Badangpeta
-
ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు
సాక్షి, హైదరాబాద్ : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడో వ్యక్తి. ఈ ఘటన దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్ లాడ్జిలో జరిగింది. మంగళవారం ఉదయం నెల్లూరుకు చెందిన వెంకటేష్ (22) అనే యువకుడు లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. కాగా, మధ్యాహ్న సమయంలో తనతోపాటు ఉన్న ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చైతన్యపురి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అమ్మాయి హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన మనస్విని (22)గా పోలీసులు గుర్తించారు. -
వర్షం.. హర్షం
నగరంలో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వేసవి ఎండలతో అల్లాడుతున్న నగర ప్రజలకు ఉపశమనం లభించింది. రామంతాపూర్‌లో రోడ్లు జలమయమయ్యాయి. బడంగ్‌పేట నగర పంచాయితీ పరిధిలోని బాలాజీనగర్‌లో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలు ఇళ్ల పైకప్పులు కూలాయి. తహసీల్దార్ సుశీల సంఘటన స్థలాన్ని పరిశీలించి నష్టపరిహారం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
పోటెత్తిన ఓటు
హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట,సరూర్‌నగర్,న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు శివమెత్తాడు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నగరశివారులోని పెద్దఅంబర్‌పేట,బడంగ్‌పేట,ఇబ్రహీంపట్నం మూడు నగర పంచాయతీలకు ఆదివారం జరిగిన పోలింగ్ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మొదటిసారి నగర పంచాయతీలుగా మారిన ఈ మూడింటిలోనూ భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. ఆదివారం కావడంతో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇబ్రహీంపట్నం పంచాయతీలో 86.37శాతం,పెద్దఅంబర్‌పేట పంచాయతీలో 81 శాతం, బడంగ్‌పేట పంచాయతీలో 67.47 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు మూడేళ్ల తర్వాత పురపాలక ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఓటువేయగానికి ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఎండలు మండుతున్నప్పటికీ లెక్కచేయకుండా హుషారుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ మొదలైన తొలి రెండుగంటల్లోనే 18.25శాతం నమోదైంది. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో అధికంగా 86.37శాతం నమోదు కాగా, బడంగ్‌పేటలో తక్కువగా 67.47 శాతం నమోదైంది. సమయం ముగిసినా లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రక్రియను రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ చంపాలాల్, ఆర్డీవో యాదగిరిరెడ్డి, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గంగాధర్, ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ ఆనందభాస్కర్లు పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు తరలింపు : పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. ఓట్ల లెక్కింపు వరకు అక్కడే అభ్రద పర్చనున్నారు. పెద్దఅంబర్‌పేటకు సంబంధించి కుంట్లూరు జడ్పీహెచ్ఎస్, బడంగ్‌పేటకు సంబంధించి స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆసక్తి కనబరిచిన యువ ఓటర్లు : మొదటిసారిగా ఓటు హక్కు వచ్చిన చాలామంది యువతీయువకులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిసారి ఓటు వేయడం ఆనందంగా ఉందని పలువురు తెలిపారు. -
జిల్లాలో పోలింగ్ శాతం 76.35
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలు, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట, బడంగ్‌పేట నగర పంచాయతీల పరిధిలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం ఓటింగ్ నమోదైంది. ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 1,98,513 మంది ఓటర్లలో 1,45,954 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోరుగా.. హుషారుగా.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. దాదాపు మూడేళ్ల తర్వాత మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఓటు వేయగానికి ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఎండలు మండుతున్నప్పటికీ లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లోనే 18.25శాతం నమోదైంది. తర్వాత 11గంటల ప్రాంతంలో పోలింగ్ శాతం 38.70కు చేరింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరిగినప్పటికీ పోలింగ్ ప్రక్రియ స్థిరంగా సాగుతూ 56.36శాతానికి చేరింది. ఆ తర్వాత మూడు గంటల ప్రాంతంలో కొంత మందకొడిగా సాగి 66.75 శాతానికి చేరింది. సాయంత్రం మళ్లీ ఊపందుకోవడంతో జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో అధికంగా 86.37శాతం పోలింగ్ నమోదు కాగా, బడంగ్‌పేటలో తక్కువగా 67.47 శాతం నమోదైంది. పోలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఓట్ల లెక్కింపు వరకు అవి అక్కడే భద్రపరచనున్నారు. తాండూరు మున్సిపాలిటీ కార్యాలయం, వికారాబాద్‌కు సంబంధించి స్థానిక మహవీర్ కాలేజీ, పెద్దఅంబర్‌పేటకు సంబంధించి కుంట్లూరు జెడ్పీహెచ్ఎస్, బడంగ్‌పేటకు సంబంధించి స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఉత్కంఠ..! పురపాలిక సంఘాల పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ.. ఓట్ల లెక్కింపుపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల ప్రకటన ప్రకారం ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఫలితాల ప్రభావం తదుపరి నిర్వహించే ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలపై పడుతుందనే ఉద్దేశంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు సైతం వాయిదా పడినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అంశం న్యాయస్థానం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ అంశం రేపు (మంగళవారం) విచారణకు రానుండడంతో ఫలితాల అంశం అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది.