
నేడు విజయవాడకు కేసీఆర్
- హెలికాప్టర్‌లో నేరుగా చంద్రబాబు నివాసానికి..
- చండీ యాగానికి ఆహ్వానించి తిరుగుపయనం
- 16న ముఖ్యమంత్రి కర్ణాటక పర్యటన
సాక్షి, హైదరాబాద్: అయుత మహా చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం విజయవాడకు వెళ్లనున్నారు. ఉదయం 11.30కు మంత్రి ఈటల, ఎంపీ బాల్క సుమన్‌లతో కలసి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్ విజయవాడకు బయల్దేరుతారు. అక్కడ ఏపీ సీఎం నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.15కు తిరుగు ప్రయాణమవుతారు.
రెండు నెలల కిందట ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఇంటికి వెళ్లి చంద్రబాబు ఆహ్వానించగా.. కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత మరోసారి ఇద్దరు సీఎంలు కలుసుకోనుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తెలంగాణ మొక్కుల చెల్లింపులో భాగంగా విజయవాడ పర్యటనలో సీఎం కేసీఆర్ కనకదుర్గమ్మను దర్శించుకుని బంగారు ముక్కుపుడక సమర్పిస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ముక్కుపుడకను దేవాదాయశాఖ తయారు చేయించకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆత్మీయ ఆహ్వానం..
ఈ నెల 23 నుంచి 27 వరకు ఎర్రవెల్లిలో జరిగే అయుత చండీ మహాయాగానికి ఆహ్వాన పత్రికలను ముద్రించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. వీరితో పాటు పలువురు ప్రముఖులకు కేసీఆర్ ఈ ఆహ్వాన పత్రికలను అందించనున్నారు. చండీమాత ముఖచిత్రంతో ఉన్న ఈ ఆహ్వాన పత్రికలో సీఎం కేసీఆర్, శోభారాణి దంపతుల ఆత్మీయ ఆహ్వాన సందేశాన్ని రెండు పేజీల్లో ముద్రించారు.
‘సకల సౌభాగ్య మంగళాలను ప్రసాదించే జగజ్జననిని ప్రసన్నం చేసుకొని సకల జనపదాలకు, పట్టణాలకూ, జిల్లాలకూ, రాష్ట్రానికీ, దేశానికి, ప్రపంచానికి సుఖశాంతులు, ఆయురారోగ్య భాగ్యాలు ఆకాంక్షిస్తూ తలపెట్టిన పవిత్ర కార్యమే అయుత చండీ మహాయాగ’మని అందులో ప్రస్తావించారు. సమస్త ప్రాణులు సుఖ సంతోషాలతో శాంతియుత జీవనం సాగించాలనే సత్సంకల్పంతో ఈ యాగం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాగాన్ని ‘చతుర్వేద స్వాహాకార పురస్సర మహారుద్ర పురశ్చరణ సహిత అయుత చండీ మహాయాగం’గా పిలుస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాలను పత్రికలో వివరించారు.
23న బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు హరికథా కవిరాజు రుక్మాభట్ల నరసింహస్వామిచే ధార్మిక ప్రవచనము, 24న మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండకు చెందిన గన్నమరాజు గిరిజామనోహరబాబుచే ధార్మిక ప్రవచనం, 25న మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్‌కు చెందిన పురాణం మహేశ్వరశర్మ ధార్మిక ప్రవచనం, 26న మధ్యాహ్నం రామాయంపేటకు చెందిన దోర్బల ప్రభాకరశర్మ ధార్మిక ప్రవచనంతోపాటు నాలుగు రోజులూ రాత్రి 7.30 గంటలకు శ్రీరామలీల గేయకథాగానం ఉంటుంది. ఎర్రవెల్లిలో యాగం నిర్వహించే ప్రాంతానికి వెళ్లే మార్గాన్ని ఆహ్వాన పత్రిక చివరి పేజీలో ముద్రించారు.
హైకోర్టు సీజేకు ఆహ్వానం
అయుత చండీ యాగానికి రావాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబాసాహెబ్ బొసాలేను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం సీజే నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఇక శృంగేరీ పీఠాధిపతిని ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 16న కర్ణాటకకు వెళ్లనున్నారు. శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి ఆశీస్సులు స్వీకరించటంతో పాటు చండీయాగానికి ఆహ్వానించనున్నారు.