manchireddy kishanreddy
-
మరోసారి.. మంచిరెడ్డి వర్సెస్ మల్రెడ్డి
హయత్‌నగర్: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్రెడ్డి సోదరులు 20 ఏళ్లుగా రాజకీయంగా పోటీ పడుతూ వస్తున్నారు. ఇద్దరూ ఏ పార్టీలో ఉన్నా పోటీ మాత్రం వారి మధ్యే ఉంటోంది. ఇద్దరిలో ఒక్కసారి మల్రెడ్డి గెలవగా మూడుసార్లు మంచిరెడ్డి విజయం సాధించారు. మలక్‌పేట్ నియోజకవర్గం నుంచి వారి మధ్య పోటీ మొదలైంది. గతంలో నాలుగు పర్యాయాలు పోటీ పడిన వారు తాజాగా మరోసారి ఇబ్రహీంపట్నం బరిలో నిలిచారు. 2004లో మలక్‌పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్రెడ్డి రంగారెడ్డి పోటీ చేయగా టీడీపీ తరఫున మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మల్రెడ్డి రంగారెడ్డి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వీరి పోటీ ఇబ్రహీంపట్నానికి మారింది. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పోటీ చేయగా మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి మల్‌రెడ్డిపై పైచేయి సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా ఈ ఎన్నికల్లో మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ టికెట్ రాలేదు. ఆయన మహేశ్వరం నుంచి పోటీ చేయగా ఆయన సోదరుడు రాంరెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్‌గా మంచిరెడ్డిపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మంచిరెడ్డి గెలుపొందగా మల్రెడ్డి రాంరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. 2018లో వచ్చిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. దీంతో మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. మిత్రపక్షమైన టీడీపీని కాదని కాంగ్రెస్ శ్రేణులు బీఎస్పీకి మద్దతిచ్చారు. ఈ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన మల్రెడ్డి రంగారెడ్డి సుమారు 376 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. తాజాగా మంచిరెడ్డి, మల్రెడ్డి మధ్య ఐదోసారి పోటీ జరుగుతోంది. ఇద్దరూ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో సొంత బలంతో పోటీ చేసిన మల్రెడ్డి రంగారెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రేస్ తరఫున పోటీలో ఉండడంతో ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మారింది... -
ఇబ్రహీంపట్నంలో భారీగా డబ్బులు పట్టివేత..?
-
ఇబ్రహీంపట్నంలో భారీగా డబ్బులు పట్టివేత..?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఎత్తులు పైఎత్తులతో పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాగా.. ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తులు మొదలుపెట్టింది. ఎలక్షన్ స్క్వాడ్లను రంగలోకి దించి ముమ్మురమైన తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద సోమవారం ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న దాదాపు 27 లక్షల నగదును ఎలక్షన్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నట్టు సమాచారం. పట్టుబడిన సొమ్ము ఆదిబట్ల గ్రామ ఉపసర్పంచ్ పల్లె గోపాల్ గౌడ్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అయితే, గోపాల్‌గౌడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరుడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో ఖర్చుచేయడానికే సొమ్మును తరలిస్తున్నారని విమర్శలు గుప్పించాయి. -
'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు'
-
'నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు'
హైదరాబాద్: మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని కిషన్‌రెడ్డి సవాలు విసిరారు. రాజకీయ లబ్దికోసమే మల్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాంగ్‌స్టర్ నయీంతో తనకెలాంటి సంబంధాలు లేవని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు మల్రెడ్డి రంగారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..మంచిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నయీం కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు మంచిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రంగారెడ్డి ప్రశ్నించారు. శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే రూ.300 కోట్లు సంపాదించాడని ఆయన ఆరోపించారు. ఆదిభట్లలోని భూ కబ్జా విషయాలు బయటకొస్తాయనే భయంతోనే మంచిరెడ్డి పార్టీ మారారన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమని రంగారెడ్డి సవాల్ విసిరారు. -
చండీయాగంలో పాల్గొన్న సీఎం
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజలు సుభిక్షం గా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేస్తున్న చండీయాగం గురువారం ముగిసింది. పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం ఎలిమినేడులోని తన వ్యవసాయ క్షేత్రంలో మంచిరెడ్డి 9 రోజులుగా చండీయాగం నిర్వహిస్తున్నారు. ఉదయం 11.15కు కేసీఆర్ దంపతులు ప్రత్యే క హెలికాప్టర్లో ఎలిమినేడుకు చేరుకున్నారు. యాగశాల వద్ద సీఎంకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో కలసి పూజలు నిర్వహించారు. తమ వెంట తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తదితరులు హాజరయ్యారు. -
బస్సుయాత్రకు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ బస్సుయాత్రకు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కరెంట్ కొరత, రైతు సమస్యలపై తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బస్సుయాత్రకు ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య గైర్హాజరు అయ్యారు. కాగా గత కొంతకాలంగా ఆర్ కృష్ణయ్య టీడీపీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి నగర శివారులో తమతో పాటు బస్సుయాత్రలో పాల్గొంటారని, ఇక ధర్మారెడ్డి వరంగల్ జిల్లా బస్సుయాత్ర ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని, శనివారం ఆయన యాత్రలో పాల్గొంటారని ఎంపీ గరికపాటి మోహన్ రావు తెలిపారు. అయితే బస్సుయాత్ర నల్గొండ జిల్లా చేరుకున్నా మంచిరెడ్డి మాత్రం హాజరు కాలేదు. మరోవైపు కారు ఎక్కుబోయి చివరి నిమిషంలో యూ టర్న్ తీసుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బస్సు యాత్రలో పాల్గొన్నారు.