సాక్షి, అమరావతి: ‘నాకేదో గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడికైనా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు. టీడీపీ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. తెలుగువారు ఎక్కడున్నా వెళ్లి పనిచేశా. ప్రజల కోసం పనిచేస్తున్న నాపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌ఏం గిఫ్ట్ ఇస్తారో చూస్తా...!’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెలంగాణకు వచ్చి చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గురువారం ఒంగోలులో నిర్వహించిన జ్ఞానభేరి సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర పరాజయంపై చంద్రబాబు బయటకు వచ్చి చేసిన ప్రకటన ఇదొక్కటే కావడం గమనార్హం. కూటమి దారుణంగా ఓడిపోయినా చంద్రబాబు మౌనముద్ర దాల్చారు.
అనుకూలమైతే హడావుడి... లేదంటే పచ్చమీడియాకు లీకులిచ్చి గప్‌చుప్
తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమి పాలు కావడంపై తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనం దాల్చడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోయినా, కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపు ఇవ్వకపోయినా వారి విజయాన్ని తనకు ఆపాదించుకొని చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై అంతా విస్తుపోవడం తెలిసిందే. వారి విజయానికి చంద్రబాబే కారణమంటూ మంత్రులు, టీడీపీ నేతలు ప్రకటనలు గుప్పించిన విషయాన్ని కూడా ఎవరూ మర్చిపోలేదు. కానీ... తెలంగాణలో కాంగ్రెస్ అధినేతతో కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్నా... హైదరాబాద్‌లో వ్యక్తిగతంగా రోడ్డు షోలు నిర్వహించినా... కూటమి అభ్యర్థులకు పెద్ద ఎత్తున ‘నగదు’ సమకూర్చినా... ఘోరంగా ఓటమి చెందడంపై చంద్రబాబు నోరు విప్పకపోవడం పట్ల టీడీపీ శ్రేణుల్లో అంతర్మధనం మొదలైంది. రాజకీయాల్లో అత్యంత సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబు హుందాగా ఓటమిని ఒప్పుకొని ఓటర్ల మనోగతాన్ని ఆహ్వానించకపోవడంపై నాయకుల్లో చర్చ జరుగుతోంది.
బాబును తిరస్కరించిన తెలంగాణ ప్రజలు
చంద్రబాబు తాను స్వయంగా ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ఎన్నికల విషయాన్ని విస్మరించి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుపై ప్రకటనలు చేయడంపైనా విశ్లేషకుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో తాను మునిగి అధఃపాతాళానికి పడిపోవడమే కాకుండా ‘మహాకూటమి పార్టీలనూ చంద్రబాబు నిండా ముంచేశారు. కూటమికి రూ.వందల కోట్ల ఆర్థిక వనరులను సమకూర్చడంతోపాటు ఈ ఎన్నికల్లో వారం రోజులకు పైగా తెలంగాణాలోనే ఉండి, కూటమికి స్టార్ క్యాంపయినర్‌గా వ్యవహరించి చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. దాదాపు రూ.1,200 కోట్ల వరకు ఏపీ నుంచి తెచ్చిన మొత్తాన్ని తెలంగాణ ఎన్నికల్లో బాబు వెదజల్లారన్న ఆరోపణలున్నాయి. ప్రజాకూటమి గెలిస్తే అది చంద్రబాబు గెలుపే అన్నట్లుగా పచ్చమీడియా ప్రచారం చేసింది. లగడపాటిని రంగంలోకి దించి కూటమికి 75 స్థానాలు వస్తాయని, అదంతా కాంగ్రెస్ చంద్రబాబుతో కలవడం వల్లేనని దొంగ సర్వేలను తెరపైకి తెచ్చారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న చంద్రబాబును, ఆయనతో జతకట్టిన కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు ఛీత్కరించారు. ఈ పరిణామాలన్నిటికీ కారణం తానే అయినా అదేదీ తనకు సంబంధం లేనట్లుగా చంద్రబాబు ఇపుడు వ్యూహాత్మకంగా మౌనం దాల్చారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను ఎక్కడా ప్రచారం చేయని రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును తన ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఓటమిపై ప్రజాతీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని ముక్తసరిగా పేర్కొన్నారు.
కర్నాటకఎన్నికల్లో ఎంతో హడావుడి
కర్నాటకలో ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తరఫున కానీ ఇతర పార్టీల తరఫున కానీ ప్రచారం నిర్వహించలేదు. అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు హోరాహోరీ పోరాటం చేశాయి. ఏ పార్టీకీ మెజార్టీ రాని పరిస్థితుల్లో బీజేపీ, జేడీఎస్‌లు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పరిణామాలు ఉత్పన్నమయ్యాయి. చివరిలో కాంగ్రెస్ సీఎం పదవిని ఆఫర్ చేయడంతో జేడీఎస్ అటువైపు మొగ్గి ఆ పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబునాయుడు కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు తన వల్లనే అయిందని, తన పిలుపు వల్లనే బీజేపీని అక్కడి ప్రజలు ఓడించారని ప్రెస్‌మీట్లు పెట్టి చెప్పడమే కాకుండా పచ్చమీడియా ద్వారా ఊదరగొట్టించారు. తనకు సంబంధం లేని కర్నాటక ఎన్నికలపై తెగ హడావుడి చేసిన చంద్రబాబు తాను స్వయంగా ప్రచారంలో పాల్గొన్న తెలంగాణలో ఓటమిపై పార్టీలో విశ్లేషణ చేయించడం కానీ, ఎందుకు ఇలా అయిందనే అంశంపై కనీసం చర్చించడం కూడా చేయకపోవడంపై పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు బేలచూపులు చూడడంపై పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ శ్రేణుల్లో చర్చోపచర్చలు
తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో ఏప్రిల్‌లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనా తప్పకుండా ఉంటుందనే చర్చ టీడీపీ నేతలు, కార్యకర్తల్లో సాగుతోంది. ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింటుందనే అంతర్మథనం పార్టీ నేతల్లో కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభు త్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, తెలంగాణ ఎన్నికల్లో అదే అంశం ప్రతిబింబించిందని అంతర్గతంగా వారు అంగీకరి స్తున్నారు. తెలంగాణలో ప్రజాకూటమి ఓటమి చెందడంపై ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు పండగ చేసుకున్నంత పని చేశారని, పలుచోట్ల బహిరంగంగానే బాణసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇది తెలుగుదేశంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని, ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ ఫలితమే పునరావృతం అవుతుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులతో పాటు టీడీపీలోని సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment