ibrahim patnam
-
రియల్ హత్యలే..దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం
సాక్షి,హైదరాబాద్: సంచలనం సృష్టించిన రియల్టర్ల జంట హత్యల కేసును రాచకొండ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఇబ్రహీంపట్నం చెర్లపటేల్‌గూడలో నెలకొన్న భూ వివాదాలే హత్యలకు కారణమని విచారణలో బయటపడింది. హత్యలో ప్రధాన సూత్రధారి చైతన్యపురి కమలానగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేరెడ్డి మట్టారెడ్డి అలియాస్ మేరెడ్డి అశోక్‌రెడ్డి/సత్తిరెడ్డి/ భద్రి/ఏవీ రమణ, కృష్ణా జిల్లా జగన్నాథపురానికి చెందిన ఖాజా మోహియుద్దిన్, మెదక్ కొండపాక మేదిరిపూర్కు చెందిన బుర్రి భిక్షపతి, సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌కు చెందిన సయ్యద్ రహీమ్, బిహార్ రాష్ట్రం సివాన్ జిల్లా టెటారియా గ్రామానికి చెందిన సమీర్ అలీ, రాజు ఖాన్‌లను అరెస్ట్ చేశారు. హత్యలో వినియోగించిన రెండు తుపాకులను తయారు చేసిన చందన్ సిబాన్, సోనూలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 19 లైవ్ రౌండ్లున్న రెండు 7.65 ఎంఎం తుపాకులు, రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లు, బుల్లెట్ వెహికిల్, కారు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తి వివరాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఇదీ వివాదం.. చర్లపటేల్‌గూడ గ్రామంలో 1369, 1370, 1371, 1372 సర్వే నంబర్లలోని భూమిని 20 ఏళ్ల క్రితం లేఅవుట్ చేశారు. వీటిలో చాలా మంది ఉద్యోగులు, ప్రవాసులు వాయిదా పద్ధతిలో కొనుగోలు చేశారు. ఈ లేవుట్ శివారు ప్రాంతంలో ఉండటంతో కొనుగోలుదారులు వారి ప్లాట్లను తనిఖీ చేయడం, చూసుకోవటం వంటివి చేయలేదు. 2014లో మట్టారెడ్డి ఈ వెంచర్లో 1111 గజాల చొప్పున నాలుగు ప్లాట్లను కొనుగోలు చేశాడు. ఇందులో ఫామ్ హౌస్ కట్టుకోవటంతో పాటు జామ తోటను పెంచాడు. ఆ తర్వాత 2018లో మరో నాలుగు ప్లాట్ల కొనుగోలు చేశాడు. ఈ సర్వే నంబర్ల పక్కనే ఉన్న 14 ఎకరాల 10 గుంటల భూమిని మృతుడు నవారి శ్రీనివాస్ రెడ్డి తన డ్రైవర్ దూడల కృష్ణ పేరు మీద కొనుగోలు చేశాడు. భూ యజమానులైన శాంతాకుమారి, ఎం పురుషోత్తం రెడ్డిలతో అగ్రికల్చర్ ల్యాండ్ లీజు ఒప్పందం చేసుకున్నాడు. అప్పట్నుంచి తన పార్ట్నర్ రాఘవేందర్ రెడ్డితో కలిసి రోజూ వ్యవసాయ భూమికి వచ్చేవాడు. ఈ క్రమంలో లేక్ విల్లా ఆర్చిడ్స్‌లో ప్లాట్ ఓనర్లు స్థానికంగా ఉండకపోవటాన్ని అవకాశంగా మలుచుకున్న శ్రీనివాస్‌రెడ్డి.. ఆ ప్లాట్ల లావాదేవీలలో తలదూర్చడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మట్టారెడ్డికి శ్రీనివాస్‌రెడ్డి మధ్య వైరం మొదలైంది. ప్లాట్ ఓనర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ తక్కువ ధరకు ప్లాట్లను కొనుగోలు చేస్తున్న మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డి వెంచర్లోకి ఎంటర్ కావటం నచ్చలేదు. వెంచర్లో అభివృద్ధి పనులకు తరుచూ అడ్డుతగులుతుండటంతో ఎలాగైనా శ్రీనివాస్ రెడ్డిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. బుల్లెట్‌పై ఒకరు, బస్సులో మరొకరు.. ఈ నెల 1న ఉదయం 6 గంటలకు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు ఏపీ09 ఏడబ్ల్యూ 0047 కారులో తమ వ్యవసాయ భూమికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి కారు నడుపుతున్నాడు. అప్పటికే అక్కడ కాపు కాస్తున్న ఖాజా మోహియుద్దీన్, భిక్షపతిలు లిఫ్ట్ కావాలని అడిగారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి కారు ఆపగా.. ఆయన తలపై ఖాజా మోహియుద్దీన్ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. దీంతో తనని తాను రక్షించుకునేందుకు శ్రీనివాస్‌రెడ్డి కారు దిగి పారిపోతుండగా.. ఖాజా అతన్ని వెంబడించి కాల్పులు జరిపాడు. శ్రీనివాస్‌రెడ్డి అక్కడిక్కడే కుప్పకూలాడు. శ్రీనివాస్‌రెడ్డి పారిపోతున్న సమయంలో పక్క సీటు నుంచి డ్రైవర్ సీటులోకి వచ్చిన రాఘవేందర్ రెడ్డిపై భిక్షపతి కాల్పులు జరిపాడు. ఛాతీలోకి బుల్లెట్ దిగిన రాఘవేందర్ రెడ్డి అపస్మారక స్థితిలో కారును నడిపే ప్రయత్నం చేయగా.. వాహనం ఆగిపోయింది. కాల్పుల తర్వాత నిందితులు ఇద్దరూ మట్టారెడ్డి ఫామ్ హౌస్‌కు వెళ్లి ‘పని పూర్తయిందని’ తెలిపి, తుపాకులను అక్కడే పెట్టేసి వెళ్లిపోయారు. ఖాజా తన బుల్లెట్ వాహనంలో పారిపోగా.. భిక్షపతి నడుచుకుంటూ వెంచర్ నుంచి బయటికి వచ్చి బస్సు ఎక్కి ఇంటికి వెళ్లిపోయాడు. మట్టారెడ్డి నేరచరితుడే.. ఈ హత్య కేసులో సూత్రధారి అయిన మేరెడ్డి మట్టారెడ్డి కూడా నేరచరితుడే. ఇతని మీద నారాయణగూడ, మలక్‌పేట, సరూర్‌నగర్ పీఎస్‌లలో మూడు చీటింగ్ కేసులున్నాయి. కర్మన్‌ఘాట్‌లో సొంత అపార్ట్‌మెంట్‌తో పాటూ ఇతర ప్రాంతాల్లో మొత్తం 78 ఎకరాల భూములు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. నాలుగు లగ్జరీ కార్లున్నాయి. యూట్యూబ్‌లో చూసి.. హత్యకు 20 రోజుల ముందే బిహార్ నుంచి రెండు తుపాకులను కొనుగోలు చేశారు. గతంలో ఖాజా మోహియుద్దీన్, భిక్షపతిలకు తుపాకీ పట్టుకున్న అనుభవం లేకపోవటంతో ఇద్దరూ యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నారని, ఫిబ్రవరి 28నే హత్యకు ప్రయత్నించగా విఫలమైందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. లేక్‌విల్లా ఆర్చిడ్స్‌లో చాలా వరకు ప్లాట్లు 2–3 రిజిస్ట్రేషన్లు జరిగాయని, అసోసియేషన్ ప్రతినిధులను విచారించి, ఈ హత్య కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉందని ఆరా తీసి వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ పేర్కొన్నారు. పోలీసులకు దృశ్యం సినిమా చూపించిన మట్టారెడ్డి హత్య జరిగిన రోజు ఘటన స్థలంలో ఉన్న మట్టారెడ్డిపై మృతుల కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో వెంటనే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణకు ఏమ్రాతం సహకరించలేదని సీపీ తెలిపారు. తమ మధ్య చంపుకొనేంత విభేదాలు లేవని పదే పదే వ్యాఖ్యానించినట్లు చెప్పారు. విచారణలో మట్టారెడ్డికి ఫామ్ హౌస్ ఉందని విషయం పోలీసులకు తెలిసింది. దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులకు.. ఫామ్‌హౌస్‌లో సీసీ కెమెరా కనిపించింది. ఫుటేజ్‌ను పరిశీలించగా.. హత్య జరిగిన అనంతరం పచ్చ చొక్కా వేసుకున్న వ్యక్తి ఫామ్ హౌస్‌లోకి హడావుడిగా రావటం కనిపించింది. ఆ వ్యక్తిని ఆరా తీయగా.. శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు జరిపిన ఖాజా మోహియుద్దీన్ అని తేలింది. బిహార్‌లో తుపాకుల కొనుగోలు.. లేక్‌విల్లా ఆర్చిడ్స్ వాచ్‌మన్ ఖాజా మోహియుద్దీన్‌తో కలిసి మట్టారెడ్డి శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డిల హత్యకు పథకం రచించాడు. ఇందుకోసం ఖాజా.. తన స్నేహితుడైన బుర్రి భిక్షపతి సహాయం తీసుకున్నాడు. హత్య చేసేందుకు వీరిరువురికీ తలా 1,111 గజాల ప్లాట్‌ను ఇస్తానని మట్టారెడ్డి హామీ ఇచ్చాడు. తుపాకుల కోసం ఆరా తీయగా.. తన మామ సయ్యద్ రహీంకు బిహార్ గ్యాంగ్‌లతో పరిచయం ఉందని, తుపాకులు సమకూరుస్తాడని తెలపడంతో మట్టారెడ్డి రూ.1.20 లక్షల నగదు ఇచ్చాడు. కారులో బిహార్‌కు వెళ్లి సమీర్ అలీ నుంచి రెండు తుపాకులను కొనుగోలు చేశారు. వీటిని బిహార్‌కు చెందిన చందన్ సిబాన్, సోనులు తయారు చేశారు. (చదవండి: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో వీడిన మిస్టరీ) -
కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు హజరు కాలేను
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నిర్వహించబోయే.. దళిత గిరిజన సభను వాయిదావేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటరీ కమిటీ పర్యటన సందర్భంగా సభకు హజరు కాలేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 21 తర్వాత ఎప్పుడు సభ పెట్టినా హాజరయ్యేందుకు అభ్యంతరంలేదని కోమటిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవసభ వాయిదాపడే అవకాశం ఉందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. -
పట్నంలో హై‘డ్రామా’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం టికెట్‌పై ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. చివరి నిమిషంలో టీడీపీ నేత సామ రంగారెడ్డి బీ–ఫారానికి నోచుకోకపోవడం సస్పెన్స్‌ని తలపిస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీకి దక్కడం.. అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు ఇష్టం లేకపోయినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పట్నం నుంచి పోటీ చేస్తానని సామ పేర్కొన్నారు. అయితే ఆదివారం ఎన్టీఆర్ భవన్లో బీ–ఫారాల అందజేత కార్యక్రమానికి హాజరైన సామ రంగారెడ్డికి చుక్కెదురైంది. పార్టీ బీ–ఫారం ఇవ్వకపోవడంతో ఆయన నిర్ఘాంతపోయారు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు అక్కడే ఉన్నసామ రంగారెడ్డి చివరకు ఖాళీచేతులతో వెనుదిరిగారు. రాజేంద్రనగర్ టీడీపీ అభ్యర్థి గణేష్‌గుప్తాకు పార్టీ బీఫాం అందజేసింది. బీ–ఫారాలు అందుకున్న 12 మంది నేతలతో ఆ పార్టీ ప్రతిజ్ఞ చేయించింది. ప్రతిజ్ఞ చేసిన వారిలో సామ సైతం ఉన్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆయనకు బీ–ఫారం అందజేయలేదని.. ఆయన సన్నిహితులు చెబుతున్నా వ్యూహాత్మకంగానే పక్కన బెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క టీడీపీ సీనియర్ నేత, స్థానికుడు రొక్కం భీంరెడ్డి సైతం ఈ స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో మంతనాలు మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఆయన అమరావతికి వెళ్లి బాబుని కలిశారు. 37 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నానని, ఇబ్రహీంపట్నం సీటును తనకే కేటాయించాలని కోరినట్లు సమాచారం. అంతేగాక ఇబ్రహీంపట్నం స్థానానికి సామ రంగారెడ్డి పేరు ఖరారు చేయడంపై కాంగ్రెస్ కాస్త విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈయన స్థానికేతరుడని, ఈ నియోజకవర్గంలో పెద్దగా పట్టులేదని భావిస్తోంది. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న కాంగ్రెస్.. ఎన్నికల్లో సామ గెలుపు అంత సులువుకాదనే పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీంతో ఈ స్థానం తమకే కావాలని టీడీపీ అధిష్టానంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈ స్థానంపై కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి సైతం ఆశలు వదులుకోకపోవడం మరింత బాలాన్ని చేకూర్చుతోంది. పార్టీ తనకే బీ–ఫారం ఇస్తుందని ధీమా వ్యక్తం చేయడంతోపాటు సోమవారం నామినేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది -
మందు గుండు పేలి.. యువకుడి మృతి
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): ఇబ్రహీంపట్నం శివారులోని ఓ చెక్‌డ్యాం వద్ద అడవి పంది కోసం పెట్టిన మందు గుండు పేలి ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడు చత్తీస్గడ్కి చెందిన చందూలాల్(24)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కరస్నానం.. మహాభారం
కోరుట్ల : జిల్లాలో ఇబ్రహీంపట్నం వద్ద ప్రవేశించే గోదావరినది కాళేశ్వరం దాకా సుమారు రెండు వందల కిలోమీటర్లు ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, సారంగాపూర్, రారుుకల్, ధర్మపురి, రాయపట్నం, వెల్గటూర్ మండలం కోటిలింగాల, రామగుండం, గోదావరిఖని, కమాన్‌పూర్ మండలం సుందిళ్ల, మంథని, కాళేశ్వరంలలో మొత్తం 36 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌తో కోటిలింగాల వద్ద మాత్రమే గోదావరినది జలకళ సంతరించుకుంది. ఇక్కడ కూడా కొత్త పుష్కర ఘాట్లకు మూడు కిలోమీటర్ల దూరంలో నీళ్లున్నారుు. పుష్కర పాత ఘాట్ల దగ్గర దాకా నీళ్లున్నప్పటికీ, అవి ఇరుకుగా ఉండడంతో వాటిని మూసివేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. త్రివేణి సంగమమైన కాళేశ్వరం వద్ద ప్రాణహిత నుంచి వచ్చే వరద గోదావరినదిలో కలుస్తోంది. అరుుతే ఇక్కడ కూడా పుష్కర ఘాట్లకు దాదాపు అరకిలోటరు దూరంలోనే ప్రవాహం ఉంది. పైగా ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో గుంతలు ఏర్పడి నీళ్ల దక్కరికి చేరుకోకుండా ఉంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని 15 పుష్కర ఘాట్లకు, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో ఉన్న రెండు ఘాట్లకు నీరు చేరలేదు. ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన ధర్మపురి పుష్కరఘాట్ల వద్ద ప్రతీ రోజు సుమారు 3-5 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నా.. గోదావరిలో నీరు చేరకపోవడం ఇబ్బందికరంగా తయారైంది. రామగుండం, గోదావరిఖని, మంథనిఘాట్లలోనూ నీటి ఒరవడి లేదు. నిండు గోదావరిలో మదినిండా పవిత్రభావంతో మూడు మునకలేస్తేనే పుష్కర స్నానం పుణ్యం చేకూరుతుందన్నది భక్తుల నమ్మ కం. ఆ నమ్మకంతోనే ఎంతో దూరం నుంచి పుష్కర ఘాట్లకు చేరుకునే భక్తులకు ఆయా ఘాట్లలో నీటివసతి లేకుంటే నిరాశే మిగులుతుంది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదిలితేనే.. పక్షం రోజుల క్రితం జోరుగా కురిసిన వరుణుడు నేడు ముఖం చాటేయడంతో గోదావరి ప్రవాహ ఝరి జాడ లేదు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మరో పది రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం లేదు. దీనిని బట్టి చూస్తే గోదావరిలో వరద నీరు చేరి నీటి మట్టం పెరిగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పుష్కర స్నానాల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. జిల్లాకు సమీపంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల నుంచి గోదావరికి నీటిని మళ్లీంచడానికి కసరత్తు చేస్తోంది. ఈనెల ఒకటో తేదీన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. అందులో సైతం నీళ్లు లేకపోవడంతో కేవలం అర టీఎంసీ నీళ్లే బాసర దాకా వచ్చారుు. ఎస్సారెస్పీలో 90 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 13 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నారుు. దీంతో గేట్లు ఎత్తలేని పరిస్థితి. బాబ్లీకి ఎగువనున్న గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేస్తే... అవి బాబ్లీ నుంచి ఎస్సారెస్పీ ద్వారా బాసర వద్ద నుంచి జిల్లాలో ప్రవేశించి కొంత మేర నీళ్లొచ్చే అవకాశముంటుంది. గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు మహారాష్ట్ర సర్కారును కోరాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 3 టీఎంసీల నీళ్లున్నారుు. మొత్తం మీద ఎస్సారెస్పీ నుంచి 3 టీఎంసీలు, కడెం ప్రాజెక్టు నుంచి 2టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి 3టీఎంసీలు.. మొత్తం 7టీఎంసీల నీటిని విడుదల చేసి గోదావరికి జలకళ తెచ్చేందుకు సర్కారు సిద్ధమవుతోంది. అరుుతే మహారాష్ట్ర ప్రభుత్వం గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి 5టీఎంసీల నీళ్లిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో మహా సర్కారు నీటి విడుదలకు ఒప్పుకుంటుందా అన్నది సందేహమే. షవర్ స్నానాలకు ఏర్పాట్లు గోదావరిలో పుష్కర ఘాట్ల దాకా నీళ్లు రానిపక్షంలో షవర్ స్నానాలు ఆచరించేలా ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ధర్మపురి, కాళేశ్వరంతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ షవర్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ధర్మపురి, కాళేశ్వరంల వద్ద గంటకు 20 వేల మంది చొప్పున షవర్ స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేపట్టనున్నారు. అరుుతే షవర్ స్నానాలు చేసేందుకు భక్తులు అంత ఆసక్తి కనబరుస్తారా అనేది సందేహమే. -
ఇబ్రహీంపట్నంలో కేంద్రమంత్రి పర్యటన
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి): ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో ఆదివారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ పర్యటించారు. తొలిసారిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రావడంతో బీజేపీ కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు కేంద్రమంత్రిని సత్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంజన్కుమార్గౌడ్లు పర్యటన ముగిసేవరకు కేంద్ర మంత్రి వెంట ఉన్నారు. ఇబ్రహీంపట్నం నియోజక వర్గం ఇన్ చార్జ్ ముత్యాల భాస్కర్ ఆధ్వర్యంలో నేతలు పోరెడ్డి అర్జున్‌రెడ్డి, నర్సింహారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, దొండ రమణారెడ్డి తదితరులు కేంద్ర మంత్రిని సత్కరించిన వారిలో ఉన్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. నలుగురికి గాయాలు
ఇబ్రహీంపట్నం రూరల్: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జాతీయ రహదారిపై తుమ్మలపాలెం వద్ద అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. నలుగురు స్వల్పంగా గాయపడగా, మిగతవారు సురక్షితంగా బయటపడ్డారు. -
చంపి.. తల, మొండెం వేరు చేశారు
ఇబ్రహీంపట్టణం: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీంపట్టణం మండలంలోని రాజేశ్వరరావుపేటలో మోతే బంగారం(13)అనే బాలుడ్ని గొడ్డలితో నరికి తలను వేరుచేసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. రాజేశ్వరరావుపేట శివారులో ప్రధాన రహదారి పక్కన ఉన్న దాబాలో మెట్పల్లి మండలానికి చెందిన బంగారం కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బంగారం మంగళవారం రాత్రి తన తోటి కూలీ దేవదాస్‌తో కలసి డాబాపై నిద్రపోయాడు. తెల్లవారే సరికి బంగారం తలను గొడ్డలితో నరికి దాబాలో మూటకట్టి వెళ్లారు. దాబా సమీపంలో తల, మొండెం వేరువేరుగా పడి ఉండడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటన స్థలానికి పరిశీలించారు. అయితే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి దేవదాస్ కనిపించటలేదు. దీంతో స్థానికులు, దేవదాస్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదుకుంటా..అండగా ఉంటా
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా వెంకటరమణ కాలనీని అన్నివిధాలుగా అభివృద్ధిపరుస్తా ..ఐటీ హబ్‌గా ఇబ్రహీంపట్నం ఇప్పటికే బహుళ ప్రాచుర్యం పొందుతోంది. మండలంలోని ఆదిబట్లలో టీసీఎస్‌తో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా రాష్ట్ర రాజధానికి నిమిషాల వ్యవధిలో చేరుకునేంత సమీపంలో ఉన్న ఈ ప్రాంతం పలువురు పారిశ్రామిక దిగ్గజాల దృష్టినీ ఆకర్షిస్తోంది. నూతన పారిశ్రామిక విధానానికి అనువైన అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నా.. ఈ మండలంలో కనీస వసతులు లేని కాలనీలూ ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరంలేదు. మౌలిక సదుపాయాలు కొరవడటంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో అభివృద్ధికి నోచుకోని వెంకటరమణ కాలనీకి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వచ్చారు. ‘పెద్దాయనా ఎలా ఉన్నావు.. ఏమ్మా పింఛన్ వస్తోందా.. బ్రదర్ మీ కాలనీలో సమస్యలేంటి’ అంటూ.. స్థానిక ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆదుకుంటానని.. అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. కాలనీలో ఆయన దాదాపు 3 గంటల పాటు గడపగడపకూ తిరిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రజల సమస్యలను సావధానంగా వినడమే కాకుండా.. వాటిని నోట్ చేసుకున్నారు. రిపోర్టర్‌గా ఎమ్మెల్యే తీసుకున్న చొరవకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.. మీ అభిమానానికి సర్వదా రుణపడి ఉంటామని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే హామీలు... వెంకటరమణ కాలనీలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు తక్షణం చేతి పంపుల ఏర్పాటు శ్మశానవాటికలో మౌలిక సదుపాయాల కల్పన సామాజిక భవన నిర్మాణానికి కృషి అర్హులైన పేదలకు వినోబానగర్‌లో గృహ వసతి చదువుకున్న నిరుద్యోగులకు ఈ ప్రాంతంలో నెలకొల్పే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు అర్హులైన నిరుపేదలందరికీ పింఛన్లు సీసీ రోడ్ల ఆధునికీకరణకు చర్యలు వీధి దీపాల ఏర్పాటు ఎమ్మెల్యే: పెద్దాయనా బాగున్నావా? భిక్షపతి: ఏం బాగు సార్.. పింఛన్ డబ్బులు అందడంలేదు. ఎమ్మెల్యే: ఏం ఎందుకు.. నీ వయసెంత.. సర్టిఫికెట్లు ఇక్కడే ఉన్నాయా? భిక్షపతి: నా వయస్సు 65 ఏళ్లు. సర్టిఫికెట్లు ఇంటి వద్ద ఉన్నాయి. ఎమ్మెల్యే: ఏమయ్యా.. ఏంటి వెంకటరమణ కాలనీలో సమస్యలు? రఘుపతి: కాలనీ మధ్యలో స్మశానం ఉందిసార్.. ప్రహరీ లేక పోవడంతో విషసర్పాల భయం వెంటాడుతోంది. ఎమ్మెల్యే: ప్రహరీ నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటా. ఎమ్మెల్యే: ఏమ్మా .. ఎంతమంది బిడ్డలు. బతుకుదెరువు బాగుందా? పోచమ్మ: నాకు ముగ్గురు కొడుకులు. బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. రెండునెళ్ల నుంచి పింఛన్ వస్తలేదు. ఎమ్మెల్యే: బాబూ .. మీ కాలనీలోని సమస్యలను వివరించు? ఇబ్రహం: సార్ .. నాకు పింఛన్ రావడంలేదు. మా కాలనీలో రోడ్డు సరిగ్గాలేదు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి మినీ ఫంక్షన్‌హాల్‌గా మారిస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే: అమ్మాయ్.. ఏం చదువుకున్నావు.. ఇంటి వద్దే ఉంటావా? రాణి: సార్.. నాకు పోలీస్‌శాఖలో ఉద్యోగం చేయాలనుంది. డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాక పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాను. ఎమ్మెల్యే: మీ కాలనీలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలేంటి? దశరథ్: మంచినీటి సరఫరా లేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ డబ్బులు వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే: పింఛన్లపై అపోహలు వద్దు. అర్హులైన వారందరికీ పింఛన్ సౌకర్యం అందించేందుకు చర్యలు తీసుకుంటా. ఎమ్మెల్యే: ఏం పెద్దమ్మ.. పింఛన్ వస్తోందా..? కొడుకులు ఏం చేస్తుంటారు? రాములమ్మ: సార్.. నా కొడుకులు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్నారు. నాకే పింఛన్ రాక ఇబ్బంది పడుతున్నా. ఎమ్మెల్యే: ఏం పెద్దమనిషి.. నీపేరేంటి.. బాగున్నావా? మైసయ్య: సార్ నాకు ఇంటి స్థలం లేదు. కూలి పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నా. అదికూడా సరిగ్గా దొరకంలేదు. ఎమ్మెల్యే: ఏమ్మా .. ఏంటి మీ కాలనీలో సమస్య ? మణెమ్మ: మా కాలనీలో అసలే రోడ్డు సౌకర్యం లేదంటే.. ఉన్న రోడ్డునే ఆక్రమించుకున్నారు. రాత్రివేళ వీధిదీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నాం. ఎమ్మెల్యే: ఏం తల్లి.. ఎందుకు బాధలో ఉన్నావు? స్వరూప: సార్.. నా భర్త చనిపోయాడు. పిల్లలు ఉన్నారు. ఎలా బతకాలో తెలియడంలేదు. ఎమ్మెల్యే: బాధపడొద్దు. పిల్లల కోసం ధైర్యంగా ఉండాలి. మీ కుటుంబానికి ప్రభుత్వపరంగా అందే సహకారాన్ని అందజేస్తా. ఎమ్మెల్యే: ఏమ్మా.. మీ కాలనీలో ఏమైనా సమస్యలున్నాయా? సత్తెమ్మ: మా కాలనీలో మురుగు కాలువలు లేవు. రోడ్లపైనే మరుగునీరు పారుతోంది. దోమలతో రోగాల బారిన పడుతున్నాం. ఎమ్మెల్యే: నీ పేరేంటి.. కొడుకులున్నారా? బుగ్గమ్మ: సార్.. నా కొడుకులు వారి బతుకుదెరువు వారు చూసుకున్నారు. నాకు నెలనెలా వచ్చే పింఛన్ రావడం లేదు. ఎమ్మెల్యే : మీకొచ్చిన కష్టాలేంటో చెప్పండి? బాలకృష్ణ : సార్.. మా కాలనీలో అన్నీ సమస్యలే. డ్రైనేజీ కాలువలు లేవు. మంచినీటి సౌకర్యం, రహదారి సౌకర్యం లేదు. పందులు, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. మినీ నీటి ట్యాంక్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే: బాబూ.. మీ కేమైనా సమస్యలున్నాయా? రంగయ్య: సార్.. మా కాలనీలో కుక్కలు, పందుల బెడద అధికంగా ఉంది. ఇళ్లస్థలాలు లేవు. ఎమ్మెల్యే: ఏమ్మా .. నీ బాధలేంటో చెప్పు? మహిళ: సార్.. ఈమె పేరు పెంటమ్మ. ఈమెకు చెవులు వినపడవు. కొడుకులు లేరు. పింఛన్ రావడంలేదు (పక్కన ఉన్న మహిళ). ఎమ్మెల్యే: ఏమ్మా.. మీ ప్రాంతంలో సమస్యలేమున్నాయ్? ప్రేమమ్మ: సార్.. మా కాలనీలో రోడ్డు సమస్య ఉంది. మంచినీటిని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. ఎమ్మెల్యే: ఏమ్మా మీరంతా ఒకే చోట ఉన్నారు.. ఏంటీ మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు? మహిళలు: సార్ .. మంచినీళ్ల కోసం ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నాం. డ్రైనేజీలు లేకపోవడంతో మురుగువాసన విపరీతంగా వస్తోంది. ఎమ్మెల్యే: బోరు వేస్తే నీళ్లు పడతాయా ? మహిళలు: బోరువేస్తే నీరుపడుతుంది సార్.. కాలనీలో రెండు బోర్లు వేయిస్తే ప్రజల అవసరాలు తీరుతాయి. ఎమ్మెల్యే: ఏం కౌన్సిలర్ గారూ.. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? రవీందర్ (కౌన్సిలర్): మా వార్డులో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రూ.15లక్షలతో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరలో పనులు ప్రారంభిస్తాం. సమస్యలు తెలిశాయి.. పరిష్కారం చూపుతా.. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఇబ్రహీంపట్నం వెంకటరమణ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నా. సాధ్యమైనంతవరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తా. సామాజిక స్పృహతో ‘సాక్షి’ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తుంది. ప్రజలను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి. - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే -
రాజన్న బిడ్డకు ఘనస్వాగతం
ఇబ్రహీంపట్నంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల ఇబ్రహీంపట్నం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆ పార్టీ నాయకురాలు షర్మిల సోమవారం ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. షర్మిల వస్తున్న విషయం తెలిసి యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పార్టీ జిల్లా నాయకుడు ఏనుగు మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బొంగ్లూర్ గేటు నుంచి ఇబ్రహీంపట్నం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. షర్మిల వెంట ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు కొండా రాఘవరెడ్డి, గట్టు రాంచందర్‌రావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, జనక్‌ప్రసాద్, ఏనుగు మహిపాల్‌రెడ్డి, కేసరి సాగర్, మహిళా నాయకురాలు అమృతసాగర్ ఉన్నారు. యాచారం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు జిల్లాలో సోమవారం ఘన స్వాగతం లభించింది. మూడు జిల్లాల సరిహద్దు అయిన మాల్ కేంద్రంలో షర్మిల ప్రయాణిస్తున్న బస్సుకు పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు ఎదురేగి స్వాగతం పలికారు. నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై షర్మిల మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వెళ్తుందని తెలుసుకున్న ప్రజలు గునుగల్, యాచారం, చింతపట్ల, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి గేట్లు, నల్లవెల్లి చౌరస్తాలో పెద్ద సంఖ్యలో ఆమె రాకకోసం ఎదురుచూశారు. బస్సులో వెళ్తున్న షర్మిలను చూసి చేయి ఊపడంతో ఆమె కూడా ప్రతిగా అభివాదం చేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తెలంగాణలో బలమైనశక్తిగా .. రాబోయే రోజుల్లో షర్మిల నాయకత్వంలో తెలంగాణలో వైఎస్సార్ సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అమృతాసాగర్ పేర్కొన్నారు. షర్మిల రాక సందర్భంగా మాల్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో వైఎస్‌కు వేలాది మంది అభిమానులు ఉన్నారని అన్నారు. వచ్చే రోజుల్లో ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. తెలంగాణలో షర్మిల పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ విగ్రహావిష్కరణకు తరలిన కార్యకర్తలు ఆదిబట్ల : ఇబ్రహీంపట్నంలో వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం వివిధ గ్రామాల నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై ఉదయం నుంచే సందడి నెలకొంది. బొంగ్లూర్ గేట్ నుం చి ఇబ్రహీంపట్నం వరకు రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్ సీపీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలే కనిపించాయి. కార్యకర్తలు బొంగ్లూర్ గే ట్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. పరామార్శ యాత్రలో భాగంగా షర్మిల మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్తూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. -
దిగ్విజయ్ నేతృత్వంలో టి.కాంగ్రెస్ సదస్సు!
రంగారెడ్డి: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండు రోజులపాటు సదస్సు నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీపట్నంలో జరిగే సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తోపాటు పార్టీ పెద్దలు హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సోమవారం ముగుస్తుంది. ఈ సదస్సుకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి నేతలు హాజరుకానున్నారు. 10 అంశాలపై గ్రూపులుగా విడిపోయి నేతలు చర్చించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. -
కరెంటు కోతల వ్యథ
పరిగి/ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: రోజురోజుకూ తీవ్రమవుతున్న కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కరెంటు సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండుముఖం పడుతుండగా, పరిశ్రమలు, పౌల్ట్రీఫాంలు కుదేలవుతున్నాయి. పరిశ్రమలకు వారంలో ఒక రోజు పూర్తిగా కరెంటు సరఫరా నిలిపివేయడంతోపాటు సాధారణ రోజుల్లోనూ భారీ మొత్తంలో కోతలు విధిస్తున్నారు. రైతులకు అధికారికంగా ఆరు గంటలు కరెంటు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే రోజుకు మూడు గంటలకు మించి కరెంటు రావడం లేదని, అది కూడా విడతల వారీగా పగలు, రాత్రి సమయాల్లో సరఫరా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ మూడు గంటల కరెంటు కోసం రాత్రీ పగలూ తేడా లేకుండా పొలాల్లోనే జాగారం చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలతో నీరందక వరి, జొన్న, కూరగాయల పంటలు ఎండిపోతున్నాయన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు కాస్త ఉపశమనాన్ని కలిగించాయన్నారు. ఒక్కో పరిశ్రమకు లక్షల్లో నష్టం కరెంటు కోతలతో పరిశ్రమలపై కోలుకోలేని దెబ్బపడుతోంది. పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోనె అత్యధికంగా పరిశ్రమలు, పౌల్ట్రీఫాంలు ఉన్న నియోజకవర్గం పరిగి. పూడూరు మండలంలో అగరబత్తీల కంపెనీ, టెక్స్టైల్స్ పరిశ్రమతో, బోన్స్ఫాక్టరీ, మరోస్టీల్ ఫ్యాక్టరీ ఉన్నాయి. పరిగి మండలంలో నాలుగు స్టీల్ ఫ్యాక్టరీలు, ఓ ప్లైవుడ్ కంపెనీతో కలుపుకొని ఐదు పరిశ్రమలున్నాయి. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలో ఒక్కోదానిలో 50 వేల నుంచి లక్ష వరకు కోళ్లను పెంచుతున్న ఆరు పెద్ద పౌల్ట్రీఫాంలు, మరో 15 చిన్న పౌల్ట్రీఫాంలు, 20 రైస్ మిల్లులు ఉన్నాయి. కరెంటు కోతలతో నెలకు ఒక్కో స్టీల్ ఫ్యాక్టరీకి రూ. 20 వేల నుంచి రూ. 30వేల వరకు నష్టం వాటిల్లుతోందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతల సమయంలో జనరేటర్లు వినియోగిస్తుండటంతో తమపై రోజుకు రూ. 15వేల అదనపు భారం పడుతుందని పౌల్ట్రీఫాంల యజమానులు చెబుతున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలదీ అదే పరిస్థితి... పరిగి పట్టణంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు కరెంటు కోతలతో దివాల తీస్తున్నాయి. వెల్డింగ్ షాపులు, మెకానిక్షెడ్లు, జిరాక్స్, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు, మోటార్ వైండింగ్ దుకాణాల యజమానులు కరెంటు కోతలతో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. అంతేకాకుండా ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు కూడా ఉపాధి కోల్పోతున్నారు. ప్రత్యామ్నాయం.. కరెంటు కోతల వల్ల చిరు వ్యాపారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గురించి ఆలోచిస్తున్నారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి ధర అధికంగా వుండటం.. ఆదాయానికి మించి వుండటంతో వీటి ఏర్పాటులో ఆచి తూచి అడుగేస్తున్నారు. మండల కేంద్రంలో జిరాక్స్ షాప్ నిర్వహించే ఓ చిరు వ్యాపారి ఇటీవల రూ.90వేలు పెట్టి జనరేటర్ కొనుగోలు చేశాడు. దానికయ్యే ఖర్చులో పావు వంతు కూడా వచ్చే పరిస్థితులు కనబడటం లేదని వాపోతున్నాడు. మంగల్‌పల్లిగేట్ సమీపంలో వుండే ఇంటర్నెట్ షాపు నిర్వహుకుడొకరు ఇన్వర్టర్ సహాయంతో ఇంటర్నెట్ నిర్వహిస్తున్నాడు. కరెంటు కోతలను దృష్టిలో ఉంచుకుని రూ. 45వేలు పెట్టి ఇన్వర్టర్ తీసుకున్నాడు. వీటి నిర్వహణ ఎక్కువగా ఉందని ఆయన ఇన్వర్టర్ను అమ్మేసేందుకు సిద్ధమయ్యాడు. -
పోస్టల్ బ్యాలెట్ గందరగోళం
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల విధులు నిర్వహించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్న ఉద్యోగస్తులకు మళ్లీ ఓటేయాలంటూ శనివారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పోలింగ్ బూత్‌లకు రావడంతో గందరగోళానికి గురయ్యారు. భువనగిరి పార్లమెంట్ స్థానానికి గత నెల 30వ తేదీన ఎన్నిక జరగ్గా వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. అయితే మళ్లీ ఓట్లు వేయాలంటూ అధికారులు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పంపించడంతో ఉద్యోగస్తులు విస్తుపోయారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకొని పది రోజులవుతుంటే మళ్లీ ఓటేయాలనడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగస్తులు తమ బ్యాలెట్ పత్రాలు బూత్‌ల వద్దకు వచ్చాయని తెలుసుకుని శనివారం సొంతూళ్లకు చేరుకొని తహసీల్దార్ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. అయితే ఓటేయాలంటే గెజిటెడ్ సంతకం కావాలి, ఐడెంటిటీ కార్డులు ఉండాలనే నిబంధనలు పెట్టడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓటేసినా మళ్లీ ఈ లొల్లి ఏంటని పలువురు గొణుక్కున్నారు. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారి విఠల్‌ను వివరణ కోరగా... స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు బ్యాలెట్ పేపర్లో తప్పుగా ముద్రించడంతో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమస్య వచ్చిందన్నారు. ఈ నెల 14 సాయంత్రం లోపు పోస్టల్ బ్యాలెట్లను తమకు అందజేయాలని ఉద్యోగస్తులకు సూచించారు. -
ఫలితాలపై ఉత్కంఠ
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయనే దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. 20 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అంశం మంగళవారం కోర్టు పరిశీలనకు రానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. పట్నం నగర పంచాయతీలోని ఆయా వార్డుల్లో రికార్డు సంఖ్యలో మొత్తం 125 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో గెలుపోటములపై సందిగ్ధత ఏర్పడింది. పలు వార్డుల్లో బహుముఖ పోటీ ఉండడంతో ఓటర్లు ఎవరిని విజేతగా నిలపబోతున్నారనేనది అయోమయంగా మారింది. కాంగ్రెస్ పార్టీని రెబల్స్ భయం వెంటాడుతోంది. పలు వార్డుల్లో టికెట్ రాని వారు రెబల్స్‌గా పోటీ చేయడంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు మెజార్టీ వార్డులను దక్కించుకుంటామని ధీమాతో ఉన్నాయి. కాంగ్రెస్‌లోని గ్రూపు తగాదాలతో పాటు రెబల్స్ కారణంగా తమ విజయావకాశాలు మెరుగుపడ్డాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మెజార్టీ వార్డులను కైవసం చేసుకోవడం ద్వారా చైర్మన్ పదవిని దక్కించుకుంటామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ లో పెరిగిన ఓటింగ్ శాతం (86.37) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓటింగ్ సరళి తమకే అనుకూలంగా ఉందని ఒకరంటే కాదు తమకే అనుకూలమని మరొకరు అంటున్నారు. ఆయా వార్డుల్లో ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి అనే విషయాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఏ నలుగురు గుమిగూడినా ఎన్నికల ఫలితాల గురించే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈవీఎంలలో భద్రంగా ఉన్న ఓటర్ల తీర్పు ఎప్పుడు వెలువడుతుందనేదే ఆసక్తికరంగా మారింది. ఎవరి ధీమా వారిదే వికారాబాద్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ తమకే మెజార్టీ స్థానాలు వస్తాయని భావిస్తున్నాయి. తెలంగాణ సాధన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషించింది కాబట్టి ఓటర్లు తమ అభ్యర్థులనే ఆదరిస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని చైర్మన్ పీఠం దక్కించుకుంటామని అంటున్నారు. పట్టణంలో టీఆర్ఎస్కు క్యాడర్ అంతగా లేనందున పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని భావిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైర్మన్ పదవిని నిర్ణయించడంలో మాత్రం క్రియశీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయంటున్నారు.ఇక పట్టణంలో తమకు బలమైన క్యాడర్ ఉందని అత్యధిక కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుని చైర్మన్ పీఠం దక్కించుకుంటామని టీడీపీ నేతలు జోస్యం చెబుతున్నారు. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీకైనా 15 సీట్లు రావాల్సిందే. ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఏం చేయాలనేదానిపై ఆయా పార్టీల నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఒకటి, రెండు సీట్లు తక్కువైతే ఎవరిని ఆశ్రయించాలనే దానిపై కూడా ఇప్పటి నుంచే మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు అంచనాలు.. టీడీపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 8 నుంచి 10 సీట్లు వచ్చినా చైర్మన్ పదవిని దక్కించుకోవచ్చని యోచిస్తున్నారు. బీజేపీ 2 నుంచి 4 స్థానాలు , ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు చెరో రెండు సీట్లు గెలుచుకుంటాయని భావిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలకు పూర్తి స్థాయిలో సీట్లు రాకపోతే మాత్రం టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్ పదవిని నిర్ణయించే కీలక శక్తులుగా మారుతారని చర్చించుకుంటున్నారు. -
పోటెత్తిన ఓటు
హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట,సరూర్‌నగర్,న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు శివమెత్తాడు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నగరశివారులోని పెద్దఅంబర్‌పేట,బడంగ్‌పేట,ఇబ్రహీంపట్నం మూడు నగర పంచాయతీలకు ఆదివారం జరిగిన పోలింగ్ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మొదటిసారి నగర పంచాయతీలుగా మారిన ఈ మూడింటిలోనూ భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. ఆదివారం కావడంతో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇబ్రహీంపట్నం పంచాయతీలో 86.37శాతం,పెద్దఅంబర్‌పేట పంచాయతీలో 81 శాతం, బడంగ్‌పేట పంచాయతీలో 67.47 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు మూడేళ్ల తర్వాత పురపాలక ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఓటువేయగానికి ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఎండలు మండుతున్నప్పటికీ లెక్కచేయకుండా హుషారుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ మొదలైన తొలి రెండుగంటల్లోనే 18.25శాతం నమోదైంది. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో అధికంగా 86.37శాతం నమోదు కాగా, బడంగ్‌పేటలో తక్కువగా 67.47 శాతం నమోదైంది. సమయం ముగిసినా లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రక్రియను రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ చంపాలాల్, ఆర్డీవో యాదగిరిరెడ్డి, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గంగాధర్, ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ ఆనందభాస్కర్లు పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు తరలింపు : పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. ఓట్ల లెక్కింపు వరకు అక్కడే అభ్రద పర్చనున్నారు. పెద్దఅంబర్‌పేటకు సంబంధించి కుంట్లూరు జడ్పీహెచ్ఎస్, బడంగ్‌పేటకు సంబంధించి స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆసక్తి కనబరిచిన యువ ఓటర్లు : మొదటిసారిగా ఓటు హక్కు వచ్చిన చాలామంది యువతీయువకులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిసారి ఓటు వేయడం ఆనందంగా ఉందని పలువురు తెలిపారు. -
జిల్లాలో పోలింగ్ శాతం 76.35
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలు, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట, బడంగ్‌పేట నగర పంచాయతీల పరిధిలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం ఓటింగ్ నమోదైంది. ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 1,98,513 మంది ఓటర్లలో 1,45,954 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోరుగా.. హుషారుగా.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. దాదాపు మూడేళ్ల తర్వాత మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఓటు వేయగానికి ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఎండలు మండుతున్నప్పటికీ లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లోనే 18.25శాతం నమోదైంది. తర్వాత 11గంటల ప్రాంతంలో పోలింగ్ శాతం 38.70కు చేరింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరిగినప్పటికీ పోలింగ్ ప్రక్రియ స్థిరంగా సాగుతూ 56.36శాతానికి చేరింది. ఆ తర్వాత మూడు గంటల ప్రాంతంలో కొంత మందకొడిగా సాగి 66.75 శాతానికి చేరింది. సాయంత్రం మళ్లీ ఊపందుకోవడంతో జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో అధికంగా 86.37శాతం పోలింగ్ నమోదు కాగా, బడంగ్‌పేటలో తక్కువగా 67.47 శాతం నమోదైంది. పోలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఓట్ల లెక్కింపు వరకు అవి అక్కడే భద్రపరచనున్నారు. తాండూరు మున్సిపాలిటీ కార్యాలయం, వికారాబాద్‌కు సంబంధించి స్థానిక మహవీర్ కాలేజీ, పెద్దఅంబర్‌పేటకు సంబంధించి కుంట్లూరు జెడ్పీహెచ్ఎస్, బడంగ్‌పేటకు సంబంధించి స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఉత్కంఠ..! పురపాలిక సంఘాల పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ.. ఓట్ల లెక్కింపుపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల ప్రకటన ప్రకారం ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఫలితాల ప్రభావం తదుపరి నిర్వహించే ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలపై పడుతుందనే ఉద్దేశంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు సైతం వాయిదా పడినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అంశం న్యాయస్థానం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ అంశం రేపు (మంగళవారం) విచారణకు రానుండడంతో ఫలితాల అంశం అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. -
‘పుర’పోరుకు నామినేషన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పుర’పోరులో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అసలు సమరం ఆసన్నమైంది. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేనాటికి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, ఇబ్రహీం పట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో 1,185 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నిన్నటివరకు స్తబ్దుగా సాగిన నామినేషన్ల పర్వం శుక్రవారం పోటాపోటీగా సాగింది. ఐదు మున్సిపాలిటీల పరిధిలో 576 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. బ్యాండుమేళాలు, టపాకాయలతో అభ్యర్థులు, పార్టీ నేతలు హడావుడి సృష్టించారు. ఇక ప్రజల్లోకి.. తాజాగా నామినేషన్ల ప్రక్రియకు తెరపడడంతో ప్రచార పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ప్రత్యర్థి వర్గాలను చిత్తుచేసేందుకు వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీల నేతలు బిజీ అయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుని చైర్మన్‌గిరీని కైవసం చేసుకునేలా నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు.