![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/5/477547.jpg.webp?itok=sXu2N4ZM)
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...ఎవరికి ఆ అవకాశం లభించనుంది అంటే ఇప్పట్లో గ్రేటర్ నుంచి మంత్రి పదవి లేనట్లే అని తెలుస్తోంది. తెలంగాణ అంతటా విజయదుందుభి మోగించినా గ్రేటర్ ఓటర్లు కాంగ్రెస్‌కు మొండిచేయి చూపారు. దీంతో ఇక్కడి నుంచి ఇప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
రెండో విడుత కేటాయింపుల్లో భాగంగా ఎమ్మెల్సీ కోటాలో మాత్రమే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు మంత్రి పదవులను కేటాయించవచ్చు. మరోవైపు ఇప్పటికిప్పుడు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే శివార్లలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కానీ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సామాజిక వర్గాల వారిగా పదవులను కేటాయించవలసి ఉంటుంది.
ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ కసరత్తును చేపట్టింది. ఈ క్రమంలో ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు కట్టబెట్టారనే చెడ్డపేరు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆ రకంగా మల్‌రెడ్డికి ఈ దఫా అవకాశం లభించకపోవచ్చునని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేసేందుకు ప్రస్తుతం అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఎంపికై న తరువాత మాత్రమే నగరం నుంచి మంత్రి పదవి లభించే అవకాశం ఉంది.
ఆ ఛాన్స్ వరించేదెవరిని...
పదవీకాలం ముగిసిన వారితో పాటు, గవర్నర్ కోటా కింద త్వరలో ఎమ్మెల్సీల ఎంపిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, తాము గెలిచే స్థానాలను త్యాగం చేసి మరో చోట పోటీ చేయడంతో ఓడిన వాళ్లు, ఎంతోకాలంగా కాంగ్రెస్‌కు సేవ చేస్తున్న సీనియర్‌లకు ఎమ్మెల్సీ పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఈ జాబితాలో అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీగౌడ్, కేఎల్‌ఆర్, విజయారెడ్డి, వెన్నెల తదితరులు ఉన్నారు.
అంజన్‌కుమార్ యాదవ్ సీనియర్ నాయకుడు. అలాగే ఆ సామాజిక వర్గం దృష్టిలో చూసినా ఎంతో ప్రాధాన్యం ఉన్న నేత కావడంతో ఆయనకు అవకాశం లభించవచ్చునని అంటున్నారు. మరోవైపు పోటీచేసి ఓడిపోవడమే కాకుండా, పార్టీలో క్రియాశీల నాయకుడిగా గుర్తింపు కలిగిన మధుయాష్కీ కూడా కీలకమే.
ఇక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇవ్వదలిస్తే ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డిని ఎంపిక చేయవలసి ఉంటుంది. మరి కొందరు సీనియర్లు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీపడే అవకాశం ఉంది. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీల ఎంపికకు మరికొంత సమయం ఉన్న దృష్ట్యా ఆ ఛాన్స్ ఎవరిని వరించనుందో..వేచి చూడవలసిందే.
Comments
Please login to add a commentAdd a comment