సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా చెబుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలను తరలించే ప్రక్రియను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 29న ప్రారంభిస్తారు. గజ్వేల్ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ప్రారంభ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 29న చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
► 29న ఉదయం 4 గంటలకు ఏకకాలంలో కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మసాగర్ పంపుహౌస్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు.
► పూజల అనంతరం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. తిరిగి ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్‌లో నిర్మించే రైతు వేదికలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.
► మర్కూక్‌లోని కొండపోచమ్మసాగర్ పం ప్‌హౌస్‌కు చేరుకుని చినజీయర్ స్వామికి స్వాగతం పలికి, సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు.
► 11.30 గంటల ప్రాంతంలో పంప్‌హౌస్ స్విచ్చాన్ చేసిన తర్వాత ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ (నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలికి గంగమ్మ పూజలు నిర్వహిస్తారు. పరిమిత సంఖ్యలో ఆహ్వానితులకు మర్కూక్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
‘కొండపోచమ్మ’గా నామకరణం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల (లిఫ్టుల) ద్వారా తరలించే నీటిని 618 మీటర్ల ఎత్తునున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు తరలిస్తారు. 15 టీఎంసీల నీటి నిల్వ సామ ర్థ్యమున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయ ర్ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్టుకు ‘కొండపోచమ్మ’పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల సరిహద్దులో కొండపోచమ్మ దేవాల యం ఉంది. దాని సమీపంలోనే కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం (మల్లన్న గుడి) ఉంది. రెండు దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉండటంతో నిత్యం భక్తులతో కళకళలాడుతుంటాయి. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతిపెద్ద రిజర్వాయర్‌కు మల్లన్నసాగర్ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్‌కు కొండపోచమ్మసాగర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు.
ఏర్పాట్లను పరిశీలించిన హరీశ్‌రావు
సీఎం రాకను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం సాయంత్రం కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వద్ద మంత్రి హరీశ్‌రావు.. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు మంత్రి పలుసూచనలు చేశారు. చండీయాగం ఏర్పాట్లను ప్రముఖ వాస్తు ప్లానర్ సుద్ధాల సుధాకర్‌తేజ పరిశీలించారు.
చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న సీఎం
‘కొండపోచమ్మ’ప్రారంభానికి రావాలని చినజీయర్‌స్వామికి ఆహ్వానం
ముఖ్యమంత్రి బుధవారం రాత్రి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని దర్శించుకున్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని దివ్య సాకేతాలయం ఆశ్రమంలో జీయర్‌స్వామిని కేసీఆర్ కలసి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రావాలని జీయర్‌స్వామిని ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జీయర్‌స్వామి మంగళశాసనాలు, ప్రత్యేక కానుకను సీఎంకు అందజేశారు. ఆశ్రమం వద్ద మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు.. కేసీఆర్‌కు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్ ఉన్నారు.
సీఎం కేసీఆర్‌తో ముచ్చటిస్తున్న చినజీయర్‌స్వామి. చిత్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, మైహోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment