chandi yagam
-
ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ చండీ యాగం
సాక్షి,సిద్దిపేటజిల్లా: గజ్వేల్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం, చండీ యాగం నిర్వహిస్తున్నారు. యాగానికి సంబంధించి శుక్రవారం(సెప్టెంబర్6)10 గంటల నుంచి వేద పండితులతో పూజలు ప్రారంభించారు. ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొనున్నారని సమాచారం.రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడటం, కేసుల ఇబ్బందుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, కేసీఆర్ కూతురు, కల్వకుంట్ల కవిత ఐదు నెలలు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలులో ఉండి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. -
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
-
కాసేపట్లో నవచండి యాగం ప్రారంభం
-
‘కొండ’ గుడిలో చండీయాగం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా చెబుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలను తరలించే ప్రక్రియను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 29న ప్రారంభిస్తారు. గజ్వేల్ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ప్రారంభ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 29న చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ► 29న ఉదయం 4 గంటలకు ఏకకాలంలో కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మసాగర్ పంపుహౌస్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ► పూజల అనంతరం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. తిరిగి ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్‌లో నిర్మించే రైతు వేదికలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ► మర్కూక్‌లోని కొండపోచమ్మసాగర్ పం ప్హౌస్కు చేరుకుని చినజీయర్ స్వామికి స్వాగతం పలికి, సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. ► 11.30 గంటల ప్రాంతంలో పంప్‌హౌస్ స్విచ్చాన్ చేసిన తర్వాత ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ (నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలికి గంగమ్మ పూజలు నిర్వహిస్తారు. పరిమిత సంఖ్యలో ఆహ్వానితులకు మర్కూక్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ‘కొండపోచమ్మ’గా నామకరణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల (లిఫ్టుల) ద్వారా తరలించే నీటిని 618 మీటర్ల ఎత్తునున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు తరలిస్తారు. 15 టీఎంసీల నీటి నిల్వ సామ ర్థ్యమున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయ ర్ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్టుకు ‘కొండపోచమ్మ’పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల సరిహద్దులో కొండపోచమ్మ దేవాల యం ఉంది. దాని సమీపంలోనే కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం (మల్లన్న గుడి) ఉంది. రెండు దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉండటంతో నిత్యం భక్తులతో కళకళలాడుతుంటాయి. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతిపెద్ద రిజర్వాయర్‌కు మల్లన్నసాగర్ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్‌కు కొండపోచమ్మసాగర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన హరీశ్‌రావు సీఎం రాకను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం సాయంత్రం కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వద్ద మంత్రి హరీశ్‌రావు.. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు మంత్రి పలుసూచనలు చేశారు. చండీయాగం ఏర్పాట్లను ప్రముఖ వాస్తు ప్లానర్ సుద్ధాల సుధాకర్‌తేజ పరిశీలించారు. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న సీఎం ‘కొండపోచమ్మ’ప్రారంభానికి రావాలని చినజీయర్‌స్వామికి ఆహ్వానం ముఖ్యమంత్రి బుధవారం రాత్రి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని దర్శించుకున్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని దివ్య సాకేతాలయం ఆశ్రమంలో జీయర్‌స్వామిని కేసీఆర్ కలసి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రావాలని జీయర్‌స్వామిని ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జీయర్‌స్వామి మంగళశాసనాలు, ప్రత్యేక కానుకను సీఎంకు అందజేశారు. ఆశ్రమం వద్ద మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్రావు.. కేసీఆర్‌కు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్ ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో ముచ్చటిస్తున్న చినజీయర్‌స్వామి. చిత్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, మైహోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు -
