- ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట ‘ఔటర్’ రెడీ
- మార్చి రెండో వారం నుంచి రాకపోకలు ప్రారంభం
- ప్రధాన రోడ్డుకు తుదిమెరుగులు అద్దుతున్న హెచ్‌ఎండీఏ
సాక్షి, సిటీబ్యూరో: ఎట్టకేలకు ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్ అందుబాటులోకి వస్తోంది. మార్చి రెండో వారం నుంచి రాకపోకలు ప్రారంభించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. నిర్ణీత గడువులోగా ప్రధాన రహదారి పనులను పూర్తిచేసి రాకపోకలకు అనువుగా సిద్ధం చేయాలని ఓఆర్‌ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో సర్వీసు రోడ్లు, ఇతర నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నా... ప్రధాన రహదారిని మాత్రం సత్వరం వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు.
వాస్తవానికి ఫిబ్రవరి 15 నుంచే ఈ మార్గంలో రాకపోకలను అనుమతించాలని భావించినా... ప్రధాన మార్గంలో పలుచోట్ల చిన్నచిన్న పనులు మిగిలిపోయి ఉండటంతో ఆ గడువును మార్చి రెండో వారానికి వాయిదా వేశారు. ఘట్‌కేసర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు 31 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తుండటంతో వరంగల్ హైవేకు విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. ఘట్‌కేసర్ వద్ద ఔటర్‌పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకొనే సౌకర్యం కలుగుతుంది.
ముఖ్యంగా వరంగల్ - విజయవాడ, వరంగల్-బెంగళూరు, వరంగల్- ముంబై ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఈ మార్గం ప్రయోజనకరంగా ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఇక పై నగరంలోకి రాకుండా ఊరు బయట నుంచే ఆయా ప్రధాన రహదారులకు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తుండటంతో మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డులో 15 కి.మీ.లు తప్ప మొత్తం ఔటర్ వినియోగంలోకి వచ్చినట్లవుతుంది.
జూలైకి సర్వీసు రోడ్లు
ఘట్‌కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను జూలై నాటికి పూర్తిచేయాలని ఓఆర్‌ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట (31కి.మీ.) మార్గంలో జరుగుతున్న ఔటర్ రింగ్‌రోడ్డు పనులను ఇటీవల ఓఆర్‌ఆర్ పీడీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సందర్శంచారు. కాగా, మార్చి రెండో వారంలోగా మెయిన్ క్యారేజ్‌ను పూర్తి చేసేందుకు ఆయా పనులకు అధికారులు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. వాహనాల రాకపోకలకు అనువుగా 31కి.మీ. దూరం మెయిన్ రోడ్‌ను తీర్చిదిద్దే పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం 158 కి.మీ. ఓటర్‌కుగాను ప్రస్తుతం షామీర్‌పేట-కీసర (11కి.మీ), అలాగే కీసర-ఘట్‌కేసర్(4 కి.మీ.) వరకు 15కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీన్ని కూడా వచ్చే ఆరు మాసాల్లో పూర్తిచేయాలని అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించారు.