Mal reddy ranga reddy
-
గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...ఎవరికి ఆ అవకాశం లభించనుంది అంటే ఇప్పట్లో గ్రేటర్ నుంచి మంత్రి పదవి లేనట్లే అని తెలుస్తోంది. తెలంగాణ అంతటా విజయదుందుభి మోగించినా గ్రేటర్ ఓటర్లు కాంగ్రెస్‌కు మొండిచేయి చూపారు. దీంతో ఇక్కడి నుంచి ఇప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రెండో విడుత కేటాయింపుల్లో భాగంగా ఎమ్మెల్సీ కోటాలో మాత్రమే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు మంత్రి పదవులను కేటాయించవచ్చు. మరోవైపు ఇప్పటికిప్పుడు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే శివార్లలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కానీ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సామాజిక వర్గాల వారిగా పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ కసరత్తును చేపట్టింది. ఈ క్రమంలో ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు కట్టబెట్టారనే చెడ్డపేరు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆ రకంగా మల్‌రెడ్డికి ఈ దఫా అవకాశం లభించకపోవచ్చునని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేసేందుకు ప్రస్తుతం అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఎంపికై న తరువాత మాత్రమే నగరం నుంచి మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ వరించేదెవరిని... పదవీకాలం ముగిసిన వారితో పాటు, గవర్నర్ కోటా కింద త్వరలో ఎమ్మెల్సీల ఎంపిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, తాము గెలిచే స్థానాలను త్యాగం చేసి మరో చోట పోటీ చేయడంతో ఓడిన వాళ్లు, ఎంతోకాలంగా కాంగ్రెస్‌కు సేవ చేస్తున్న సీనియర్లకు ఎమ్మెల్సీ పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఈ జాబితాలో అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీగౌడ్, కేఎల్ఆర్, విజయారెడ్డి, వెన్నెల తదితరులు ఉన్నారు. అంజన్‌కుమార్ యాదవ్ సీనియర్ నాయకుడు. అలాగే ఆ సామాజిక వర్గం దృష్టిలో చూసినా ఎంతో ప్రాధాన్యం ఉన్న నేత కావడంతో ఆయనకు అవకాశం లభించవచ్చునని అంటున్నారు. మరోవైపు పోటీచేసి ఓడిపోవడమే కాకుండా, పార్టీలో క్రియాశీల నాయకుడిగా గుర్తింపు కలిగిన మధుయాష్కీ కూడా కీలకమే. ఇక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇవ్వదలిస్తే ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డిని ఎంపిక చేయవలసి ఉంటుంది. మరి కొందరు సీనియర్లు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీపడే అవకాశం ఉంది. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీల ఎంపికకు మరికొంత సమయం ఉన్న దృష్ట్యా ఆ ఛాన్స్ ఎవరిని వరించనుందో..వేచి చూడవలసిందే. -
ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డిదే?
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో తలపండిన నాయకులే కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఇక్కడ మరోసారి బరిలో ఉండటంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ టికెట్ లభించని కారణంగా బీఎస్పీ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తలపడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మల్రెడ్డి రంగారెడ్డి కేవలం 356 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న మల్రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఢీఅంటేఢీ అనే రీతిలో బరిలో నిలిచారు. అయితే ఇప్పుడు పోలింగ్ ముగియడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతోంది. ఎక్కడ ఎవరు కలిసినా ఎన్నికల ఫలితాలపై మాట్లాడుకుంటున్నారు. కొంతమంది బీఆర్ఎస్ అంటుంటే మరికొంతమంది కాంగ్రెస్ గెలుస్తుందని అంటుండం చర్చనీయాంశంగా మారింది. బయటకు ధీమాగా ఉన్నా... ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుపై బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా...లోలోపల ఓటర్లు ఎవరికి ఓటువేశారో తెలియక తలలుపట్టుకుంటున్నారు. ఈసారి తప్పక విజయం తమనే వరిస్తుందనే ధీమాతో మల్రెడ్డి రంగారెడ్డి ఉండగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను మరోసారి గెలపిస్తాయని ధీమాగా ఉన్నారు. పోలింగ్ సరళిపై ఇరు పార్టీల అభ్యర్థులు తర్జనభర్జనలు పడుతూ కాకి లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరి ఓట్లు చీల్చుతారో.... సీపీఎం, బీజేపీ అభ్యర్థులు ఎవరి ఓట్లు ఎక్కువగా చీల్చుతారో అర్థంకాకుండా ఉంది. నియోజకవర్గంలో సీపీఎం, బీజేపీలు సుమారు 15వేల నుంచి 18వేల వరకు ఓటు బ్యాంకు కలిగిఉన్నాయి. 2018లో బీజేపీ అభ్యర్థికి 17 వేల పైచిలుకు ఓట్లు రాగా.. సీపీఎం అభ్యర్థికి 10వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అదేవిధంగా టీడీపీ నుంచి పోటీ చేసిన సామ రంగారెడ్డికి 18వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. ఈసారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండటం ఎవరికి కలిసోస్తుందో అంతుచిక్కకుండా ఉంది. వారి ఓట్లు ఏ వైపు, ఏ మేరకు దారి మరిలాయో అర్థంకాని పరిస్థితి. అయితే చాలావరకు బీజేపీ, సీపీఎం పార్టీలకు చెందిన వారు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. డబ్బుల ప్రభావం ఏ మేరకో.. ఇదిలాఉంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా డబ్బుల ప్రభావం కనిపించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటుకు ఇంత చొప్పున అని పంపిణీ చేసిన విషయం బహిరంగ రహస్యమే. ఈ డబ్బుల ప్రభావం అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేస్తుందా లేదా అనే విషయాన్ని ఫలితాలు వస్తేగాని స్పష్టంగా బయటపడదు. ఏదిఏమైనా ఎన్నికల ఫలితాలను ముందుగా ఉహించి చెప్పడం ఇబ్బందిగా మారింది. ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల జాతకాలు బట్టబయలు కానున్నాయి. అంతవరకు ఓపిక పట్టాల్సిందే. -
మరోసారి.. మంచిరెడ్డి వర్సెస్ మల్రెడ్డి
హయత్‌నగర్: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్రెడ్డి సోదరులు 20 ఏళ్లుగా రాజకీయంగా పోటీ పడుతూ వస్తున్నారు. ఇద్దరూ ఏ పార్టీలో ఉన్నా పోటీ మాత్రం వారి మధ్యే ఉంటోంది. ఇద్దరిలో ఒక్కసారి మల్రెడ్డి గెలవగా మూడుసార్లు మంచిరెడ్డి విజయం సాధించారు. మలక్‌పేట్ నియోజకవర్గం నుంచి వారి మధ్య పోటీ మొదలైంది. గతంలో నాలుగు పర్యాయాలు పోటీ పడిన వారు తాజాగా మరోసారి ఇబ్రహీంపట్నం బరిలో నిలిచారు. 2004లో మలక్‌పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్రెడ్డి రంగారెడ్డి పోటీ చేయగా టీడీపీ తరఫున మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మల్రెడ్డి రంగారెడ్డి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వీరి పోటీ ఇబ్రహీంపట్నానికి మారింది. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పోటీ చేయగా మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి మల్‌రెడ్డిపై పైచేయి సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా ఈ ఎన్నికల్లో మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ టికెట్ రాలేదు. ఆయన మహేశ్వరం నుంచి పోటీ చేయగా ఆయన సోదరుడు రాంరెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్‌గా మంచిరెడ్డిపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి గెలుపొందగా మల్రెడ్డి రాంరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. 2018లో వచ్చిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. దీంతో మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. మిత్రపక్షమైన టీడీపీని కాదని కాంగ్రెస్ శ్రేణులు బీఎస్పీకి మద్దతిచ్చారు. ఈ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన మల్రెడ్డి రంగారెడ్డి సుమారు 376 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. తాజాగా మంచిరెడ్డి, మల్రెడ్డి మధ్య ఐదోసారి పోటీ జరుగుతోంది. ఇద్దరూ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో సొంత బలంతో పోటీ చేసిన మల్రెడ్డి రంగారెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రేస్ తరఫున పోటీలో ఉండడంతో ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మారింది... -
పట్నం... సంచలనం
ఇబ్రహీంపట్నం రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్, అమరావతిలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలకు ఈ నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. కూటమిలో భాగంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సీట్ల సర్దుబాటు ఇందుకు కారణమైంది. మహాకూటమి అభ్యర్థిగా సామ రంగారెడ్డి (టీడీపీ)ని ఆ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించినప్పటి నుంచి ఒక్కసారిగా వేడెక్కిన పట్నం రాజకీయాలు గురువారమంతా హల్చల్ చేశాయి. టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే హస్తినకేగిన మల్రెడ్డి రంగారెడ్డి పార్టీ హైకమాండ్ వద్ద టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటుండగా, ఇదే స్థానాన్ని ఆశించిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సంచలనానికి తెరలేపారు. ఏకంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ కుమారుడిపైనే అవినీతి ఆరోపణలు చేసిన ఆయన అందుకు సాక్ష్యంగా ఆడియో రికార్డులు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. టికెట్రాని కాంగ్రెస్ నేతల పరిస్థితి ఇలా ఉంటే.. టికెట్ వచ్చిన టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. టికెట్ వచ్చినందుకు సంతోషపడాలో.. పట్నంలో పోటీ చేయమన్నందుకు ఆవేదన చెందాలో అర్థంకాని పరిస్థితుల్లో ఆయన అమరావతి బాట పట్టాల్సి వచ్చింది. బుధవారం రాత్రి పేరు ప్రకటించగా, గురువారం తెల్లారేసరికి తన అనుచరులతో కలిసి అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. తనకు