71.38 శాతం పోలింగ్
♦ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం
♦ 17వ వార్డులో మొరాయించిన ఈవీఎం
♦ కొద్దిసేపు పోలింగ్‌కు అంతరాయం
♦ 10వ వార్డులో పోలింగ్ సిబ్బందిపై వేటు
♦ పలు వార్డుల్లో లాఠీలు ఝుళిపించిన పోలీసులు
సిద్దిపేట/జోన్/టౌన్/రూరల్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ శాతం 71.38గా నమోదైంది. ఓ వార్డులో ఈవీఎం మొరాయించడంతో అధికారులు వెంటనే సరిచేశారు. మరో వార్డులో పోలింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. పోలీసులు అత్యుత్సాహంతో పలు వార్డులు ప్రజలపైకి లాఠీలు ఝుళిపించారు. పట్టణంలో 34వార్డులకు గాను ఆరు వార్డులు ఇదివరకే ఏకగ్రీవం కాగా బుధవారం 28 వార్డులకే పోలింగ్ నిర్వహించారు. ఉదయం 6గంటలకు ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగింది.
ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత పుంజుకుంది. ఉదయం 11 వరకు 36.09శాతం ఓట్లు పోల్ కాగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు 52.48శాతం నమోదైంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత కారణంగా పోలింగ్ కేంద్రాలు కాస్త బోసిపోయాయి. మొత్తం 74,710 మంది ఓటర్లకు గాను సాయంత్రం 5గంటల వరకు 53,328 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం 71.38గా నమోదంది. పోలింగ్ తీరును ఎన్నికల పరిశీలకుడు దినకర్‌బాబు పరిశీలించారు.
ఈవీఎం మొరాయింపు..
ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే స్థానిక 17వ వార్డులో ఈవీఎం మొరాయించింది. వెంటనే స్పందించిన అధికారులు మూడు నిమిషాల్లో సరి చేశారు. 10వ వార్డులో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఆమెను విధుల నుంచి తప్పించారు. కొన్ని వార్డులలో ఓట్లు గల్లంతు కావడంతో వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లకు అవసరమైన సమాచారాన్ని అందించారు. కేంద్రాల్లో నీడకోసం షామియానాలు వేశారు. చల్లటి నీరు, మజ్జిగ అందుబాటులో ఉంచారు.
ఉత్సాహంగా కొత్త ఓటర్లు...
కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. వృద్ధులు సైతం తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏఎస్పీ వెంకన్న, డీఎస్పీ శ్రీధర్‌గౌడ్‌లు పట్టణంలోని పోలింగ్ స్టేషన్లను సందర్శించి బందోబస్తు పర్యవేక్షించారు.