సోమవారం ఎర్రవల్లిలో చండీయాగం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులతో మాట్లాడుతున్న విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి
సాక్షి హైదరాబాద్/గజ్వేల్/జగదేవ్‌పూర్: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన మహారుద్రసహిత సహస్ర చండీయాగం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు యజ్ఞ వాటికలో వేదోక్తంగా ఈ క్రతువును ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో ప్రారంభమైన యాగానికి... కర్ణాటకలోని శృంగేరి పీఠానికి చెందిన తంగిరాళ సీతారామ శాస్త్రులు, మాడుగుల మాణిక్య సోమయాజులు, ఋగ్వేద పండితులు నరేంద్ర కాప్రే తదితర ప్రముఖులు వైదిక సారథ్యం వహించారు. స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి యాగశాల ప్రవేశం చేసి పూజా కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సుమారు 300 మంది ఋత్విజులు దుర్గా సప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించడానికి ముందు యాగం నిర్విఘ్నంగా కొనసాగాలనే తలంపుతో 1,000 మోదకాలతో ప్రత్యేక హవనాన్ని నిర్వహించారు.
ఋత్విజులు వేదమంత్రాలు పఠిస్తుండగా ముఖ్యమంత్రి దంపతులు ముందుగా యజ్ఞవాటిక చుట్టూ ప్రదక్షిణలు చేసి చండీ యజ్ఞవాటికలో పుణ్యాహవచణం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా గోపూజ, గురుపూజ జరిగింది. అరణి నుంచి అగ్నిని మథించడం ద్వారా రగిలిన నిప్పుతో నాలుగు యజ్ఞాలు ప్రారంభమయ్యాయి. సుమారు మూడు గంటలపాటు ముఖ్యమంత్రి దంపతులు యాగవాటికలోనే ప్రత్యేక పూజలు జరిపారు. ఇందులో భాగంగా వైవాహిక స్వర్ణోత్సవాలు జరిగిన వయో వృద్ధ దంపతులకు దంపతీ పూజలు, కన్యాకుమారి పూజలను సీఎం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీయాగంలో తొలి రోజు వంద సప్తశతి చండీ పారాయణాలు చేశారు. రుత్విజుల పారాయణాలతో ఎర్రవల్లి యాగవల్లిగా మారింది. సాయంత్రం జపాలు, అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలను చేపట్టారు. యాగంలో కపిలాశ్రమ స్వామి కూడా హాజరై ప్రముఖులకు ఆశీర్వచనం అందజేశారు. ఐదు రోజులపాటు సాగే ఈ యాగం శుక్రవారం మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతితో ముగియనుంది.
భారీ పోలీస్ బందోబస్తు...
ఎర్రవల్లిలో సోమవారం ప్రారంభమైన యాగానికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడు దిక్కులా చెక్ పోస్టులతో ఎర్రవల్లి నుంచి ఫామ్‌హౌస్‌కు వెళ్లే రోడ్డు వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు మీదుగా వెళ్లే వారిని పోలీసులు చెక్‌పోస్టు దగ్గరే ఆపి వెనక్కి పంపించారు. అలాగే వర్ధరాజ్‌పూర్ రోడ్డు మధ్యలో నుంచి శివారు వెంకటాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డును మొత్తం మూసేశారు. అలాగే గంగాపూర్ నుంచి ఫామ్‌హౌస్‌కు వచ్చే దారిలో శివారువెంకటాపూర్ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా వాహనాలను వెనక్కి పంపించారు. సోమవారం ఉదయమే సీపీ ఫామ్‌హౌస్‌కు చేరుకుని బందోబస్తును పర్యవేక్షించారు.
ప్రముఖుల హాజరు...
ముఖ్యమంత్రి చేపట్టిన మహారుద్రసహిత సహస్ర చండీమహాయాగాన్ని తిలకించేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు ఎర్రవల్లికి విచ్చేశారు. కేసీఆర్ కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే, కేటీఆర్ దంపతులు, ఎమ్మెల్యే హరీశ్‌రావు, కేసీఆర్ కుమార్తె కవిత దంపతులతోపాటు హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారు శేరి సుభాష్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మీకాంతారావు, టీఆర్‌ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు తొలిరోజు యాగాన్ని వీక్షించారు.
యాగం ఎందుకు చేస్తారంటే...
కరువు కాటకాలు రాకుండా, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.. దేశానికి క్షేమం జరగాలనే ఇలాం టి యాగాలు నిర్వహిస్తారు. ప్రాచీన కాలం నుంచి ఈ యాగాలను రాజులు, ప్రభువులు నిర్వహించారని చరిత్ర చెబుతోంది. ప్రత్యేకించి శ్రీ సహస్ర చండీయాగం జరిగిన పరిసరాల్లో మంచి ఫలితా లు ఉంటాయని మార్కండేయ పురాణంలో స్పష్టంగా రాసి ఉంది. రాష్ట్రానికి అధిపతిగా ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగానికి పూనుకోవడం నిజంగా సాహసమే. దేశంలోనూ ఈ యాగం చాలా చోట్ల జరిగింది. కొంతమంది భక్తు లు బృందంగా ఏర్పడి మాత్రమే చేసిన సందర్భాలున్నాయి. కానీ... కేసీఆర్ సీఎం హోదాలో ఈ కార్యాన్ని తలపెట్టడం అభినందనీయం. గతంలో నిర్వహించిన యాగాలతో మంచి ఫలితాలు వచ్చాయి. అదే నమ్మకంతో కేసీఆర్ సహస్ర చండీ యాగాన్ని తలపెట్టారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి మొట్టమొదటి సీఎంగా బాధ్యతలు విజయవంతంగా చేపట్టడం.. రెండోసారి కూడా అ«ధికారాన్ని దక్కించుకున్న తర్వాత తాను చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవరోధం కలగకూడదన్న సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. కలియుగంలో చండీని ప్రసన్నం చేసుకోవడం చాలా ప్రధానమైనది. కలియుగంలో చండీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ పని మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా పూర్తి కావడానికి ఈ యాగం పనిచేస్తుంది.
– యాగ నిర్వాహకుడు పురాణం మహేశ్వరశర్మ
Comments
Please login to add a commentAdd a comment