
చండీయాగంలో పాల్గొన్న సీఎం
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజలు సుభిక్షం గా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేస్తున్న చండీయాగం గురువారం ముగిసింది. పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం ఎలిమినేడులోని తన వ్యవసాయ క్షేత్రంలో మంచిరెడ్డి 9 రోజులుగా చండీయాగం నిర్వహిస్తున్నారు. ఉదయం 11.15కు కేసీఆర్ దంపతులు ప్రత్యే క హెలికాప్టర్‌లో ఎలిమినేడుకు చేరుకున్నారు.
యాగశాల వద్ద సీఎంకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో కలసి పూజలు నిర్వహించారు. తమ వెంట తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తదితరులు హాజరయ్యారు.