‘గ్రహ కూటములు తొలగించడానికే ఈ యాగాలు
సాక్షి, విశాఖ : శారద పీఠంలో అయిదు రోజుల పాటు అతిరుద్ర, లక్ష చండీ యాగ నిర్వహణ జరిగిందని విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. దేశానికి చతుగ్రహా కూటమి, షష్ట గ్రహ కూటమి నడుస్తున్నాయని.. గ్రహ కూటములు తొలగించడానికి రెండు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణులతో యాగాన్ని నిర్వహించామన్నారు. ఈ యగాన్ని సుబ్బిరామిరెడ్డి సారధ్యంలో నిర్వహించినట్లు.. రాష్ట్రానికి మంచి జరగాలనే ప్రధాన ఉద్ధేశ్యంతోనే ఈ యాగ నిర్వహించారని వారు తెలిపారు. -
వైఎస్ జగన్ చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమం
సాక్షి, తాడేపల్లి : శ్రీ మహారుద్రసహిత ద్విసహస్ర చండీయాగ దీక్షాంత పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. సోమవారం (జూలై 1) ఉదయం 10.25 గంటలకు సీఎం చేతులమీదుగా తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణమండపంలో పూర్ణాహుతి జరుగుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిమండ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయదుందుభి మోగించాలని, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని 2017 జూలై 29 నుంచి 2019 జూన్ 29 వరకు ఈ చండీయాగాన్ని నిర్వహించారు. రుద్రయాగ దీక్ష పరిపూర్ణమైన సందర్భంగా సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం జరుగనుంది. -
ముగిసిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం
-
చండీయాగం పరిసమాప్తం
గజ్వేల్/జగదేవ్‌పూర్: బంగారు తెలంగాణ కల సాకా రం కావాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐదు రోజులపాటు చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం పరిసమాప్తమైంది. యాగం చివరి రోజైన శుక్రవారం ఎనిమిది మండపాల్లో పూర్ణాహుతితో ఈ మహా క్రతువు పూర్తయింది. విశాఖ పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు కుటుంబ సభ్యులు ప్రతి మండపానికీ వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజశ్యామల, బగలాముఖి, నవగ్రహ, రుగ్వేద, యజుర్వేద, సామ, అధర్వణవేద మండపాల్లో పూర్ణాహుతి తర్వాత ప్రధాన యాగశాల చండీమాత మహామండపంలో పూర్ణాహుతి చేపట్టారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ క్రతువుతో ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాజశ్యామలదేవికి పూజలు... ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు శుక్రవారం ఉదయం ముందుగా రాజశ్యామలదేవి మండపంలో పూజలు నిర్వహించారు. సమస్తత్వమే రాజశ్యామల మాతాకీ జై అంటూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు జరిగాయి. బగలాముఖిదేవి మండపంలో జరిగిన పూజల్లో వేద పండితులు ‘జయ పీతాంబర ధారిణి, దివ్య వేదోక్త మహానీరాజనం సమర్పయామి’అంటూ పూజలు చేశారు. నవగ్రహ మండపంలో నవగ్రహ, మహారుద్ర, చతుర్వేద మండపాల్లో సైతం పూర్ణాహుతి జరిగింది. ‘సహస్ర శీర్షా, పురుష సంవేద పుష్పమాం, పుష్పమాలికాం సమర్పయామి, సౌభాగ్య ద్రవ్య సమర్పయామి’అంటూ పూర్ణాహుతి నిర్వహించారు. ఇప్పటివరకు చేసిన పారాయణాలు, జపాలకు తద్దాశాంశ హోమ తర్పణాలను నిర్వహించారు. ప్రధాన కలశం అధిష్టాన దేవత మండపం వద్ద శారదా కల్పవృక్షం అనుసరించి అమ్మవారికి షోఢశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం చతుశష్టి యోగి నిబలి మంగళ నీరాజన సేవ చేశారు. ఆ తర్వాత అగ్ని మదనం ద్వారా అగ్ని ప్రతిష్ట చేసి 10 కుండాల వద్ద అదే అగ్నితో హోమం ప్రారంభించారు. పది యజ్ఞ కుండాలలో ఒక్కో యజ్ఞ కుండం వద్ద ఆచార్య బ్రహ్మతో కలిపి 11 మంది వేదపండితులు పాయసం, తెల్ల నువ్వులు, నెయ్యితో కలిపిస ద్రవ్యాన్ని ఆహుతులిస్తూ హోమాన్ని నిర్వహించారు. అనంతరం అష్టదిక్పాలక బలి, ప్రాయశ్చిత్త హోమాలను చేపట్టారు. 