ఫైల్ ఫోటో
సాక్షి, సిద్ధిపేట: యాగాలు, యజ్ఞాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అపార నమ్మకం ఉన్న సీఎం కేసీఆర్ మరోసారి యాగాలకు సిద్ధమవుతున్నారు. కొంతకాలం కిందట అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఆయన.. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సూచన మేరకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో రెండు రోజులపాటు రాజ శ్యామల యాగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహించారు. అనంతరం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అఖండ విజయం సాధించడం, రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టడం తెలిసిందే.
కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కుటుంబసభ్యులతో కలసి విశాఖపట్నం వెళ్లి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. ఈ నేపథ్యంలో స్వామి సూచన మేరకు సీఎం కేసీఆర్.. జనవరి 21 నుంచి 25 వరకు రెండు యాగాల నిర్వహణకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఈ మేరకు ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మొదటగా సహస్ర చండీ యాగం, ఆపై రాజ శ్యామల యాగం నిర్వహించనున్నట్లు సమాచారం. మొదటి రోజు సహస్ర చండీ యాగాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి, రుత్వికులు కలసి పూర్ణకుంభంతో ప్రారంభిస్తారు. ప్రారంభ, ముగింపు రోజుల్లో స్వామి హాజరు కానున్నట్లు తెలిసింది. మిగతా రోజుల్లో రుత్వికులు యాగాన్ని నిర్వహించనున్నారు. ఆ దిశగా వ్యవసాయక్షేత్రంలో ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment