హయత్‌నగర్: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి సోదరులు 20 ఏళ్లుగా రాజకీయంగా పోటీ పడుతూ వస్తున్నారు. ఇద్దరూ ఏ పార్టీలో ఉన్నా పోటీ మాత్రం వారి మధ్యే ఉంటోంది. ఇద్దరిలో ఒక్కసారి మల్‌రెడ్డి గెలవగా మూడుసార్లు మంచిరెడ్డి విజయం సాధించారు. మలక్‌పేట్ నియోజకవర్గం నుంచి వారి మధ్య పోటీ మొదలైంది. గతంలో నాలుగు పర్యాయాలు పోటీ పడిన వారు తాజాగా మరోసారి ఇబ్రహీంపట్నం బరిలో నిలిచారు. 2004లో మలక్‌పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్‌రెడ్డి రంగారెడ్డి పోటీ చేయగా టీడీపీ తరఫున మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బరిలో నిలిచారు.
ఈ ఎన్నికల్లో మల్‌రెడ్డి రంగారెడ్డి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వీరి పోటీ ఇబ్రహీంపట్నానికి మారింది. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పోటీ చేయగా మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి మల్‌రెడ్డిపై పైచేయి సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా ఈ ఎన్నికల్లో మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ టికెట్ రాలేదు.
ఆయన మహేశ్వరం నుంచి పోటీ చేయగా ఆయన సోదరుడు రాంరెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్‌గా మంచిరెడ్డిపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి గెలుపొందగా మల్‌రెడ్డి రాంరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో వచ్చిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. దీంతో మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు.
మిత్రపక్షమైన టీడీపీని కాదని కాంగ్రెస్ శ్రేణులు బీఎస్పీకి మద్దతిచ్చారు. ఈ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన మల్‌రెడ్డి రంగారెడ్డి సుమారు 376 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. తాజాగా మంచిరెడ్డి, మల్‌రెడ్డి మధ్య ఐదోసారి పోటీ జరుగుతోంది. ఇద్దరూ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో సొంత బలంతో పోటీ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రేస్ తరఫున పోటీలో ఉండడంతో ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మారింది...
Comments
Please login to add a commentAdd a comment