700 సప్తశతి (చండీ) శ్లోకాల స్వాహాకారాలకు పాయసం, తెల్ల నువ్వులు, నెయ్యితో కలిపిన ద్రవ్యాన్ని యజ్ఞ భగవానునికి హావిస్సుగా సమర్పించారు. మహాపూర్ణాహుతిలో భాగంగా చండీయాగ మండపంలోని అన్ని యజ్ఞకుండాల అగ్నిని ప్రధాన యజ్ఞ కుండంలోకి తీసుకొచ్చి మహాపూర్ణాహుతి ప్రారంభించారు. యజ్ఞ ఆచార్యులు మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, ఖర్జూర, వక్కలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జీడిపప్పు, పటికబెల్లం, బాదం, పచ్చ కర్పూరం, గంధక చూరాలు, పూలు, పండ్లు, తమలపాకులు, పట్టుచీర, మారేడుకాయ తదితరాలను పూర్ణాహుతిలో భాగంగా యజ్ఞ భగవానుడికి సమర్పించారు. తర్వాత వసోర్దార... అంటే నెయ్యిని ధారగా పూర్ణాహుతి అనంతరం యజ్ఞ భగవానుడికి సమర్పించే ప్రక్రియ సాగింది. అదే విధంగా మహారుద్ర, రాజశ్యామల, బగలాముఖి, చతుర్వేద, నవగ్రహ యాగ మండపాల్లో కూడా షోఢశోపచార పూజలు చేసి హోమాల అనంతరం పూర్ణాహుతితోపాటు సువాసిని పూజ, మహదాశీర్వచనం, రుత్విక్ సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు... చివరి రోజు కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ కవిత, టీఆర్ఎస్ సీనియర్ నేత కె. కేశవరావు, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వెయ్యి కిలోల పాయసం.. యాగంలో చివరి రోజు శుక్రవారం చండీమాత యాగశాలలో అగ్నిస్థాపన చేసి (మిగిలిన నాలుగు రోజులు కేవలం పారాయణం, జపం మాత్రమే చేశారు) హోమాన్ని నిర్వహించారు. చండీ సప్తశతి(700)లోని ప్రతి శ్లోకానికీ (ప్రతి శ్లోకం జుహుయాత్ పాయసం, తిల సర్పిషా) నువ్వులు, నెయ్యితోపాటు పాయసాన్ని కలిపి ఆహుతులు ఇచ్చారు. ఇందుకోసం సుమారు వెయ్యి కిలోల పాయస ద్రవ్యాన్ని వినియోగించారు. ఈ పాయసాన్ని బియ్యం, నెయ్యి, పాలు, బెల్లం, తేనె, యాలుకలు, జీడిపప్పు, కిస్మిస్ తదితరాలతో తయారు చేశారు. సప్తశతి పఠనంతో చండీమాత సాక్షాత్కారం విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ‘కలే చండీ విశిష్యత్’కలియుగంలో త్వరగా ఫలితాన్నిచ్చేది చండీ దేవత. ఆమెను ఉపాసించి ఎంతోమంది సత్ఫలితాలను పొందారని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఐదు రోజులుగా జరుగుతున్న సహస్ర చండీయాగం శుక్రవారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడారు. ఎక్కడైతే సప్తశతి పఠించబడుతుందో అక్కడ నేనుంటానని అమ్మవారు చెప్పారన్నారు. కేవలం ఉండటమే కాకుండా ‘సదామత ద్విమోక్షామి’అంటే.. ‘ఎప్పుడూ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టను’అని చెప్పారని, ఆమె ఎక్కడుంటే అది మణి ద్వీపము, సుభిక్షము, సస్యశ్యామలమూ అయి ఉంటుందన్నారు. అందువల్ల చండీ ఉపాసన ప్రాశస్త్యమై ఉన్నదని అన్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు చండీ సంబంధమైన అన్నిరకాల ఉపాసనలు చేశారు. దేశ క్షేమము, లోక సంరక్షణమే ప్రధాన ధ్యేయంగా సంకల్పించి రాజశ్యామల, బగలాముఖి, నవగ్రహ, చతుర్వేద, మహారుద్ర సహిత సహస్ర చండీమహాయాగాన్ని చేయతలపెట్టి శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ మహాస్వాముల వారి ఆశీస్సులు అందుకుని గత నాలుగు రోజులుగా గణపతి సహస్ర మోదక హోమం, రాజశ్యామలా మహా మంత్రానుష్టానము, లక్ష బగలాముఖి మహామంత్రానుష్టానము, వెయ్యి చండీ పారాయణములు, మహారుద్ర మంత్రముల అనుష్టానములను చేసి దశాంశ హోమ పక్షమును ఆశ్రయించారన్నారు. చివరిరోజైన శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మహాద్భుతంగా అన్ని యాగములకు పూర్ణాహుతులు చేసి సహస్ర చండీ మహాయాగ పూర్ణాహుతిని అత్యంత వైభవముగా ముఖ్యమంత్రి దంపతులు నిర్వహించారు’అని ఆయన ప్రశంసించారు. -
పూర్ణాహుతితో ముగిసిన చండీయాగం
సాక్షి, జగదేవ్‌పూర్ (గజ్వేల్): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన మహారుద్ర సహిత సహప్ర చండీయాగం ముగిసింది. ఐదురోజుల పాటు కొనసాగిన ఈ యాగం విజయవంతంగా పూర్తయింది. యాగంలో చివరిరోజైన శుక్రవారం నాడు మొత్తం 8 మండపాలలో పుర్ణాహుతి జరిగింది. నేడు యాగానికి హాజరైన విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో కేసీఆర్ దంపతులు ప్రతీ మండపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తొలుత రాజశ్యామల, బగలాముఖి, నవగ్రహ, బుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. అనంతరం ప్రధాన యాగశాలైన చండీమాత మహా మండపంలో వేదపండితుల మంత్రోశ్చరణల నడుమ కేసీఆర్ దంపతులు పూజాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుత్వికులను కేసీఆర్ ఘనంగా సన్మానించారు. -
చివరిఘట్టానికి కేసీఆర్ సహస్ర మహా చండీయాగం
-
ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ చండీయాగం
-
యాగం.. వైభోగం!
సాక్షి, జగదేవ్‌పూర్ (గజ్వేల్): రాష్ట్రం సుభిక్షంగా ఉం డాలని కాంక్షిస్తూ.. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న మహా రుద్ర సహిత సహస్రచండీ మహాయాగం నాలుగో రోజు విజయవంతంగా పూర్తయింది. గురువారం ఉదయం యాగశాలకు సతీసమేతంగా వచ్చిన సీఎం కేసీఆర్.. మొదట రాజశ్యామల మాత మంటపంలో పూజలు నిర్వహించారు. శ్రీమహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతీ, స్వరూపిణిగా శ్రీ రాజశ్యామలాదేవికి పుష్పాంజలి ఘటించారు. సర్వమంగళ మాంగల్యే.. శ్రీ రాజశ్యామలా దైవేయ నమస్తే.. అంటూ రుత్వికులు వేదోక్తంగా ప్రార్థనలు చేశారు. రాజశ్యామల మంటపంలో సీఎం దంపతులకు వేద పండితు లు ఆశీర్వచనం చేశారు. శుక్రవారం పూర్ణాహుతితో ఈ యాగం పరిసమాప్తం కానుంది. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు విశాఖ శారదా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి శుక్రవారం ఉదయం ఎర్రవల్లికి చేరుకోనున్నారు. మహారుద్ర మంటపంలో పూజలు గురువారం నాడు మహారుద్ర మంటపంలో జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుత్వికులు మహారుద్ర సహిత ఏకాదశ రుద్ర పఠనం, నమకం, చమకం పఠించారు. పంచాక్షరి జపంలో భాగంగా శివశివ శంకర భూత పతే, శంకర శివ, శంభో మహాదేవ, హరహర మహాదేవ మంత్రాలతో యాగశాలలు మార్మోగాయి. బ్రహ్మ స్వరూపిణి బగళాముఖి మంటపంలో సీఎం కేసీఆర్ దంపతుల సమక్షంలో వేద పండితులు, రుత్వికులు పూజలు చేశారు. శతమానం భవతే అంటూ పండితులు సీఎం దంపతులను ఆశీర్వదించారు. నవగ్రహ మంటపంలో ఆదిత్య హృదయంతోపాటు సూర్యాది నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీమాత ప్రధాన యాగశాలలో రాజరాజేశ్వరీదేవి ప్రార్థన చేశారు. గురువారం రుత్వికులు 400 సార్లు చండీ సప్తశతి పారాయణ చేశారు. వేద పండితులు యాగం వీక్షించడానికి వచ్చిన భక్తులకు సుభాషితాలు వినిపించారు. యాగ విశిష్టతను వివరించారు. మహాహారతితో గురువారం నాటి పూజా కార్యక్రమాలు ముగిసాయి. నాలుగో రోజు యాగంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన వివిధ రకాల పూజా కార్యక్రమాల్లో పాల్గొని చండీమాత అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్రంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు అందరితోపాటు పలువులు ప్రముఖులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం పూజాకార్యక్రమాలతో యాగం ముగియనుంది. -
నాలుగో రోజు చండీయాగం
-
నాలుగో రోజు శాస్త్రోక్తంగా చండీయాగం
సాక్షి, మెదక్: లోక కళ్యాణార్ధం ముఖ్యమంత్రి కేసీఆర్ చేయిస్తున్న సహస్ర చండీయాగం నాలుగోరోజూ శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఉదయం పూజానంతరం 300 చండీ పారాయణాలు పూర్తి చేశారు. హోమంలో భాగంగా అరుణ పారాయణ మహాసారం, పంచ కాఠకముల పారాయణాలు, నవగ్రహ జపానుష్టానాలు, మహా మృత్యుంజయ జపం నిర్వహిస్తున్నారు. రేపు (శుక్రవారం) పూర్ణాహుతితో చండీయాగం పూర్తవుతుంది. -
ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం మూడో రోజు చండీయాగం
-
మూడో రోజు కొనసాగుతున్న సహస్ర చండీయాగం
సాక్షి, మెదక్: సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ చేయిస్తున్న చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం మూడో రోజుకు చేరుకుంది. వేదపారాయణాలు, వేదమంత్రాలతో ఎర్రవల్లి వ్యవసాయం క్షేత్రం ప్రతిధ్వనిస్తోంది. ఇప్పటివరకూ 200 చండీ పారాయణాలు పూర్తి అయ్యాయి. వేదఘోషతో ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రం, చండీయాగ వేదిక మారుమోగుతోంది. తెలంగాణ ప్రజల సుఖసంతోషాలతో జీవించాలంటూ సీఎం కేసీఆర్ సంకల్పించిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం పంచాహ్నిక దీక్ష మూడవరోజుకు చేరుకుంది. మంగళవారం వరకూ వందమంది రుత్విక్కులు 200 చండీ పారాయణాలు పూర్తిచేశారు. రెండోరోజు ఉదయం తొమ్మిది గంటలకు శాంతిపాఠముతో మహారుద్రయాగం ప్రారంభమైంది. 44 మంది రుత్విక్కులు ఏకకాలంలో ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. ఆ తర్వాత క్రమార్చన హారతి, మంత్రపుష్ప సమర్పణ నిర్వహించారు. తొలిరోజులాగే రెండోరోజు కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. అనుష్ఠానం అనంతరం రాజశ్యామల మహావిద్య పారాయణం జరిగింది. ఆ తర్వాత హోమం పూర్తిచేసి.. అమ్మవారికి సహస్ర నామార్చన చేశారు. తీర్థప్రసాద వితరణతో రెండోరోజు రుద్రయాగం పూర్తయింది. చండీయాగ వేదిక ప్రాంగణంలో ప్రతిరోజు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద పారాయణాలు జరుగుతున్నాయి. మహేతిహాసాలైన రామాయణ భారతాల్లోని సుందరకాండ, విరాట పర్వం పారాయణాలు కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నారు. శృంగేరీ శారదాపీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామివారి ఆశీస్సులతో, శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మార్గదర్శనంలో యాగ, పారాయణాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. -
