ఎర్రవల్లిలో సోమవారం నిర్వహించనున్న చండీయాగానికి సిద్ధమైన యాగశాలలు
గజ్వేల్/జగదేవ్‌పూర్: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగి బంగారు తెలంగాణ కల సాకారం కావాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ నేటినుంచి మహారుద్ర సహస్ర చండీయాగం చేయనున్నా రు. శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామి ఆశీస్సులతో.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో ఐదురోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ ఐదురోజుల్లో చతుర్వేద, పురస్సర, మహారుద్ర సహస్ర చండీయాగాలు చేస్తారు. మొదటిరోజు ఈ యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. ఉదయం గణపతి పూజ అనంతరం పుణ్యహవచనం, రుత్వికహవనం, యాగశాల ప్రవేశం, గోపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం వరకు పూజలు కొనసాగుతాయి.
తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ యాగాన్ని, పూజ కార్యక్రమాలను మాణిక్య శర్మ, సోమయాజులు, నరేంద్ర కాప్రేలతో పాటు శృంగేరీ పీఠం పండితులు ఫణిశశాంక శర్మ, గోపికృష్ణ శర్మ, పురాణం మహేశ్వర శర్మలు పర్యవేక్షించనున్నారు. తొలిరోజు మధ్యాహ్నం వరకు వివిధ రకాల పూజ కార్యక్రమాలు చేయనున్నారు. మూడు యాగశాలల్లో 27 హోమ గుండాల వద్ద 300 మంది రుత్వికులు పూజల్లో పాల్గొననున్నారు. అపారమైన దైవభక్తి ఉన్న కేసీఆర్ యజ్ఞాలు, సంఖ్యాశాస్త్రాలను బాగా విశ్వసిస్తారన్న సంగతి తెలిసిందే. తొలి తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ప్రజానీకం బాగుండాలని కోరుతూ ఆయుత చండీయాగం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శేయస్సు కోరుతూ గతేడాది నవంబర్‌లో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.
ఏకోత్తర వృద్ధితో పారాయణం
యాగశాలకు నాలుగు దిక్కులా నాలుగు వేదాలు రక్షణగా ఉండాలనే సంకల్పంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తూర్పు దిక్కున రుగ్వేదం, దక్షిణ దిక్కున యజుర్వేదం, పశ్చిమ దిక్కున సామవేదం, ఉత్తరాన అధర్వన వేదపారాయణం నిర్వహిస్తారు. ఒక్కో హోమగుండం వద్ద ఎనిమిది మంది రుత్వికులు వేద పారాయణం చేస్తారు. ఐదు రోజుల ఈ యాగంలో ఏకోత్తర వృద్ధి పద్ధతిలో పారాయణం నిర్వహిస్తారు. మొదటి రోజు వంద పారాయణాలు, రెండో రోజు రెండొందల పారాయణాలు... ఇలా పెంచుతూ వెయ్యి పారాయణాలుగా సహస్రం పూర్తవుతాయి. ఇందుకోసం పది హోమగుండాలు, ఒక్కో దాని వద్ద పది మంది చొప్పున పాయసం ద్రవ్యంతో హోమం చేస్తారు. యాగంలో చండీతో పాటు అనుబంధ యాగాలు కూడా నిర్వహించనున్నారు. అనుబంధ యాగాలను 100 మంది రుత్వికులు పర్యవేక్షిస్తారు. మహారుద్రం, రాజశ్యామల, పీతాంబరీదేవి, అనుష్ఠానం, సూర్యయాగం, నవగ్రహ యాగం, సూర్య అనుష్ఠాలు, వాస్తు, గణపతి వంటి అనుబంధ యాగాలు నిర్వహించనున్నారు. మహారుద్రం, భగలాముఖి నవగ్రహ, చతుర్వేద పారాయణం వంటివి భాగంగా ఉంటాయి. అనుబంధ యాగాలు నిర్వహించడానికి వేరుగా ఏర్పాటు చేశారు.
సకల సౌకర్యాలు.. పటిష్ట భద్రత
యాగం నిర్వహించడానికి వచ్చే రుత్వికులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి 300 మంది రుత్వికులు యాగంలో పాల్గొననున్నారు. వారంతా శని, ఆదివారాల్లో ఫాంహౌస్‌కు చేరుకున్నారు. వారికి సరిపడే గదులు, ఇతర వసతులు కల్పించారు. కర్ణాటక నుంచి కొంతమంది రుత్వికులు వచ్చారు. సంప్రదాయం ప్రకారం ఎర్రవల్లి గ్రామ పూజారులు, మండలానికి చెందిన పండితులు కూడా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఐదు రోజుల పాటు యాగంలో ఈ రుత్వికులు అందరూ పాల్గొంటారు. ఈ యాగం నేపథ్యంలో ఎర్రవల్లిలోని గ్రామదేవతలకు ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ, గడిమైసమ్మ, బొడ్రాయి, మహంకాళమ్మ, హనుమాన్ ఆలయాల వద్ద ఈ పూజలు జరిగాయి. గ్రామస్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. యాగానికి సీఎంతో పాటు ప్రముఖులు వస్తున్నందున.. వ్యవసాయ క్షేత్రం చుట్టూ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలను బందోబస్తు విధుల్లో నిమగ్నం కానున్నారు. మహారుద్ర సహస్ర చండీయాగానికి సీనియర్ జర్నలిస్టు స్వామి గౌరీశంకర్.. హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన గంగాజలాన్ని అందించారు.
పనులను పరిశీలించిన కేసీఆర్
సోమవారం నుంచి తన ఫాంహౌస్‌లో ప్రారంభమయ్యే మహారుద్ర సహస్ర చండీయాగం పనులను ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ çపర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి రాగానే ఫాంహౌస్‌లో ఏర్పాటైన యాగశాలలన్నింటి వద్దకు చేరుకున్నారు. హోమగుండాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. యాగశాలలను అందంగా తీర్చిదిద్దడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, సీఎం రాజకీయ సలహాదారు శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, యాగానికి రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పలువురు పెద్దసంఖ్యలో హాజరు కానున్నట్టు తెలిసింది. ఈ మహాక్రతువు కోసం 10రోజులుగా యాగశాలలు సిద్ధం చేస్తున్నారు. మూడు చోట్ల యాగశాలలను తీరొక్క పూలతో అందంగా ముస్తాబు చేశారు. పక్కన వివిధ రకాల పూలకుండీలను పెట్టారు. అలాగే రాత్రి వేళల్లో యాగశాలలు మిరుమిట్లు గొలిపేలా రంగురంగుల విద్యుద్దీపాలను అలంకరించారు.
Comments
Please login to add a commentAdd a comment