ఈ సీటు వద్దేవద్దని పార్టీ అధినేత చంద్రబాబును వేడుకున్నారు. అయినా, బాబు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కచ్చితంగా పోటీచేయాలని తాను ప్రచారానికి వస్తానని.. గెలిపిస్తానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. సామను దారిలోకి తీసుకువచ్చే బాధ్యత మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు అప్పగించడం గమనార్హం. మొత్తంమీద గురువారం పట్నం రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఈ నియోజకవర్గంలో వైరివర్గాలుగా వ్యవహరిస్తున్న డీసీసీ సారథి మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు ఇరువురు టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నించారు. సామాజిక సమీకరణలు, పార్టీ పెద్దల సిఫార్సు లేఖలతో తలపట్టుకున్న అధిష్టానం.. ఈ టికెట్‌ను ఎవరికీ కేటాయించకుండా పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. మరోవైపు సీట్ల సర్దుబాటులో భాగంగా ఎల్బీనగర్ సీటు తమకివ్వాలని టీడీపీ పట్టుబట్టింది. ఈ స్థానంలో తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్థిగా సుధీర్‌రెడ్డి ఉన్నందున కాంగ్రెస్ ససేమిరా అంది. దీని స్థానే ఇబ్రహీంపట్నంను ప్రతిపాదించింది. తద్వారా ఈ వర్గ రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందని హస్తం పెద్దలు భావించారేమో కాబోలు. అయితే, ఎల్బీనగర్ బరిలో నిలవాలనే కృతనిశ్చయంలో ఉన్న సామ రంగారెడ్డిని ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామంతో ఇటు కాంగ్రెస్ ఆశావహులు మల్రెడ్డి సోదరులు, క్యామ.. అటు టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నివ్వెరపోయారు. తాను అడిగింది గాకుండా మరో స్థానం ఇవ్వడంపై సామ కంగుతిన్నారు. ఎల్బీనగర్గాకుండా పట్నం నుంచి పోటీచేసేది లేదని తేల్చిచెప్పారు. ఇదే అదనుగా మల్రెడ్డి బ్రదర్స్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోటీకి సామ నిరాకరణను అనువుగా చేసుకొని ఇబ్రహీంపట్నం సీటును కాంగ్రెస్‌కు వదిలేలా అటు టీడీపీ.. ఇటు సొంత పార్టీలోనూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీతో ఈ అంశంపై మాట్లాడినట్లు తెలిసింది. సీన్ కట్ చేస్తే.. సామ రంగారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పరిస్థితి ఇలా ఉండగా క్యామ మల్లేశ్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. టికెట్లను అమ్ముకున్నారంటూ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆడియో టేపులు విడుదల చేశారు. దీంతో ఆయన రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లుగానే భావించవచ్చు. మరోవైపు సామ రంగారెడ్డి పోటీచేయడానికి సుముఖంగా లేకపోవడాన్ని గమనించిన సీనియర్ నేత రొక్కం భీంరెడ్డి.. స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహించేది లేదని, తనకు కేటాయించాలని అసమ్మతి స్వరం వినిపించారు. అంతేగాకుండా తన తరఫున భార్యతో నామినేషన్ కూడా వేయించారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం రాజకీయం రసవత్తర నాటకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. -
..ఇలా ఓడిపోయాం! : కాంగ్రెస్ నేతలు
ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న జిల్లా కాంగ్రెస్ నేతలు సాక్షి,రంగారెడ్డి జిల్లా: ‘గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వకపోవడం, నేతల మధ్య సమన్వయలోపం’ పార్టీ కొంపముంచిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అభిప్రాయపడింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి అధిష్టానం కూడా ఒక కారణమని తెగేసి చెప్పింది. అభ్యర్థుల ఎంపికలో సమర్థులను పరిగణనలోకి తీసుకోకపోవడం, గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొట్టేవారికి టికెట్లు ఇవ్వడం పార్టీ పరాజయానికి దారితీసిందని పార్టీ నేతలు ఏకరువు పెట్టారు. తెలంగాణ క్రెడిట్ తమదేననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని, మేనిఫెస్టో కూడా ఓటర్ల దరికి చేర్చలేకపోయామని వాపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికలపై శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జిల్లా నేతలతో పోస్టుమార్టం నిర్వహించారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం సెగ్మెంటు నేతలతో వేర్వేరుగా నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక పరిస్థితులు, పనితీరుపై ఆయా నేతలు ఏకరువు పెట్టారు. చతికిలపడ్డాం.. ‘కాంగ్రెస్ పార్టీని ఓడించే సత్తా ఇతర పార్టీలకు లేదు. కానీ సొంత పార్టీ నేతలు వ్యతిరేకంగా పనిచేసినందునే ఓటమిపాలయ్యాం’ అంటూ సమావేశంలో పలువురు నేతలు ముక్కుసూటిగా అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందినట్లు నేతలు ముక్తకంఠంతో మనసులోమాటను బయటపెట్టారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న నేతల మధ్య సమన్వయం కొరవడిందని, దీంతో ఇతర పార్టీలకు ఇది అదనుగా మారడంతో ఓటమి చెందామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత తమదేననే అంశాన్ని ప్రజలకు వివరించలేకపోయామని, అయితే టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ అంశాన్ని సొమ్ము చేసుకోవడంతో విజయం సాధించారని విశ్లేషించారు. జిల్లాలో విభిన్న ప్రాంతాలకు చెందిన వాళ్లున్నారని, వీరిపై టీఆర్ఎస్ వ్యూహరచన ఫలించిందన్నారు.ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరితో ప్రజలు ఆలోచనలో పడ్డారని, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ పుంజుకుని పూర్వవైభవం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితులతోనే : సబిత జిల్లాలో నెల కొన్న ప్రత్యేక పరిస్థితుల వల్లే ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చినట్లు మాజీమంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మారని, మోడీ ప్రభావం బాగా పనిచేసిందని, దీంతో ఆ పార్టీలకు అధికంగా సీట్లు వచ్చాయని అభిప్రాయపడ్డారు. జనాదరణలేని వారికి టికెట్లు : మల్రెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధిష్టానం ఎదుట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులకు కాకుండా ఏమాత్రం జనాదరణలేని పైరవీకారులకు పెద్దపీట వేయడంతో పార్టీ పరాభవం చెందిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహేశ్వంలో తనకు టికెట్ ఖ రారులో జాప్యం జరిగిందని, ఇది తన గెలుపుపై ప్రభావం చూపిందని వాపోయారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కాలె యాదయ్య (చేవెళ్ల), టి.రామ్మోహన్‌రెడ్డి(పరిగి)లను టీపీసీసీ చీఫ్ పొన్నాల అభినందించారు. సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉంది : ప్రసాద్‌కుమార్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, ఈ అంశంపై ఆందోళన చెందాల్సిన పని లేదని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ స్పష్టం చేశారు. కానీ కార్యకర్త స్థాయిలో నూతనోత్సాహంతో వ్యూహాత్మకంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరితో ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని, ఈ అంశాన్ని అనుకూలంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లిల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఉందని, అనుకూలంగా మలుచుకోవడంలో మనం చొరవ చూపాలని అన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, పి.కార్తీక్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు వెంకటస్వామి, క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, డీసీసీబీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రవణ్, భీంరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక బరిలో 329మంది
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సార్వత్రిక సమరంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. శుక్ర, శనివారాల్లో కొనసాగిన నామినేషన్ల ఉపసంహరణలో రెండు పార్లమెంటు స్థానాలకు నామినేషన్లు వేసిన ఏడుగురు పోటీ నుంచి తప్పుకున్నారు. అదేవిధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 77 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో పార్లమెంటు స్థానాలకు 45 అభ్యర్థులు బరిలో నిలవగా, అసెంబ్లీ స్థానాలకు 284 మంది పోటీపడుతున్నారు. ఇక ప్రచార పర్వం.. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రచార పర్వం మొదలైంది. బరిలో ఉన్నదెవరో తేలిపోవడంతో అభ్యర్థులు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రస్తుతం కూకట్పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికంగా 29 మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత ఉప్పల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. అయితే పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో అతితక్కువగా తొమ్మిది మంది అభ్యర్థులున్నారు. తప్పుకున్న ప్రముఖులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి ఎట్టకేలకు శనివారం ఉపసంహరించుకోవంతో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఊపిరి పీల్చుకున్నారు. శేరిలింగంపల్లిలో టీడీపీ పార్టీనేత మువ్వాసత్యనారాయణ, జగదీశ్వర్‌గౌడ్ ఇరువురు కూడా సమరం నుంచి తప్పుకోవడంతో పార్టీ నేతల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. చేవెళ్ల పార్లమెంటుకు నామినేషన్ వేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ కూడా పోటీ విరమించుకున్నారు. నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులు.. మేడ్చల్ 19 మల్కాజిగిరి 23 కుత్బుల్లాపూర్ 23 కూకట్పల్లి 29 ఉప్పల్ 27 ఇబ్రహీంపట్నం 26 ఎల్బీనగర్ 29 మహేశ్వరం 21 రాజేంద్రనగర్ 23 శేరిలింగంపల్లి 21 చేవెళ్ల 13 పరిగి 9 వికారాబాద్ 12 తాండూరు 9 పార్లమెంటు నియోజకవర్గం మల్కాజిగిరి 30 చేవెళ్ల 15