సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలు, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట, బడంగ్‌పేట నగర పంచాయతీల పరిధిలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం ఓటింగ్ నమోదైంది. ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 1,98,513 మంది ఓటర్లలో 1,45,954 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జోరుగా.. హుషారుగా..
మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. దాదాపు మూడేళ్ల తర్వాత మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఓటు వేయగానికి ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఎండలు మండుతున్నప్పటికీ లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లోనే 18.25శాతం నమోదైంది.
తర్వాత 11గంటల ప్రాంతంలో పోలింగ్ శాతం 38.70కు చేరింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరిగినప్పటికీ పోలింగ్ ప్రక్రియ స్థిరంగా సాగుతూ 56.36శాతానికి చేరింది. ఆ తర్వాత మూడు గంటల ప్రాంతంలో కొంత మందకొడిగా సాగి 66.75 శాతానికి చేరింది. సాయంత్రం మళ్లీ ఊపందుకోవడంతో జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో అధికంగా 86.37శాతం పోలింగ్ నమోదు కాగా, బడంగ్‌పేటలో తక్కువగా 67.47 శాతం నమోదైంది. పోలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఓట్ల లెక్కింపు వరకు అవి అక్కడే భద్రపరచనున్నారు.
తాండూరు మున్సిపాలిటీ కార్యాలయం, వికారాబాద్‌కు సంబంధించి స్థానిక మహవీర్ కాలేజీ, పెద్దఅంబర్‌పేటకు సంబంధించి కుంట్లూరు జెడ్పీహెచ్‌ఎస్, బడంగ్‌పేటకు సంబంధించి స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.
ఉత్కంఠ..!
పురపాలిక సంఘాల పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ.. ఓట్ల లెక్కింపుపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల ప్రకటన ప్రకారం ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఫలితాల ప్రభావం తదుపరి నిర్వహించే ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలపై పడుతుందనే ఉద్దేశంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు సైతం వాయిదా పడినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అంశం న్యాయస్థానం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ అంశం రేపు (మంగళవారం) విచారణకు రానుండడంతో ఫలితాల అంశం అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
జిల్లాలో పోలింగ్ శాతం 76.35
Published Sun, Mar 30 2014 11:08 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement