సాక్షి, సిద్దిపేట: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం మంగళవారం రెండోరోజుకు చేరుకుంది. మొత్తం 300 మంది రుత్వికులతో ఐదు రోజులపాటు చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కొనసాగనుంది. విశాఖపట్నానికి చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది. చండీయాగంలో భాగంగా ఈ నెల 25న పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
వేదోక్తంగా ప్రారంభమైన చండీయాగం
మహారుద్రసహిత సహస్ర చండీయాగం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు యజ్ఞవాటికలో వేదోక్తంగా ఈ క్రతువును ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో ప్రారంభమైన యాగానికి... కర్ణాటకలోని శృంగేరి పీఠానికి చెందిన తంగిరాళ సీతారామ శాస్త్రులు, మాడుగుల మాణిక్య సోమయాజులు, ఋగ్వేద పండితులు నరేంద్ర కాప్రే తదితర ప్రముఖులు వైదిక సారథ్యం వహించారు. స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి యాగశాల ప్రవేశం చేసి పూజా కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సుమారు 300 మంది ఋత్విజులు దుర్గా సప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించడానికి ముందు యాగం నిర్విఘ్నంగా కొనసాగాలనే తలంపుతో 1,000 మోదకాలతో ప్రత్యేక హవనాన్ని నిర్వహించారు.
ఋత్విజులు వేదమంత్రాలు పఠిస్తుండగా ముఖ్యమంత్రి దంపతులు ముందుగా యజ్ఞవాటిక చుట్టూ ప్రదక్షిణలు చేసి చండీ యజ్ఞవాటికలో పుణ్యాహవచణం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా గోపూజ, గురుపూజ జరిగింది. అరణి నుంచి అగ్నిని మథించడం ద్వారా రగిలిన నిప్పుతో నాలుగు యజ్ఞాలు ప్రారంభమయ్యాయి. సుమారు మూడు గంటలపాటు ముఖ్యమంత్రి దంపతులు యాగవాటికలోనే ప్రత్యేక పూజలు జరిపారు. ఇందులో భాగంగా వైవాహిక స్వర్ణోత్సవాలు జరిగిన వయో వృద్ధ దంపతులకు దంపతీ పూజలు, కన్యాకుమారి పూజలను సీఎం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీయాగంలో తొలి రోజు వంద సప్తశతి చండీ పారాయణాలు చేశారు. రుత్విజుల పారాయణాలతో ఎర్రవల్లి యాగవల్లిగా మారింది. సాయంత్రం జపాలు, అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలను చేపట్టారు. యాగంలో కపిలాశ్రమ స్వామి కూడా హాజరై ప్రముఖులకు ఆశీర్వచనం అందజేశారు.
నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వెళ్లబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment