warangal highway
-
రక్తం మరిగిన రోడ్డు
ఉప్పల్: ఇరుకైన రోడ్డు.. అస్తవ్యస్తంగా ట్రాఫిక్ నిర్వహణ..అడ్డూ అదుపులేని వేగం.. ఫలితంగా ప్రమాదాలు.. ప్రాణనష్టం.. ఇదీ ఉప్పల్ – వరంగల్ రహదారి మార్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఈ రోడ్డులో రెండు నెలల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. ఇరుకుగా ఉన్న ఈ రోడ్డులో వేగంగా వాహనం నడిపే వ్యక్తి దానిని అదుపుచేయలేకపోతే ఎదురుగా ఆటో, బైక్‌పై ఉన్న వారు ప్రాణాలు కోల్పోవలసిందే. సరైన ట్రాఫిక్ నియంత్రణ లేక పోవడం, జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్సిబ్బంది లేక పోవడం తరచూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. వీటితో పాటు గత దశాబ్దకాలంగా రోడ్డు వెడల్పు చేయక పోవడం, ఫుట్ ఫాత్‌లు ఆక్రమించడం, లాంటి అనేక కారణాలున్నాయి. ఇరుకు రోడ్లు కావడం వల్ల భారీ వాహనాలు మీదకు వచ్చినా తప్పించుకునే దారి లేక ఆమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. పోలీసుల ఫోకస్ అంతా చలాన్లపైనే... ట్రాఫిక్ పోలీసుల ఫొకస్ అంతా చలాన్లపైనే ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై దృష్టిసారించడం మంచిదే. అయితే భద్రతకు సంబంధించిన ఇతర విషయాలపై కూడా దృష్టి సారించాలని పలువురు పేర్కొంటున్నారు. కేవలం యూటర్న్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై ఆక్రమణలు తొలగించకపోవడం, ప్రతి కూడలిలో పోలీస్ ఉండే విధంగా చర్యలు తీసుకోకపోవడం, భారీ వాహనాలను నియంత్రింంచలేకపోవడం, జంక్షన్ల వద్ద, బస్షెల్టర్ల వద్ద ఆటో స్టాండ్లను తొలగించకపోవడం లాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు : మార్చి22: ఆర్టీసి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోడుప్పల్‌లోని అన్నపూర్ణనగర్ కాలనీకి చెందిన స్నేహ(21) అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ద్విచక్రవాహాన్ని ఆర్టీసి బస్సు ఢీకోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది ఏప్రిల్ 6 : మేడిపల్లి మండలం పర్వాతాపూర్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొండవీటి సోనాలి(21) విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఉప్పల్ సబ్ స్టేషన్ ఇరుకు రోడ్డు వద్ద లారీ ఢీకోనడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఏప్రిల్ 17: ఉదయం గుండారం ఆనంద్, అతని భార్య లావణ్య(38) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా గేటు వద్దకు చేరుకునే సమయంలో మార్గ మధ్యలో గుంత ఉండటంతో సడన్ బ్రేక్ వేసాడు. దీంతో వెనకాల కూర్చున్న లావణ్య కిందపడి తీవ్ర గాయాల పాలైంది. చికిత్స పోందుతూ గురువారం మృతి చెందింది. ఏప్రిల్ 18 : ఉదయం 6.30 ప్రాంతంలో హబ్సిగూడకు చెందిన రమావత్ హరినాయక్(38) హబ్సిగూడ నుంచి బోడుప్పల్ వెల్తుండగా మార్గ మద్యలో ఉప్పల్ ఏషియన్ థియేటర్ సమీపంలో ఆర్టీసి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులకు , బార్యపిల్లలకు తీరని శోకాన్నిమిగిల్చాడు. ప్రైవేట్ ఉద్యోగి మేడిపల్లి చింతల శ్రీనివాస్(50) ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వస్తుండగా లారీ ఢీకొని మృత్యువాత పడ్డాడు రోడ్డు వెడెల్పులేకపోవడమే కారణం రోజురోజుకూ ట్రాఫిక్పెరుగుతోంది. అందుకు అనుగుణంగా రోడ్లు వెడెల్పు కాలేదు. వాహనాల వేగం కూడా పెంచుతున్నారు. దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పెరుగుతుంది అనుగుణంగా రోడ్లు వెడల్పు కాలేదు.. వాహానాల వేగం కూడ పెరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.రోడ్డు వెడల్పు జరగాలి.. – కాశీవిశ్వనా«థ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ -
యాదాద్రి–వరంగల్ హైవేకు మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) అనుసరిస్తున్న తీరుపై రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్–యాదాద్రి మధ్య నాలుగు వరసల రహదారి నిర్మాణం పూర్తి కాగా, ఇప్పుడు యాదాద్రి–వరంగల్ మధ్య నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవటంతో అది బాగా దెబ్బతింది. కీలకమైన రహదారి కావటంతో దీనిపై నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. రోడ్డు గుంత లమయం కావటంతో వాహనాల వేగం తగ్గిపోవటమే కాక ప్రమాదాలూ జరుగుతు న్నాయి. గుంతలతో వాహనాలు దెబ్బతింటున్నాయి. ఆర్టీసీ బస్సులో ఉప్పల్ నుంచి వరంగల్ వరకు గతంలో రెండున్నర గంటల్లో వెళ్లగా ఇప్పుడు మూడున్నర గంటలకుపైగా సమయం పడుతోంది. బస్సులు కూడా దెబ్బతింటున్నాయి. దీన్ని ఆర్టీసీ తీవ్రంగా పరిగణించినట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు ‘సాక్షి’తో చెప్పారు. ఈ రోడ్డును ఎన్హెచ్ఏఐకి అప్పగించేప్పుడు మంచి కండిషన్లోనే ఉందంటూ జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి వివరణ ఇచ్చారు. ‘సాక్షి’ కథనంతో కదలిక..: రోడ్డు బాగా పాడైన చిత్రాలతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మంత్రి తుమ్మల బుధవారం ఎన్హెచ్ఏఐ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోడ్డు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధు లను కూడా సమావేశానికి పిలిచారు. నిర్మాణ ఒప్పందంలో.. పాత రోడ్డు నిర్వహణ అంశం ఉన్నా దాన్ని పట్టించుకోకపోవటం సరికాదన్నారు.దీనిపై నిర్మాణ సంస్థ ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేస్తానని అధికారులకు చెప్పారు. ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తే విషయాన్ని ఢిల్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. దీనిపై ఎన్హెచ్ఏఐ తెలంగాణ సీజీఎంతో మంత్రి ఫోన్లో మాట్లాడి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. -
లారీ బోల్తా : ముగ్గురికి గాయాలు
వరంగల్ : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జాతీయరహదారిపై గురువారం పత్తి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే లారీ బోల్తాతో రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగంలోని దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సొంతిల్లు సుఖీభవ!
- వరంగల్ హైవే, యాదాద్రి అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం - దీంతో ఈ ప్రాంతంలో వెంచర్లు, ప్రాజెక్ట్‌లతో రియల్టీ పరుగులు - ఆచితూచి అడుగులేయాలంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి సంస్థలను ఆకర్షించేందుకు రాయితీలో.. ప్రోత్సాహకాలో అందిస్తే సరిపోదు. వాటికవే పెట్టుబడులతో రావాలంటే అభివృద్ధి పనులు చేపట్టాలని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి అభివృద్ధి పనులు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏటా రూ.100 కోట్లు యాదాద్రి అభివృద్ధికి కేటాయిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటిస్తే.. మేమూ చేయూతనందిస్తామంటూ టాటా, రిలయన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలూ ముందుకొచ్చాయి. దీంతో వరంగల్ హైవే ప్రాంతంలో స్థిరాస్తి సంస్థలు దృష్టిసారించాయి. దీంతో ఐదేళ్ల క్రితం ఎకరం వేల రూపాయలు పలికే ఈ ప్రాంతంలో ఇప్పుడు లక్షలు పోసినా దొరకని పరిస్థితి. రానున్న రోజుల్లో మరింత ప్రియమవుతుందని పలువురు స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. వరంగల్ హైవే, యాదాద్రి అభివృద్ధితో గుట్టే కాదు పర్యాటకం, మౌలికం, వాణిజ్యం, విద్యా, వైద్య సదుపాయాలూ మెరుగవుతున్నాయి. యాదాద్రి ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు 6-7 కి.మీ. చుట్టూ ఉన్న సైదాపూర్, మల్లాపూర్, యాదగిరిపల్లి, రాయగిరి, దాతర్పల్లి, గుండ్లపల్లిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకే భవిష్యత్తు అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వనమాలి టౌన్షిప్ పేరుతో నివాస, వాణిజ్య సముదాయాల ప్లాటింగ్ వెంచర్‌ను ప్రారంభించామని సుఖీభవ ప్రాపర్టీస్ ప్రై.లి. సీఎండీ గురురాజ్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అందుకే వరంగల్ హైవే రోడ్లో పలు భారీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నాం. - రాయగిరిలో 150 ఎకరాల్లో వనమాలి టౌన్షిప్ మెగా వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. తొలి దశలో 133-400 గజాల్లో మొత్తం వెయ్యి ఓపెన్ ప్లాట్లొస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి అభివృద్ధి పనులకు ఈ వెంచర్ కేవలం 8 కి.మీ., వరంగల్ హైవేకు 3 కి.మీ. దూరంలోనే ఉంది. నివాస ప్లాట్లయితే గజానికి రూ.2,700, వాణిజ్యమైతే గజానికి రూ.3,600లుగా నిర్ణయించాం. 150 గజాల్లో విల్లాను రూ.20 లక్షలకే అందిస్తున్నాం. వసతుల విషయానికొస్తే.. స్విమ్మింగ్ పూల్, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్, యోగా, మెడిటేషన్ హాల్, ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ వంటి వసతులతో పాటుగా రిసార్ట్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే 25 శాతం మేర ప్లాట్లు అమ్ముడుపోయాయంటే ఇక్కడి గిరాకీని అర్థం చేసుకోవచ్చు. - రాంపల్లిలో 10 ఎకరాల్లో ప్లాటింగ్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 133 గజాల నుంచి 500 గజాల్లో మొత్తం 175 ఓపెన్ ప్లాట్లొస్తాయి. గజం ధర రూ.6,750గా నిర్ణయించాం. 80 శాతం బుకింగ్ అయిపోయాయంటే ఇక్కడి అభివృద్ధి, ప్రాజెక్ట్కున్న గిరాకీని అర్థం చేసుకోవచ్చు. కొనుగోలుదారుల కోరిక మేరకు విల్లాలను కూడా నిర్మిస్తున్నాం. 150 గజాల విల్లాను రూ.22 లక్షలకు అందిస్తున్నాం. ఇప్పటికే ఈ వెంచర్లో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా పనులు పూర్తయ్యాయికూడా. - భువనగిరిలో 14 ఎకరాల్లో హైవే కౌంటి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 170-400 గజాల్లో మొత్తం 168 ఓపెన్ ప్లాట్లొస్తాయి. ధర గజానికి రూ.4,500లు గా నిర్ణయించాం. 80 శాతం మేర అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. - కీసర బొమ్మల రామారంలో 200 ఎకరాల్లో ఫాం ల్యాండ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మధ్యతరగతి ప్రజల కోసం వరంగల్ హైవేలో నెలసరి వాయిదాల రూపంలో మరో ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టనున్నాం. -
లైన్ క్లియర్
ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ‘ఔటర్’ రెడీ మార్చి రెండో వారం నుంచి రాకపోకలు ప్రారంభం ప్రధాన రోడ్డుకు తుదిమెరుగులు అద్దుతున్న హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో: ఎట్టకేలకు ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్ అందుబాటులోకి వస్తోంది. మార్చి రెండో వారం నుంచి రాకపోకలు ప్రారంభించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. నిర్ణీత గడువులోగా ప్రధాన రహదారి పనులను పూర్తిచేసి రాకపోకలకు అనువుగా సిద్ధం చేయాలని ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో సర్వీసు రోడ్లు, ఇతర నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నా... ప్రధాన రహదారిని మాత్రం సత్వరం వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు. వాస్తవానికి ఫిబ్రవరి 15 నుంచే ఈ మార్గంలో రాకపోకలను అనుమతించాలని భావించినా... ప్రధాన మార్గంలో పలుచోట్ల చిన్నచిన్న పనులు మిగిలిపోయి ఉండటంతో ఆ గడువును మార్చి రెండో వారానికి వాయిదా వేశారు. ఘట్కేసర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు 31 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తుండటంతో వరంగల్ హైవేకు విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. ఘట్కేసర్ వద్ద ఔటర్‌పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకొనే సౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా వరంగల్ - విజయవాడ, వరంగల్-బెంగళూరు, వరంగల్- ముంబై ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఈ మార్గం ప్రయోజనకరంగా ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఇక పై నగరంలోకి రాకుండా ఊరు బయట నుంచే ఆయా ప్రధాన రహదారులకు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తుండటంతో మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డులో 15 కి.మీ.లు తప్ప మొత్తం ఔటర్ వినియోగంలోకి వచ్చినట్లవుతుంది. జూలైకి సర్వీసు రోడ్లు ఘట్కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను జూలై నాటికి పూర్తిచేయాలని ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట (31కి.మీ.) మార్గంలో జరుగుతున్న ఔటర్ రింగ్‌రోడ్డు పనులను ఇటీవల ఓఆర్ఆర్ పీడీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సందర్శంచారు. కాగా, మార్చి రెండో వారంలోగా మెయిన్ క్యారేజ్‌ను పూర్తి చేసేందుకు ఆయా పనులకు అధికారులు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. వాహనాల రాకపోకలకు అనువుగా 31కి.మీ. దూరం మెయిన్ రోడ్‌ను తీర్చిదిద్దే పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం 158 కి.మీ. ఓటర్కుగాను ప్రస్తుతం షామీర్పేట-కీసర (11కి.మీ), అలాగే కీసర-ఘట్కేసర్(4 కి.మీ.) వరకు 15కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీన్ని కూడా వచ్చే ఆరు మాసాల్లో పూర్తిచేయాలని అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. -
రయ్.. రయ్..
=త్వరలో అందుబాటులోకి ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ =విజయవాడ-వరంగల్ హైవేల అనుసంధానం =శరవేగంగా పనులు =తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు సాక్షి, సిటీబ్యూరో: వాహన చోదకులకు కొత్త సంవత్సర కానుకగా ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్ (మెయిన్ క్యారేజ్)ను అందుబాటులోకి తేవాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీని నిర్మాణాన్ని 2014 జనవరి నెలాఖరుకు పూర్తిచేసి ఫిబ్రవరి నుంచి వాహనాల రాకపోకలను ప్రారంభించాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. 31 కి.మీ. మేర ఈ రహదారి అందుబాటులోకి వస్తే వరంగల్ హైవే.. విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. ఫలితంగా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుత వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఉప్పల్ రింగ్‌రోడ్డు మీదుగా ఎల్బీనగర్ రింగ్‌రోడ్డుకు చేరుకొని వనస్థలిపురం, హయత్‌నగర్ మీదుగా విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తే ఇకపై ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లే. ఘట్కేసర్ వద్ద ఔటర్‌పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకొనే సౌకర్యం కలుగుతుంది. అలాగే వరంగల్ నుంచి విజ యవాడ, విజయవాడ నుంచి వరంగల్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఔటర్‌పై ప్రయాణించడం వల్ల సుమారు 5-6 కి.మీ. మేర దూరం తగ్గడంతో పాటు సమయం, ఇంధనం కూడా ఆదా అవుతాయి. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులకు అడ్డుకట్ట పడుతుంది. పనులు చకచకా.. ఈ రోడ్డు పనులను ఇటీవల కమిషనర్ కమిషనర్ నీరభ్‌కుమార్‌ప్రసాద్ సందర్శించారు. సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు నిరీక్షించకుండా అందుబాటులోకి వచ్చిన మెయిన్ క్యారేజ్ (ప్రధాన రోడ్డు)ను వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. వాయిదాల్లేకుండా మెయిన్ రోడ్లో మిగిలిన పనులను జనవరి నెలాఖరుకల్లా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు లక్ష్యం నిర్దేశించారు. ఘట్కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను కూడా జూన్, జూలై నాటికి పూర్తిచేయాలన్నారు. దీంతో ఆ దిశగా పనుల పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా కండ్లకోయ జంక్షన్, ఘట్కేసర్ వద్ద ఆర్వోబీ నిర్మాణం, ఘట్కేసర్ జంక్షన్ల వద్ద నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇక్కడ భూసేకరణకు సంబంధించి కోర్టు కేసులుండటంతో పనులు చేపట్టే అవకాశం లేదు. అయితే... ఘట్కేసర్ వద్ద ఆర్వోబీకి సంబంధించి రైల్వే శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో 2014 ఏప్రిల్ -మే నాటికల్లా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తే.. మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుకు గాను 15 కి.మీ.లు తప్ప ఔటర్ అంతా వినియోగంలోకి వచ్చినట్లవుతుంది. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం షామీర్పేట-కీసర (11 కి.మీ.), కీసర-ఘట్కేసర్ (4 కి.మీ.) వరకు 15 కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీన్ని కూడా 2014 మార్చి-ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. -
వరంగల్ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఈ రోజు తెల్లవారుజామున వరంగల్ - యశ్వంత్‌పూర్ జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి. దాంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ శనివారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలం అయింది. జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.