రెండో రోజు మహా హారతి, మంత్రపుష్పం
జగదేవ్‌పూర్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మహారుద్ర సహిత సహస్ర మహా చండీయాగ పాంచాహ్నిక దీక్షలో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 100 మంది రుత్వికులు 200 చండీ పారాయణాలను పూర్తిచేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు మహాహారతి, మంత్ర పుష్పముతో మాధ్యాహ్నిక పూజలు నిర్వహించారు. మహారుద్రయాగంలో భాగంగా ఉదయం 9 గంటలకు శాంతి పాఠంతో 41 ఏకాదశ అభిషేకాలను పూర్తిచేశారు. రాజశ్యామల యాగంలో భాగంగా రుత్వికులు రాజశ్యామల అనుష్టానం, హోమం, రాజశ్యామల మహా విద్యపారాయణం, హోమం, సహస్ర నామార్చన నిర్వహించారు. బగలాముఖి యాగంలో భాగంగా రుత్వికులు 10 వేల జపములు పూర్తిచేశారు. అదే విధంగా రుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం.. శుక్ల యజుర్వేదము, పారాయణములు, హవనాదులు, సుందరాకాండ, విరాఠ పర్వ మహాసౌర పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతుల ఆశీస్సులతో విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. వేద పండితులు పురాణం మహేశ్వరశర్మ, మంగళంపల్లి వేణుగోపాలశర్మ, శాస్త్రుల వెంకటేశ్వరశర్మ, ఫణి శశాంకశర్మ, గంగవరం నారాయణశర్మ, కామేశ్వరశర్మ, కాసుల చంద్రశేఖరశర్మల నిర్వహణలో పూజా కార్యక్ర మాలు జరుగుతున్నాయి. రెండో రోజు యాగంలో హోం మంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. యాగం సందర్భంగా ఫామ్‌హౌస్ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఎర్రవల్లిలో రెండోరోజూ సహస్ర చండీయాగం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం మంగళవారం రెండోరోజుకు చేరుకుంది. మొత్తం 300 మంది రుత్వికులతో ఐదు రోజులపాటు చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కొనసాగనుంది. విశాఖపట్నానికి చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది. చండీయాగంలో భాగంగా ఈ నెల 25న పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వేదోక్తంగా ప్రారంభమైన చండీయాగం మహారుద్రసహిత సహస్ర చండీయాగం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు యజ్ఞవాటికలో వేదోక్తంగా ఈ క్రతువును ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో ప్రారంభమైన యాగానికి... కర్ణాటకలోని శృంగేరి పీఠానికి చెందిన తంగిరాళ సీతారామ శాస్త్రులు, మాడుగుల మాణిక్య సోమయాజులు, ఋగ్వేద పండితులు నరేంద్ర కాప్రే తదితర ప్రముఖులు వైదిక సారథ్యం వహించారు. స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి యాగశాల ప్రవేశం చేసి పూజా కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సుమారు 300 మంది ఋత్విజులు దుర్గా సప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించడానికి ముందు యాగం నిర్విఘ్నంగా కొనసాగాలనే తలంపుతో 1,000 మోదకాలతో ప్రత్యేక హవనాన్ని నిర్వహించారు. ఋత్విజులు వేదమంత్రాలు పఠిస్తుండగా ముఖ్యమంత్రి దంపతులు ముందుగా యజ్ఞవాటిక చుట్టూ ప్రదక్షిణలు చేసి చండీ యజ్ఞవాటికలో పుణ్యాహవచణం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా గోపూజ, గురుపూజ జరిగింది. అరణి నుంచి అగ్నిని మథించడం ద్వారా రగిలిన నిప్పుతో నాలుగు యజ్ఞాలు ప్రారంభమయ్యాయి. సుమారు మూడు గంటలపాటు ముఖ్యమంత్రి దంపతులు యాగవాటికలోనే ప్రత్యేక పూజలు జరిపారు. ఇందులో భాగంగా వైవాహిక స్వర్ణోత్సవాలు జరిగిన వయో వృద్ధ దంపతులకు దంపతీ పూజలు, కన్యాకుమారి పూజలను సీఎం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీయాగంలో తొలి రోజు వంద సప్తశతి చండీ పారాయణాలు చేశారు. రుత్విజుల పారాయణాలతో ఎర్రవల్లి యాగవల్లిగా మారింది. సాయంత్రం జపాలు, అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలను చేపట్టారు. యాగంలో కపిలాశ్రమ స్వామి కూడా హాజరై ప్రముఖులకు ఆశీర్వచనం అందజేశారు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వెళ్లబోతున్నారు. -
వేదోక్తంగా చండీయాగం ప్రారంభం
సాక్షి హైదరాబాద్/గజ్వేల్/జగదేవ్‌పూర్: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన మహారుద్రసహిత సహస్ర చండీయాగం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు యజ్ఞ వాటికలో వేదోక్తంగా ఈ క్రతువును ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో ప్రారంభమైన యాగానికి... కర్ణాటకలోని శృంగేరి పీఠానికి చెందిన తంగిరాళ సీతారామ శాస్త్రులు, మాడుగుల మాణిక్య సోమయాజులు, ఋగ్వేద పండితులు నరేంద్ర కాప్రే తదితర ప్రముఖులు వైదిక సారథ్యం వహించారు. స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి యాగశాల ప్రవేశం చేసి పూజా కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సుమారు 300 మంది ఋత్విజులు దుర్గా సప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించడానికి ముందు యాగం నిర్విఘ్నంగా కొనసాగాలనే తలంపుతో 1,000 మోదకాలతో ప్రత్యేక హవనాన్ని నిర్వహించారు. ఋత్విజులు వేదమంత్రాలు పఠిస్తుండగా ముఖ్యమంత్రి దంపతులు ముందుగా యజ్ఞవాటిక చుట్టూ ప్రదక్షిణలు చేసి చండీ యజ్ఞవాటికలో పుణ్యాహవచణం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా గోపూజ, గురుపూజ జరిగింది. అరణి నుంచి అగ్నిని మథించడం ద్వారా రగిలిన నిప్పుతో నాలుగు యజ్ఞాలు ప్రారంభమయ్యాయి. సుమారు మూడు గంటలపాటు ముఖ్యమంత్రి దంపతులు యాగవాటికలోనే ప్రత్యేక పూజలు జరిపారు. ఇందులో భాగంగా వైవాహిక స్వర్ణోత్సవాలు జరిగిన వయో వృద్ధ దంపతులకు దంపతీ పూజలు, కన్యాకుమారి పూజలను సీఎం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీయాగంలో తొలి రోజు వంద సప్తశతి చండీ పారాయణాలు చేశారు. రుత్విజుల పారాయణాలతో ఎర్రవల్లి యాగవల్లిగా మారింది. సాయంత్రం జపాలు, అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలను చేపట్టారు. యాగంలో కపిలాశ్రమ స్వామి కూడా హాజరై ప్రముఖులకు ఆశీర్వచనం అందజేశారు. ఐదు రోజులపాటు సాగే ఈ యాగం శుక్రవారం మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతితో ముగియనుంది. భారీ పోలీస్ బందోబస్తు... ఎర్రవల్లిలో సోమవారం ప్రారంభమైన యాగానికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడు దిక్కులా చెక్ పోస్టులతో ఎర్రవల్లి నుంచి ఫామ్‌హౌస్‌కు వెళ్లే రోడ్డు వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు మీదుగా వెళ్లే వారిని పోలీసులు చెక్‌పోస్టు దగ్గరే ఆపి వెనక్కి పంపించారు. అలాగే వర్ధరాజ్‌పూర్ రోడ్డు మధ్యలో నుంచి శివారు వెంకటాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డును మొత్తం మూసేశారు. అలాగే గంగాపూర్ నుంచి ఫామ్‌హౌస్‌కు వచ్చే దారిలో శివారువెంకటాపూర్ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా వాహనాలను వెనక్కి పంపించారు. సోమవారం ఉదయమే సీపీ ఫామ్‌హౌస్‌కు చేరుకుని బందోబస్తును పర్యవేక్షించారు. ప్రముఖుల హాజరు... ముఖ్యమంత్రి చేపట్టిన మహారుద్రసహిత సహస్ర చండీమహాయాగాన్ని తిలకించేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు ఎర్రవల్లికి విచ్చేశారు. కేసీఆర్ కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే, కేటీఆర్ దంపతులు, ఎమ్మెల్యే హరీశ్‌రావు, కేసీఆర్ కుమార్తె కవిత దంపతులతోపాటు హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారు శేరి సుభాష్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మీకాంతారావు, టీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు తొలిరోజు యాగాన్ని వీక్షించారు. యాగం ఎందుకు చేస్తారంటే... కరువు కాటకాలు రాకుండా, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.. దేశానికి క్షేమం జరగాలనే ఇలాం టి యాగాలు నిర్వహిస్తారు. ప్రాచీన కాలం నుంచి ఈ యాగాలను రాజులు, ప్రభువులు నిర్వహించారని చరిత్ర చెబుతోంది. ప్రత్యేకించి శ్రీ సహస్ర చండీయాగం జరిగిన పరిసరాల్లో మంచి ఫలితా లు ఉంటాయని మార్కండేయ పురాణంలో స్పష్టంగా రాసి ఉంది. రాష్ట్రానికి అధిపతిగా ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగానికి పూనుకోవడం నిజంగా సాహసమే. దేశంలోనూ ఈ యాగం చాలా చోట్ల జరిగింది. కొంతమంది భక్తు లు బృందంగా ఏర్పడి మాత్రమే చేసిన సందర్భాలున్నాయి. కానీ... కేసీఆర్ సీఎం హోదాలో ఈ కార్యాన్ని తలపెట్టడం అభినందనీయం. గతంలో నిర్వహించిన యాగాలతో మంచి ఫలితాలు వచ్చాయి. అదే నమ్మకంతో కేసీఆర్ సహస్ర చండీ యాగాన్ని తలపెట్టారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి మొట్టమొదటి సీఎంగా బాధ్యతలు విజయవంతంగా చేపట్టడం.. రెండోసారి కూడా అ«ధికారాన్ని దక్కించుకున్న తర్వాత తాను చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవరోధం కలగకూడదన్న సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. కలియుగంలో చండీని ప్రసన్నం చేసుకోవడం చాలా ప్రధానమైనది. కలియుగంలో చండీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ పని మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా పూర్తి కావడానికి ఈ యాగం పనిచేస్తుంది. – యాగ నిర్వాహకుడు పురాణం మహేశ్వరశర్మ -
ప్రారంభమైన మహా రుద్ర సహస్ర చండీయాగం
-
సకల సౌకర్యాలు.. పటిష్ట భద్రత
-
నేటి నుంచి చండీయాగం
గజ్వేల్/జగదేవ్‌పూర్: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగి బంగారు తెలంగాణ కల సాకారం కావాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ నేటినుంచి మహారుద్ర సహస్ర చండీయాగం చేయనున్నా రు. శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామి ఆశీస్సులతో.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో ఐదురోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ ఐదురోజుల్లో చతుర్వేద, పురస్సర, మహారుద్ర సహస్ర చండీయాగాలు చేస్తారు. మొదటిరోజు ఈ యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. ఉదయం గణపతి పూజ అనంతరం పుణ్యహవచనం, రుత్వికహవనం, యాగశాల ప్రవేశం, గోపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం వరకు పూజలు కొనసాగుతాయి. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ యాగాన్ని, పూజ కార్యక్రమాలను మాణిక్య శర్మ, సోమయాజులు, నరేంద్ర కాప్రేలతో పాటు శృంగేరీ పీఠం పండితులు ఫణిశశాంక శర్మ, గోపికృష్ణ శర్మ, పురాణం మహేశ్వర శర్మలు పర్యవేక్షించనున్నారు. తొలిరోజు మధ్యాహ్నం వరకు వివిధ రకాల పూజ కార్యక్రమాలు చేయనున్నారు. మూడు యాగశాలల్లో 27 హోమ గుండాల వద్ద 300 మంది రుత్వికులు పూజల్లో పాల్గొననున్నారు. అపారమైన దైవభక్తి ఉన్న కేసీఆర్ యజ్ఞాలు, సంఖ్యాశాస్త్రాలను బాగా విశ్వసిస్తారన్న సంగతి తెలిసిందే. తొలి తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ప్రజానీకం బాగుండాలని కోరుతూ ఆయుత చండీయాగం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శేయస్సు కోరుతూ గతేడాది నవంబర్‌లో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఏకోత్తర వృద్ధితో పారాయణం యాగశాలకు నాలుగు దిక్కులా నాలుగు వేదాలు రక్షణగా ఉండాలనే సంకల్పంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తూర్పు దిక్కున రుగ్వేదం, దక్షిణ దిక్కున యజుర్వేదం, పశ్చిమ దిక్కున సామవేదం, ఉత్తరాన అధర్వన వేదపారాయణం నిర్వహిస్తారు. ఒక్కో హోమగుండం వద్ద ఎనిమిది మంది రుత్వికులు వేద పారాయణం చేస్తారు. ఐదు రోజుల ఈ యాగంలో ఏకోత్తర వృద్ధి పద్ధతిలో పారాయణం నిర్వహిస్తారు. మొదటి రోజు వంద పారాయణాలు, రెండో రోజు రెండొందల పారాయణాలు... ఇలా పెంచుతూ వెయ్యి పారాయణాలుగా సహస్రం పూర్తవుతాయి. ఇందుకోసం పది హోమగుండాలు, ఒక్కో దాని వద్ద పది మంది చొప్పున పాయసం ద్రవ్యంతో హోమం చేస్తారు. యాగంలో చండీతో పాటు అనుబంధ యాగాలు కూడా నిర్వహించనున్నారు. అనుబంధ యాగాలను 100 మంది రుత్వికులు పర్యవేక్షిస్తారు. మహారుద్రం, రాజశ్యామల, పీతాంబరీదేవి, అనుష్ఠానం, సూర్యయాగం, నవగ్రహ యాగం, సూర్య అనుష్ఠాలు, వాస్తు, గణపతి వంటి అనుబంధ యాగాలు నిర్వహించనున్నారు. మహారుద్రం, భగలాముఖి నవగ్రహ, చతుర్వేద పారాయణం వంటివి భాగంగా ఉంటాయి. అనుబంధ యాగాలు నిర్వహించడానికి వేరుగా ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు.. పటిష్ట భద్రత యాగం నిర్వహించడానికి వచ్చే రుత్వికులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి 300 మంది రుత్వికులు యాగంలో పాల్గొననున్నారు. వారంతా శని, ఆదివారాల్లో ఫాంహౌస్‌కు చేరుకున్నారు. వారికి సరిపడే గదులు, ఇతర వసతులు కల్పించారు. కర్ణాటక నుంచి కొంతమంది రుత్వికులు వచ్చారు. సంప్రదాయం ప్రకారం ఎర్రవల్లి గ్రామ పూజారులు, మండలానికి చెందిన పండితులు కూడా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఐదు రోజుల పాటు యాగంలో ఈ రుత్వికులు అందరూ పాల్గొంటారు. ఈ యాగం నేపథ్యంలో ఎర్రవల్లిలోని గ్రామదేవతలకు ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ, గడిమైసమ్మ, బొడ్రాయి, మహంకాళమ్మ, హనుమాన్ ఆలయాల వద్ద ఈ పూజలు జరిగాయి. గ్రామస్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. యాగానికి సీఎంతో పాటు ప్రముఖులు వస్తున్నందున.. వ్యవసాయ క్షేత్రం చుట్టూ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలను బందోబస్తు విధుల్లో నిమగ్నం కానున్నారు. మహారుద్ర సహస్ర చండీయాగానికి సీనియర్ జర్నలిస్టు స్వామి గౌరీశంకర్.. హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన గంగాజలాన్ని అందించారు. పనులను పరిశీలించిన కేసీఆర్ సోమవారం నుంచి తన ఫాంహౌస్‌లో ప్రారంభమయ్యే మహారుద్ర సహస్ర చండీయాగం పనులను ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ çపర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి రాగానే ఫాంహౌస్‌లో ఏర్పాటైన యాగశాలలన్నింటి వద్దకు చేరుకున్నారు. హోమగుండాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. యాగశాలలను అందంగా తీర్చిదిద్దడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, సీఎం రాజకీయ సలహాదారు శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, యాగానికి రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పలువురు పెద్దసంఖ్యలో హాజరు కానున్నట్టు తెలిసింది. ఈ మహాక్రతువు కోసం 10రోజులుగా యాగశాలలు సిద్ధం చేస్తున్నారు. మూడు చోట్ల యాగశాలలను తీరొక్క పూలతో అందంగా ముస్తాబు చేశారు. పక్కన వివిధ రకాల పూలకుండీలను పెట్టారు. అలాగే రాత్రి వేళల్లో యాగశాలలు మిరుమిట్లు గొలిపేలా రంగురంగుల విద్యుద్దీపాలను అలంకరించారు. -
వచ్చే నెలలో చండీ, రాజశ్యామల యాగాలు
సాక్షి, సిద్ధిపేట: యాగాలు, యజ్ఞాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అపార నమ్మకం ఉన్న సీఎం కేసీఆర్ మరోసారి యాగాలకు సిద్ధమవుతున్నారు. కొంతకాలం కిందట అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఆయన.. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సూచన మేరకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో రెండు రోజులపాటు రాజ శ్యామల యాగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహించారు. అనంతరం ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించడం, రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కుటుంబసభ్యులతో కలసి విశాఖపట్నం వెళ్లి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. ఈ నేపథ్యంలో స్వామి సూచన మేరకు సీఎం కేసీఆర్.. జనవరి 21 నుంచి 25 వరకు రెండు యాగాల నిర్వహణకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఈ మేరకు ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మొదటగా సహస్ర చండీ యాగం, ఆపై రాజ శ్యామల యాగం నిర్వహించనున్నట్లు సమాచారం. మొదటి రోజు సహస్ర చండీ యాగాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి, రుత్వికులు కలసి పూర్ణకుంభంతో ప్రారంభిస్తారు. ప్రారంభ, ముగింపు రోజుల్లో స్వామి హాజరు కానున్నట్లు తెలిసింది. మిగతా రోజుల్లో రుత్వికులు యాగాన్ని నిర్వహించనున్నారు. ఆ దిశగా వ్యవసాయక్షేత్రంలో ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు సమాచారం. -
టీ.సుబ్బిరామిరెడ్డి అతిరుద్ర చండీయాగం ప్రారంభం
-
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయం
నాగోలు రంగారెడ్డి : సర్వజనులూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అమ్మవారి ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి చండీయాగం నిర్వహించడం అభినందనీయమని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిలు అన్నారు. ఎల్బీనగర్ నాగోలు స్నేహపురికాలనీలో యాగ నిర్వాహకులు ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న మహారుద్ర సహస్ర చండీయాగం మహోత్సవం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని అన్నారు. ప్రజాకర్షక రామరాజ్యం అందించి విజయం చేకూరాలని అమ్మవారివారి ఆశీస్సులతో జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చండీయాగం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి తెలుగు ప్రజలందరూ బాగుండాలని, అందరి ఆకాంక్ష మేరకు జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆయన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యాగ నిర్వాహకులు నల్లపెద్ది శివరామప్రసాద్ శర్మ, శ్రీనివాస శర్మ, నాగేంద్రకుమార్ శర్మ, వైఎస్సార్ సీపీ నాయకులు బండారు వెంకటరమణ, పిట్టల రవి, రవిందర్‌రెడ్డి, నర్సింగ్, అశోక్‌యాదవ్, ప్రవీణ్‌కుమార్, టిల్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.