peddaambarpeta
-
అబ్దుల్లాపూర్‌మెట్‌లోనే తహసీల్దార్ కార్యాలయం!
పెద్దఅంబర్‌పేట: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన అనంతరం మూతపడిన ఆ కార్యాలయం తరలింపుపై జరుగుతున్న తర్జనభర్జనలు కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ కార్యాలయాన్ని హయత్‌నగర్ మండలానికి తరలించాలని అధికారులు చేసిన ప్రయత్నాలకు ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. విజయారెడ్డి హత్య ఘటన అనంతరం సరూర్‌నగర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా ఆయన ఇక్కడికి రావడానికి విముఖత చూపారు. ఇక్కడి సిబ్బంది కూడా కార్యాలయ భవనాన్ని మారిస్తేనే విధులకు హాజరవుతామని ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో ఈ కార్యాలయాన్ని హయత్‌నగర్ మండలానికి తరలించాలని అధికారులు ప్రయత్నించారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకతరావడంతో.. స్థానికంగానే మరో భవనాన్ని పరిశీలించారు. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత రానుంది. కాగా, ప్రభుత్వం షేక్‌పేట మండల తహసీల్దార్ వెంకట్‌రెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన గురువారం లేదా శుక్రవారం రానున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. -
జిల్లాలో పోలింగ్ శాతం 76.35
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలు, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట, బడంగ్‌పేట నగర పంచాయతీల పరిధిలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం ఓటింగ్ నమోదైంది. ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 1,98,513 మంది ఓటర్లలో 1,45,954 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోరుగా.. హుషారుగా.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. దాదాపు మూడేళ్ల తర్వాత మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఓటు వేయగానికి ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఎండలు మండుతున్నప్పటికీ లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లోనే 18.25శాతం నమోదైంది. తర్వాత 11గంటల ప్రాంతంలో పోలింగ్ శాతం 38.70కు చేరింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరిగినప్పటికీ పోలింగ్ ప్రక్రియ స్థిరంగా సాగుతూ 56.36శాతానికి చేరింది. ఆ తర్వాత మూడు గంటల ప్రాంతంలో కొంత మందకొడిగా సాగి 66.75 శాతానికి చేరింది. సాయంత్రం మళ్లీ ఊపందుకోవడంతో జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో అధికంగా 86.37శాతం పోలింగ్ నమోదు కాగా, బడంగ్‌పేటలో తక్కువగా 67.47 శాతం నమోదైంది. పోలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఓట్ల లెక్కింపు వరకు అవి అక్కడే భద్రపరచనున్నారు. తాండూరు మున్సిపాలిటీ కార్యాలయం, వికారాబాద్‌కు సంబంధించి స్థానిక మహవీర్ కాలేజీ, పెద్దఅంబర్‌పేటకు సంబంధించి కుంట్లూరు జెడ్పీహెచ్ఎస్, బడంగ్‌పేటకు సంబంధించి స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఉత్కంఠ..! పురపాలిక సంఘాల పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ.. ఓట్ల లెక్కింపుపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల ప్రకటన ప్రకారం ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఫలితాల ప్రభావం తదుపరి నిర్వహించే ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలపై పడుతుందనే ఉద్దేశంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు సైతం వాయిదా పడినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అంశం న్యాయస్థానం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ అంశం రేపు (మంగళవారం) విచారణకు రానుండడంతో ఫలితాల అంశం అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. -
రయ్.. రయ్..
=త్వరలో అందుబాటులోకి ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ =విజయవాడ-వరంగల్ హైవేల అనుసంధానం =శరవేగంగా పనులు =తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు సాక్షి, సిటీబ్యూరో: వాహన చోదకులకు కొత్త సంవత్సర కానుకగా ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్ (మెయిన్ క్యారేజ్)ను అందుబాటులోకి తేవాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీని నిర్మాణాన్ని 2014 జనవరి నెలాఖరుకు పూర్తిచేసి ఫిబ్రవరి నుంచి వాహనాల రాకపోకలను ప్రారంభించాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. 31 కి.మీ. మేర ఈ రహదారి అందుబాటులోకి వస్తే వరంగల్ హైవే.. విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. ఫలితంగా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుత వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఉప్పల్ రింగ్‌రోడ్డు మీదుగా ఎల్బీనగర్ రింగ్‌రోడ్డుకు చేరుకొని వనస్థలిపురం, హయత్‌నగర్ మీదుగా విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తే ఇకపై ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లే. ఘట్కేసర్ వద్ద ఔటర్‌పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకొనే సౌకర్యం కలుగుతుంది. అలాగే వరంగల్ నుంచి విజ యవాడ, విజయవాడ నుంచి వరంగల్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఔటర్‌పై ప్రయాణించడం వల్ల సుమారు 5-6 కి.మీ. మేర దూరం తగ్గడంతో పాటు సమయం, ఇంధనం కూడా ఆదా అవుతాయి. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులకు అడ్డుకట్ట పడుతుంది. పనులు చకచకా.. ఈ రోడ్డు పనులను ఇటీవల కమిషనర్ కమిషనర్ నీరభ్‌కుమార్‌ప్రసాద్ సందర్శించారు. సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు నిరీక్షించకుండా అందుబాటులోకి వచ్చిన మెయిన్ క్యారేజ్ (ప్రధాన రోడ్డు)ను వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. వాయిదాల్లేకుండా మెయిన్ రోడ్లో మిగిలిన పనులను జనవరి నెలాఖరుకల్లా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు లక్ష్యం నిర్దేశించారు. ఘట్కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను కూడా జూన్, జూలై నాటికి పూర్తిచేయాలన్నారు. దీంతో ఆ దిశగా పనుల పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా కండ్లకోయ జంక్షన్, ఘట్కేసర్ వద్ద ఆర్వోబీ నిర్మాణం, ఘట్కేసర్ జంక్షన్ల వద్ద నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇక్కడ భూసేకరణకు సంబంధించి కోర్టు కేసులుండటంతో పనులు చేపట్టే అవకాశం లేదు. అయితే... ఘట్కేసర్ వద్ద ఆర్వోబీకి సంబంధించి రైల్వే శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో 2014 ఏప్రిల్ -మే నాటికల్లా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తే.. మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుకు గాను 15 కి.మీ.లు తప్ప ఔటర్ అంతా వినియోగంలోకి వచ్చినట్లవుతుంది. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం షామీర్పేట-కీసర (11 కి.మీ.), కీసర-ఘట్కేసర్ (4 కి.మీ.) వరకు 15 కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీన్ని కూడా 2014 మార్చి-ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.