సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌లో చేపట్టిన మహారుద్ర సహిత చండీయాగంలో భాగంగా రెండో రోజు పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
జగదేవ్‌పూర్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మహారుద్ర సహిత సహస్ర మహా చండీయాగ పాంచాహ్నిక దీక్షలో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 100 మంది రుత్వికులు 200 చండీ పారాయణాలను పూర్తిచేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు మహాహారతి, మంత్ర పుష్పముతో మాధ్యాహ్నిక పూజలు నిర్వహించారు. మహారుద్రయాగంలో భాగంగా ఉదయం 9 గంటలకు శాంతి పాఠంతో 41 ఏకాదశ అభిషేకాలను పూర్తిచేశారు. రాజశ్యామల యాగంలో భాగంగా రుత్వికులు రాజశ్యామల అనుష్టానం, హోమం, రాజశ్యామల మహా విద్యపారాయణం, హోమం, సహస్ర నామార్చన నిర్వహించారు. బగలాముఖి యాగంలో భాగంగా రుత్వికులు 10 వేల జపములు పూర్తిచేశారు. అదే విధంగా రుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం..
శుక్ల యజుర్వేదము, పారాయణములు, హవనాదులు, సుందరాకాండ, విరాఠ పర్వ మహాసౌర పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతుల ఆశీస్సులతో విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. వేద పండితులు పురాణం మహేశ్వరశర్మ, మంగళంపల్లి వేణుగోపాలశర్మ, శాస్త్రుల వెంకటేశ్వరశర్మ, ఫణి శశాంకశర్మ, గంగవరం నారాయణశర్మ, కామేశ్వరశర్మ, కాసుల చంద్రశేఖరశర్మల నిర్వహణలో పూజా కార్యక్ర మాలు జరుగుతున్నాయి. రెండో రోజు యాగంలో హోం మంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. యాగం సందర్భంగా ఫామ్‌హౌస్ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment