పట్నం... సంచలనం | Politics in Ibrahimpatnam Congress | Sakshi
Sakshi News home page

పట్నం... సంచలనం

Published Fri, Nov 16 2018 1:29 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Politics in Ibrahimpatnam Congress - Sakshi

నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతున్న క్యామ మల్లేష్‌

ఇబ్రహీంపట్నం రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్, అమరావతిలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలకు ఈ నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. కూటమిలో భాగంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సీట్ల సర్దుబాటు ఇందుకు కారణమైంది. మహాకూటమి అభ్యర్థిగా సామ రంగారెడ్డి (టీడీపీ)ని ఆ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించినప్పటి నుంచి ఒక్కసారిగా వేడెక్కిన పట్నం రాజకీయాలు గురువారమంతా హల్‌చల్‌ చేశాయి. టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే హస్తినకేగిన మల్‌రెడ్డి రంగారెడ్డి పార్టీ హైకమాండ్‌ వద్ద టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసుకుంటుండగా, ఇదే స్థానాన్ని ఆశించిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ సంచలనానికి తెరలేపారు. ఏకంగా స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌ కుమారుడిపైనే అవినీతి ఆరోపణలు చేసిన ఆయన అందుకు సాక్ష్యంగా ఆడియో రికార్డులు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. టికెట్‌రాని కాంగ్రెస్‌ నేతల పరిస్థితి ఇలా ఉంటే.. టికెట్‌ వచ్చిన టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.  టికెట్‌ వచ్చినందుకు సంతోషపడాలో.. పట్నంలో పోటీ చేయమన్నందుకు ఆవేదన చెందాలో అర్థంకాని పరిస్థితుల్లో ఆయన అమరావతి బాట పట్టాల్సి వచ్చింది. బుధవారం రాత్రి పేరు ప్రకటించగా, గురువారం తెల్లారేసరికి తన అనుచరులతో కలిసి అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. తనకు ఈ సీటు వద్దేవద్దని పార్టీ అధినేత చంద్రబాబును వేడుకున్నారు. అయినా, బాబు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కచ్చితంగా పోటీచేయాలని తాను ప్రచారానికి వస్తానని.. గెలిపిస్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. సామను దారిలోకి తీసుకువచ్చే బాధ్యత మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు అప్పగించడం గమనార్హం. మొత్తంమీద గురువారం పట్నం రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఈ నియోజకవర్గంలో వైరివర్గాలుగా వ్యవహరిస్తున్న డీసీసీ సారథి మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలు ఇరువురు టికెట్‌ కోసం పోటాపోటీగా ప్రయత్నించారు. సామాజిక సమీకరణలు, పార్టీ పెద్దల సిఫార్సు లేఖలతో తలపట్టుకున్న అధిష్టానం.. ఈ టికెట్‌ను ఎవరికీ కేటాయించకుండా పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. మరోవైపు సీట్ల సర్దుబాటులో భాగంగా ఎల్‌బీనగర్‌ సీటు తమకివ్వాలని టీడీపీ పట్టుబట్టింది. ఈ స్థానంలో తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్థిగా సుధీర్‌రెడ్డి ఉన్నందున కాంగ్రెస్‌ ససేమిరా అంది. దీని స్థానే ఇబ్రహీంపట్నంను ప్రతిపాదించింది.

తద్వారా ఈ వర్గ రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందని హస్తం పెద్దలు భావించారేమో కాబోలు. అయితే, ఎల్‌బీనగర్‌ బరిలో నిలవాలనే కృతనిశ్చయంలో ఉన్న సామ రంగారెడ్డిని ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామంతో ఇటు కాంగ్రెస్‌ ఆశావహులు మల్‌రెడ్డి సోదరులు, క్యామ.. అటు టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నివ్వెరపోయారు. తాను అడిగింది గాకుండా మరో స్థానం ఇవ్వడంపై సామ కంగుతిన్నారు. ఎల్‌బీనగర్‌గాకుండా పట్నం నుంచి పోటీచేసేది లేదని తేల్చిచెప్పారు. ఇదే అదనుగా మల్‌రెడ్డి బ్రదర్స్‌ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోటీకి సామ నిరాకరణను అనువుగా చేసుకొని ఇబ్రహీంపట్నం సీటును కాంగ్రెస్‌కు వదిలేలా అటు టీడీపీ.. ఇటు సొంత పార్టీలోనూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే మల్‌రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీతో ఈ అంశంపై మాట్లాడినట్లు తెలిసింది.

సీన్‌ కట్‌ చేస్తే.. 
సామ రంగారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి పరిస్థితి ఇలా ఉండగా క్యామ మల్లేశ్‌ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. టికెట్లను అమ్ముకున్నారంటూ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆడియో టేపులు విడుదల చేశారు. దీంతో ఆయన రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లుగానే భావించవచ్చు. మరోవైపు సామ రంగారెడ్డి పోటీచేయడానికి సుముఖంగా లేకపోవడాన్ని గమనించిన సీనియర్‌ నేత రొక్కం భీంరెడ్డి.. స్థానికేతరులకు టికెట్‌ ఇస్తే సహించేది లేదని, తనకు కేటాయించాలని అసమ్మతి స్వరం వినిపించారు. అంతేగాకుండా తన తరఫున భార్యతో నామినేషన్‌ కూడా వేయించారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం రాజకీయం రసవత్తర నాటకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement