రయ్.. రయ్..
=త్వరలో అందుబాటులోకి ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్
=విజయవాడ-వరంగల్ హైవేల అనుసంధానం
=శరవేగంగా పనులు
=తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు
సాక్షి, సిటీబ్యూరో: వాహన చోదకులకు కొత్త సంవత్సర కానుకగా ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్ (మెయిన్ క్యారేజ్)ను అందుబాటులోకి తేవాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. దీని నిర్మాణాన్ని 2014 జనవరి నెలాఖరుకు పూర్తిచేసి ఫిబ్రవరి నుంచి వాహనాల రాకపోకలను ప్రారంభించాలని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది. 31 కి.మీ. మేర ఈ రహదారి అందుబాటులోకి వస్తే వరంగల్ హైవే.. విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. ఫలితంగా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుత వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఉప్పల్ రింగ్‌రోడ్డు మీదుగా ఎల్బీనగర్ రింగ్‌రోడ్డుకు చేరుకొని వనస్థలిపురం, హయత్‌నగర్ మీదుగా విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి.
దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తే ఇకపై ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లే. ఘట్‌కేసర్ వద్ద ఔటర్‌పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకొనే సౌకర్యం కలుగుతుంది. అలాగే వరంగల్ నుంచి విజ యవాడ, విజయవాడ నుంచి వరంగల్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఔటర్‌పై ప్రయాణించడం వల్ల సుమారు 5-6 కి.మీ. మేర దూరం తగ్గడంతో పాటు సమయం, ఇంధనం కూడా ఆదా అవుతాయి. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులకు అడ్డుకట్ట పడుతుంది.
పనులు చకచకా..
ఈ రోడ్డు పనులను ఇటీవల కమిషనర్ కమిషనర్ నీరభ్‌కుమార్‌ప్రసాద్ సందర్శించారు. సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు నిరీక్షించకుండా అందుబాటులోకి వచ్చిన మెయిన్ క్యారేజ్ (ప్రధాన రోడ్డు)ను వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. వాయిదాల్లేకుండా మెయిన్ రోడ్‌లో మిగిలిన పనులను జనవరి నెలాఖరుకల్లా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు లక్ష్యం నిర్దేశించారు. ఘట్‌కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను కూడా జూన్, జూలై నాటికి పూర్తిచేయాలన్నారు. దీంతో ఆ దిశగా పనుల పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా కండ్లకోయ జంక్షన్, ఘట్‌కేసర్ వద్ద ఆర్వోబీ నిర్మాణం, ఘట్‌కేసర్ జంక్షన్‌ల వద్ద నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
ఇక్కడ భూసేకరణకు సంబంధించి కోర్టు కేసులుండటంతో పనులు చేపట్టే అవకాశం లేదు. అయితే... ఘట్‌కేసర్ వద్ద ఆర్వోబీకి సంబంధించి రైల్వే శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో 2014 ఏప్రిల్ -మే నాటికల్లా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తే.. మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుకు గాను 15 కి.మీ.లు తప్ప ఔటర్ అంతా వినియోగంలోకి వచ్చినట్లవుతుంది. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం షామీర్‌పేట-కీసర (11 కి.మీ.), కీసర-ఘట్‌కేసర్ (4 కి.మీ.) వరకు 15 కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీన్ని కూడా 2014 మార్చి-ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.