ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల విధులు నిర్వహించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్న ఉద్యోగస్తులకు మళ్లీ ఓటేయాలంటూ శనివారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పోలింగ్ బూత్‌లకు రావడంతో గందరగోళానికి గురయ్యారు. భువనగిరి పార్లమెంట్ స్థానానికి గత నెల 30వ తేదీన ఎన్నిక జరగ్గా వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. అయితే మళ్లీ ఓట్లు వేయాలంటూ అధికారులు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పంపించడంతో ఉద్యోగస్తులు విస్తుపోయారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకొని పది రోజులవుతుంటే మళ్లీ ఓటేయాలనడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగస్తులు తమ బ్యాలెట్ పత్రాలు బూత్‌ల వద్దకు వచ్చాయని తెలుసుకుని శనివారం సొంతూళ్లకు చేరుకొని తహసీల్దార్ కార్యాలయం వద్ద క్యూ కట్టారు.
అయితే ఓటేయాలంటే గెజిటెడ్ సంతకం కావాలి, ఐడెంటిటీ కార్డులు ఉండాలనే నిబంధనలు పెట్టడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓటేసినా మళ్లీ ఈ లొల్లి ఏంటని పలువురు గొణుక్కున్నారు. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారి విఠల్‌ను వివరణ కోరగా... స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు బ్యాలెట్ పేపర్‌లో తప్పుగా ముద్రించడంతో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమస్య వచ్చిందన్నారు. ఈ నెల 14 సాయంత్రం లోపు పోస్టల్ బ్యాలెట్లను తమకు అందజేయాలని ఉద్యోగస్తులకు సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ గందరగోళం
Published Sat, May 10 2014 11:38 PM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM
Advertisement