శృంగేరి పీఠాధిపతులను ఆహ్వానించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం కర్ణాటకలోని శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతులను దర్శించుకున్నారు. ఈ నెల 23 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న అయుత చండీ మహాయాగానికి రావాల్సిందిగా జగద్గురుశంకరాచార్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వార్లను ఆయన ఆహ్వానించారు. శృంగేరి పీఠానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు పీఠాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కేసీఆర్ శారదాంబ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వార్లను దర్శించుకున్నారు. అయుత చండీయాగం ఆహ్వాన పత్రికను ఆయన జగద్గురువులకు అందజేశారు. దాదాపు అరగంటపాటు జగద్గురువులతో కేసీఆర్ సమావేశమై యాగం ఏర్పాట్లను వారికి వివరించారు. కేసీఆర్ వెంట జగద్గురువులను కలిసిన వారిలో అయుత చండీయాగం ఆచార్య బ్రహ్మలు పురాణం మహేశ్వర శర్మ, గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మలు ఉన్నారు.