సాక్షి, మెదక్: సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ చేయిస్తున్న చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం మూడో రోజుకు చేరుకుంది. వేదపారాయణాలు, వేదమంత్రాలతో ఎర్రవల్లి వ్యవసాయం క్షేత్రం ప్రతిధ్వనిస్తోంది. ఇప్పటివరకూ 200 చండీ పారాయణాలు పూర్తి అయ్యాయి. వేదఘోషతో ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రం, చండీయాగ వేదిక మారుమోగుతోంది. తెలంగాణ ప్రజల సుఖసంతోషాలతో జీవించాలంటూ సీఎం కేసీఆర్ సంకల్పించిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం పంచాహ్నిక దీక్ష మూడవరోజుకు చేరుకుంది. మంగళవారం వరకూ వందమంది రుత్విక్కులు 200 చండీ పారాయణాలు పూర్తిచేశారు.
రెండోరోజు ఉదయం తొమ్మిది గంటలకు శాంతిపాఠముతో మహారుద్రయాగం ప్రారంభమైంది. 44 మంది రుత్విక్కులు ఏకకాలంలో ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. ఆ తర్వాత క్రమార్చన హారతి, మంత్రపుష్ప సమర్పణ నిర్వహించారు. తొలిరోజులాగే రెండోరోజు కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. అనుష్ఠానం అనంతరం రాజశ్యామల మహావిద్య పారాయణం జరిగింది. ఆ తర్వాత హోమం పూర్తిచేసి.. అమ్మవారికి సహస్ర నామార్చన చేశారు. తీర్థప్రసాద వితరణతో రెండోరోజు రుద్రయాగం పూర్తయింది. చండీయాగ వేదిక ప్రాంగణంలో ప్రతిరోజు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద పారాయణాలు జరుగుతున్నాయి. మహేతిహాసాలైన రామాయణ భారతాల్లోని సుందరకాండ, విరాట పర్వం పారాయణాలు కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నారు. శృంగేరీ శారదాపీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామివారి ఆశీస్సులతో, శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మార్గదర్శనంలో యాగ, పారాయణాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment