దక్కదు. అంబర్‌పేట, ముషీరాబాద్‌లో మాత్రమే మాకు బీజేపీ పోటీ ఇస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు ఒక్కరూ గెలవరు. బెల్లంపల్లిలోనూ వినోద్‌ ఓడిపోతారు. అక్కడ టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది. ప్రజ లు పనితీరును గమనించి తీర్పు ఇస్తారు. రాజకీయాల్లో ఒకటి, ఒకటి కలిస్తే రెండు కాదు’అన్నారు.  


లగడపాటి సర్వే సన్యాసం 
లగడపాటి రాజగోపాల్‌ ఇప్పటికే రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని.. ఇప్పుడాయనకు సర్వే సన్యాసం కూడా తప్పదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం రాదని లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలంగాణ వచ్చింది. ఉద్యమం దెబ్బకు లగడపాటి రాజగోపాల్‌ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ గెలవదని  లగడపాటి అంటున్నారు. కానీ కచ్చితంగా మేం విజయం సాధిస్తాం. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో రాజగోపాల్‌ సర్వే సన్యాసం తప్పదు’అని మంత్రి పేర్కొన్నారు.

1
1/1

శనివారం ప్రగతి భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో బొంతు రామ్మోహన్, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement