విందు రాజకీయాలు షురూ..
ఓటర్ల ప్రసన్నం కోసం అభ్యర్థుల పాట్లు
సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నగారా మోగడంతో విందు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ గుళ్లు రాజకీయ విందులకు లోగిళ్లవుతున్నా యి. మున్సిపల్ ఎన్నికలకు ఎల్లమ్మ గుళ్లకు సంబంధం ఏమిటని అనుకుంటే పొరపాటే.. ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎన్నికల్లో లబ్ధిపొందాలంటే వార్డులోని ఓటర్లను ఆకట్టుకోవాలి. ఇందుకోసం వారు రకరకాల పాట్లు పడడడం సహజం. ఈ విందు కార్యక్రమాలు కూడా అందులో భాగమే. ఎన్నికల్లో సహకరించాలంటూ మామూలుగా విందులు ఇస్తే బాగుండదని అనుకున్నారో.. ఏమోగాని దేవుళ్ల పేరుతో పండుగలు చేస్తున్నామంటూ పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఓటర్లను విందులకు ఆహ్వానిస్తున్నారు.
ఇలాంటి విందులకు సిద్దిపేట మం డలం చిన్నగుండవెల్లి, దుబ్బాక మం డలం పెద్దగుండవెల్లి గ్రామాల్లోని ఎ ల్లమ్మ దేవాలయాలు వేదికలుగా మారుతుండడం విశేషం. ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఆశావహులు ఈ గుళ్లు, గోపురాల్లో విందులు నిర్వహిస్తున్నారు. ఈ విందులు కూడా సాదాసీదాగా కాకుండా ఆయా వార్డుల పెద్దలు ఏదంటే అది సమకురుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఈ రెండు దేవాలయాల్లో ఎక్కువ మంది విందులు నిర్వహిస్తుండగా, మరి కొందరు తమ సొంత పొలాలు, ఇళ్లల్లో విందులు ఇస్తూ ఓటర్లను, గల్లీ లీడర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే పోలింగ్ పూర్తయితే గాని విందు రాజకీయాలు ఏ మేరకు ఫలించాయో తెలస్తుంది.