ఇచ్ఛాపురం/ పలాస/ఆమదాలవలస/పాలకొండ : యువతీయువకులు మున్సిపల్ ఎన్నికల్లో తమ సామాజిక బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించారు. తొలిసారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 18 నుంచి 20 ఏళ్ల మధ్య యువతీయువకులు ఓటు వేసేందుకు ఉదయం 8 గంటలకే ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస మున్సిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలోని పలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
తమకు నచ్చిన వారికి ఓటు వేసి పోలింగ్ కేంద్రాల నుంచి ఆనందంగా బయటకు వచ్చారు. చరిత్రను తిరిగిరాస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. అక్కడే కాసేపు నిల్చొని ఓటుహక్కుపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సారి ఎన్నికల్లో యువతీయువకులు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించడంతో ఫలితాలు ఊహించని రీతిలో వస్తాయని, సమర్థులకే పట్టం కట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రత్యేక వాహనాల్లో...
వృద్ధులు, వికలాంగులను పోలింగ్ కేంద్రాలకు తెచ్చేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడ్డారు. వీరి కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వికలాంగుల ఓట్లను అధికారుల సాయంతో బంధువులు వేశారు.
సూరీడు మండుతున్నా...
ఆదివారం భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఉష్ణోగ్రత సుమారు 39 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యింది. ప్రచంఢ భానుని ప్రతాపాన్ని సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొన్ని చోట్ల వృద్ధులు ఎండను తట్టుకోలేక వరండాలపై సేదతీరారు.
బంధువుల సహాయంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు అభ్యర్థులు తమ ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనాల సదుపాయం చేసి మరీ ఓట్లు వేయించేలా చేశారు.మరికొన్ని కేంద్రాల్లో అభ్యర్థులే నేరుగా తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. 90 ఏళ్లకు పైగా వయసున్నవారు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
మున్సిపోల్స్‌లో కొత్త ఉత్సాహం
Published Mon, Mar 31 2014 2:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement