పోటెత్తిన ఓటు | Polling in municipal elections | Sakshi
Sakshi News home page

పోటెత్తిన ఓటు

Published Mon, Mar 31 2014 1:09 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

Polling in municipal elections

హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట,సరూర్‌నగర్,న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు శివమెత్తాడు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నగరశివారులోని పెద్దఅంబర్‌పేట,బడంగ్‌పేట,ఇబ్రహీంపట్నం మూడు నగర పంచాయతీలకు ఆదివారం జరిగిన పోలింగ్ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.

మొదటిసారి నగర పంచాయతీలుగా మారిన ఈ మూడింటిలోనూ భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. ఆదివారం కావడంతో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇబ్రహీంపట్నం పంచాయతీలో 86.37శాతం,పెద్దఅంబర్‌పేట పంచాయతీలో 81 శాతం, బడంగ్‌పేట పంచాయతీలో 67.47 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు మూడేళ్ల తర్వాత పురపాలక ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఓటువేయగానికి ఉత్సాహంతో ముందుకొచ్చారు.

ఎండలు మండుతున్నప్పటికీ లెక్కచేయకుండా హుషారుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ మొదలైన తొలి రెండుగంటల్లోనే 18.25శాతం నమోదైంది. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో అధికంగా 86.37శాతం నమోదు కాగా, బడంగ్‌పేటలో తక్కువగా 67.47 శాతం నమోదైంది. సమయం ముగిసినా లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రక్రియను రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ చంపాలాల్, ఆర్డీవో యాదగిరిరెడ్డి, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గంగాధర్, ఎల్‌బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ ఆనందభాస్కర్‌లు పరిశీలించారు.  

 స్ట్రాంగ్ రూమ్‌లకు తరలింపు : పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. ఓట్ల లెక్కింపు వరకు అక్కడే అభ్రద పర్చనున్నారు. పెద్దఅంబర్‌పేటకు సంబంధించి కుంట్లూరు జడ్పీహెచ్‌ఎస్, బడంగ్‌పేటకు సంబంధించి స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఆసక్తి కనబరిచిన యువ ఓటర్లు : మొదటిసారిగా ఓటు హక్కు వచ్చిన చాలామంది యువతీయువకులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిసారి ఓటు వేయడం ఆనందంగా ఉందని పలువురు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement