సాక్షి, గుంటూరు: ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీల కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రయత్నం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ హెచ్చరించారు.
తమ వద్ద మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న వారి సంతకాలతో కూడిన జాబితా ఉందని, ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వస్తే ఇట్టే గుర్తిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి వినియోగించుకోకుంటే స్థానిక ఎన్నికల్లో వినియోగించుకోవచ్చన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టరు మాట్లాడారు.
తొలి విడతగా 29 మండలాల్లో పోలింగ్..
ఈనెల 6వ తేదీ (ఆదివారం) తొలి విడతగా తెనాలి, నరసరావుపేట డివిజన్‌లలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం అనుమతి మేరకు మొదటి విడతలో జిల్లాలోని 29 మండలాల్లో నిర్వహిస్తున్నామని, ఇక్కడున్న 470 ఎంపీటీసీ స్థానాలకు గాను 15 ఏకగ్రీవమైనందున 455 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
అలాగే 29 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 29 జడ్పీటీసీ స్థానాలకు గాను 103 మంది, 455 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,192 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు డివిజన్లలో మొత్తం 12,02,929 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కలెక్టరు తెలిపారు. రెండు డివిజన్లలో 909 ప్రాంతాలలో 1,618 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.
ఇందులో 363 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో 667 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 288 ప్రాంతాల్లో 533 పోలింగ్‌స్టేషన్లు, నక్సల్స్ ప్రభావితం కలిగిన 44 ప్రాంతాలలో63 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. 214ప్రాంతాల్లో 355 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ స్టేషన్ల వద్ద అదనంగా పోలిసు బలగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నేటి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి ఓకే..
123 ప్రాంతాలలో వెబ్‌కాస్టింగ్, 182 చోట్ల వీడియోగ్రఫీ, 412 చోట్ల సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. మొదటి విడత ఎన్నికల నిర్వహణ కోసం 1,618 పోలింగ్ స్టేషన్లకు 3,323 బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 3,588 మంది, ఓపివోలు 5,353 మందిని కేటాయించినట్లు చెప్పారు. 150 రూట్లను, 72 జోన్‌లుగా విభజించి సెక్టొరల్ జోనల్ అధికారులను నియమించినట్లు చెప్పారు.
సుమారు 288 వాహనాలు, బస్సులు, 72 కార్లు, జీపులు వినియోగిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. సాధారణంగా ప్రైవేటు వాహనాలు, బస్సులు వినియోగించుకునే అవకాశం ఉండదని, ఈ ఎన్నికలకు మాత్రం అనుమతి లభించిందన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అభ్యర్థులు ప్రచారం చేసుకునే అవకాశముందన్నారు.
22,940 మందిపై బైండోవర్ కేసులు
జిల్లాలో ఇప్పటి వరకు 263 బెల్టుషాపులు మూయించడంతోపాటు 255 మందిని అరెస్టు చేశామని కలెక్టరు వివరించారు. 22,940 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. రూ.5,00,13,800 నగదు, 297 గ్రాముల బంగారం, 31 కేజీల వెండిని సీజ్ చేశామని, 311 లెసైన్స్‌గల ఆయుధాలు స్వాధీన ం చేసుకున్నామని తెలిపారు.
జిల్లా స్థాయిలో ఏఎస్‌డీ (ఆబ్సెంటీ, షిఫ్ట్‌డ్, డెత్) ఓటర్ల జాబితా రూపొందించామని, ఈ జాబితాలో ఉన్న ఓటర్లు గుర్తింపు కార్డుతో పాటు నివాస ధ్రువపత్రం, ఫొటో గుర్తింపు కార్డు ఏదైనా తీసుకురావాల్సి ఉంటుందని సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సమాచారం పొందాలన్నా జిల్లా పరిషత్ కార్యాలయంలోని కంట్రోల్ రూం నంబర్లు 0863-2234756, 2234082 అందుబాటులో ఉంటాయని వివరించారు. సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, జడ్పీ సీఈవో బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
రెండో ఓటేస్తే క్రిమినల్ చర్యలు
Published Sat, Apr 5 2014 1:46 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement