Ghat Kesar
-
ఎంఎంటీఎస్ టూ...లేట్
ఘట్కేసర్ టౌన్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా రెండో దశలో శివారు ప్రాంతాలైన ఘట్కేసర్, మేడ్చల్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదనలు చేసి 2013లో పనులను ప్రారంభించారు. మౌలాలి నుంచి ఘట్కేసర్ మధ్యన 12.20 కిలోమీటర్లు, బొల్లారం నుంచి మేడ్చల్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ట్రాక్, విద్యుదీకరణ పనులు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం 1/4, రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎంఎంటీఎస్ పనులను పరిశీలించడానికి ఘట్కేసర్కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ 2017 డిసెంబర్ నాటికి రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తికాకపోవడం గమనార్హం. మరింత ఆలస్యం.. సుమారు రూ.130 కోట్లతో 12.2 కిలోమీటర్ల దూరంలో పలు చోట్ల చిన్న చిన్న వంతెనలు, ట్రాకు నిర్మించాలి. భూసేకరణలో ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, యంనంపేట్ గ్రామాల్లో నష్టపరిహారం చెల్లింపు విషయంలో సమస్య తలెత్తడం, రైల్వే ప్రాజెక్టులకు18 శాతం జీఎస్టీని విధించడం సమస్యగా మారింది. పాత ప్రాజెక్టులకు పాత పన్నునే విధించాలని, పెంచిన జీఎస్టీ భారాన్ని మోయలేమని కాంట్రాక్లర్లు చేతులెత్తేసినట్లు సమాచారం. ట్రాకు నిర్మాణ పనులు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఫ్లాట్‌ఫారం, షెడ్లు, విద్యుదీకరణ పనులు నడుస్తుండటంతో మరో 5 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిరాశలో ప్రయాణికులు... ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం, తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని, స్టేషన్లు పెరిగి రవాణ సౌకర్యం మెరుగు పడుతుందని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుతారని అనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మండలంలో ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, వందలాది కాలనీలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎంఎంటీఎస్ రైళ్ల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫ్లాట్ ఫారం షెడ్డు నిర్మాణానికి వేసిన పిల్లర్లు అసంపూర్తిగా పుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంఎంటీఎస్ రాకతో రవాణ సౌకర్యం పెరుగుతుంది. డబ్బు, సమయం ఆదా అవుతుంది. మరికొన్ని రైళ్లు నిలపడంతో స్థానికులకు స్వయం ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రైల్వే అ«ధికారులు స్పందించి ఎంఎంటీఎస్ పనులను పూర్తి చేయాలి. –పులికంటి రాజశేఖరెడ్డి, స్థానికుడు -
దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్షకు..
ఘట్‌కేసర్‌టౌన్: ఓ పక్క ఇంటిలో తండ్రి శవం.. మరో పక్క పరీక్ష కేంద్రంలో కూతురు.. ఈ హృదయవిదారక దృశ్యం మండలంలోని యంనంపేట్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి ఆరముల్ల శ్రీనివాస్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశాడు. శ్రీనివాస్ భార్య 12 ఏళ్ల క్రితం మృతిచెందింది. వీరి ఏకైక కుమార్తె లావణ్య. తల్లి చనిపోవడంతో శ్రీనివాస్ అన్నీ తానై లావణ్యను పెంచుతున్నాడు. ఇప్పుడు తండ్రి మృతితో రెక్కలు తెగిన పక్షిలా అయింది లావణ్య. ఘట్కేసర్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న లావణ్య బుధవారం పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. దుఃఖాన్ని దిగమింగుకొని బంధువుల సహకారంతో అన్నోజీగూడ నారాయణ కళాశాల కేంద్రంలో పరీక్షకు హాజరైంది. అనంతరం తలకొరివి పట్టి తండ్రి చితికి నిప్పంటించింది. -
‘నా బంగారు హారమే కావాలి..’
బ్యాంకులో చోరీ ఘటన.. పరిహారం తీసుకునేందుకు మహిళల నిరాకరణ ఘట్కేసర్: పరిహారం వద్దు.. నా పసిడి హారమే ముద్దు అంటూ చాలామంది మహిళలు పరిహారం డబ్బులు తీసుకునేందుకు నిరాకరిస్తుండడంతో ఏమీ చేయాలోపాలుపోక బ్యాంకు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో ఖాతాదారులకు చెందిన 4.6 కిలోల బంగారు నగలను గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. అసలే చోరీ జరిగి విచారంగా ఉన్న బ్యాంకు అధికారులు మహిళలు పరిహారం తీసుకునేందుకు నిరాకరిస్తుండడం మరింత ఇబ్బందికి లోనవుతున్నారు. చోరీకి గురైన లాకర్లో ఎక్కువగా మహిళలకు సంబంధించిన ఆభరణాలు ఉన్నా యి. మహిళలు ఎంతో అపురూపంగా చూసుకునే నగలు చోరీకి గురవడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బ్యాంకు అధికారుల నుంచి పరిహారం తీసుకునేందుకు కొందరు మహిళలు నిరాకరిస్తున్నారు. తమకు ఇష్టమైన తమ నగలే కావాలని అధికారులకు చెబుతున్నారు. చోరీ ఘటన నేపథ్యంలో కొందరు అతివలు తమ భర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వద్దన్నా కూడా వినకుండా నగలను బ్యాంకులో తనఖా పెట్టారు.. ఇప్పుడు చోరీ అయ్యాయని పోరు పెడుతున్నారు. కొందరు మహిళలు తమ పుట్టింటి వారు పెట్టిన నగలు.. అని బ్యాంకు అధికారులతో వాదనకు దిగుతున్నారు. ఇక చేసేదిలేక చివరకు కన్నీటిపర్యంతమవుతున్నారు. పరిహారం తీసుకొని తిరిగి చోరీకి గురైన నగల డిజైన్ చేయిస్తామని భర్తలు చెబుతున్నా మహిళలు వినడం లేదు. పరిహారం వద్దు తమకు సెంటిమెంట్‌గా ఉన్న అభరణాలే కావాలని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారని, రేపోమాపో పట్టుబడుతారని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు నచ్చజెబుతున్నారు. పరిహారం అధికారులు ప్రకటించినా తీసుకునేందుకు ఖాతాదారుల స్పందన కరువైంది. -
సతి వెనకే పతి..
ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: ప్లీజ్ మా ఆవిడకు ఓటేయండి..మీ రుణం తప్పక తీర్చుకుంటాం అంటూ సతుల కోసం పతులు ఆరాటపడుతున్నారు.మండల పరిధిలో ఈ పాట్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మండలంలోని 21 పంచాయతీల్లో మొత్తం 46 మండల ప్రాదేశిక నియోజకవర్గాల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మండలంలోని ఎన్‌ఎఫ్‌సీనగర్ ఎంపీటీసీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయిస్తే అక్కడి నుంచి ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ పెర్సీబాయి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేస్తోంది. దీంతో మండలంలో 24 మంది మహిళలు ఎంపీటీసీ స్థానాల బరిలో ఉన్నారు. 24 మహిళా మండల ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి 89 మంది మహిళా ఎంపీటీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మహిళా అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో వారి భర్తలు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తూ సతీమణులకు తోడుగా ఉంటూ ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తూ దీటుగా ప్రచారం చేస్తున్నారు. రాత్రింబవళ్లు గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఘట్కేసర్ పట్టణంలోని 2లో దేవరకొంద పద్మ భర్త రవి, రాజబోయిన మంగమ్మ భర్త యాదగిరియాదవ్, వేల్పుల అనురాధ భర్త రవి, మామిండ్ల సరిత భర్త ముత్యాలుయాదవ్, పోచారం 1లో ఇండిపెండెంట్ అభ్యర్థి బద్దం మమతరాణి కోసం ఆమె భర్త బద్దం జగన్మోహన్రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గడపగడపకూ తిరుగుతూ తన సతీమణి గుర్తు చూపిస్తూ ఓటేసి గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. -
లైన్ క్లియర్
ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ‘ఔటర్’ రెడీ మార్చి రెండో వారం నుంచి రాకపోకలు ప్రారంభం ప్రధాన రోడ్డుకు తుదిమెరుగులు అద్దుతున్న హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో: ఎట్టకేలకు ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్ అందుబాటులోకి వస్తోంది. మార్చి రెండో వారం నుంచి రాకపోకలు ప్రారంభించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. నిర్ణీత గడువులోగా ప్రధాన రహదారి పనులను పూర్తిచేసి రాకపోకలకు అనువుగా సిద్ధం చేయాలని ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో సర్వీసు రోడ్లు, ఇతర నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నా... ప్రధాన రహదారిని మాత్రం సత్వరం వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు. వాస్తవానికి ఫిబ్రవరి 15 నుంచే ఈ మార్గంలో రాకపోకలను అనుమతించాలని భావించినా... ప్రధాన మార్గంలో పలుచోట్ల చిన్నచిన్న పనులు మిగిలిపోయి ఉండటంతో ఆ గడువును మార్చి రెండో వారానికి వాయిదా వేశారు. ఘట్కేసర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు 31 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తుండటంతో వరంగల్ హైవేకు విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. ఘట్కేసర్ వద్ద ఔటర్‌పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకొనే సౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా వరంగల్ - విజయవాడ, వరంగల్-బెంగళూరు, వరంగల్- ముంబై ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఈ మార్గం ప్రయోజనకరంగా ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఇక పై నగరంలోకి రాకుండా ఊరు బయట నుంచే ఆయా ప్రధాన రహదారులకు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తుండటంతో మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డులో 15 కి.మీ.లు తప్ప మొత్తం ఔటర్ వినియోగంలోకి వచ్చినట్లవుతుంది. జూలైకి సర్వీసు రోడ్లు ఘట్కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను జూలై నాటికి పూర్తిచేయాలని ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట (31కి.మీ.) మార్గంలో జరుగుతున్న ఔటర్ రింగ్‌రోడ్డు పనులను ఇటీవల ఓఆర్ఆర్ పీడీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సందర్శంచారు. కాగా, మార్చి రెండో వారంలోగా మెయిన్ క్యారేజ్‌ను పూర్తి చేసేందుకు ఆయా పనులకు అధికారులు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. వాహనాల రాకపోకలకు అనువుగా 31కి.మీ. దూరం మెయిన్ రోడ్‌ను తీర్చిదిద్దే పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం 158 కి.మీ. ఓటర్కుగాను ప్రస్తుతం షామీర్పేట-కీసర (11కి.మీ), అలాగే కీసర-ఘట్కేసర్(4 కి.మీ.) వరకు 15కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీన్ని కూడా వచ్చే ఆరు మాసాల్లో పూర్తిచేయాలని అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. -
రయ్.. రయ్..
=త్వరలో అందుబాటులోకి ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ =విజయవాడ-వరంగల్ హైవేల అనుసంధానం =శరవేగంగా పనులు =తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు సాక్షి, సిటీబ్యూరో: వాహన చోదకులకు కొత్త సంవత్సర కానుకగా ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్ (మెయిన్ క్యారేజ్)ను అందుబాటులోకి తేవాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీని నిర్మాణాన్ని 2014 జనవరి నెలాఖరుకు పూర్తిచేసి ఫిబ్రవరి నుంచి వాహనాల రాకపోకలను ప్రారంభించాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. 31 కి.మీ. మేర ఈ రహదారి అందుబాటులోకి వస్తే వరంగల్ హైవే.. విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. ఫలితంగా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుత వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఉప్పల్ రింగ్‌రోడ్డు మీదుగా ఎల్బీనగర్ రింగ్‌రోడ్డుకు చేరుకొని వనస్థలిపురం, హయత్‌నగర్ మీదుగా విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తే ఇకపై ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లే. ఘట్కేసర్ వద్ద ఔటర్‌పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిని చేరుకొనే సౌకర్యం కలుగుతుంది. అలాగే వరంగల్ నుంచి విజ యవాడ, విజయవాడ నుంచి వరంగల్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఔటర్‌పై ప్రయాణించడం వల్ల సుమారు 5-6 కి.మీ. మేర దూరం తగ్గడంతో పాటు సమయం, ఇంధనం కూడా ఆదా అవుతాయి. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులకు అడ్డుకట్ట పడుతుంది. పనులు చకచకా.. ఈ రోడ్డు పనులను ఇటీవల కమిషనర్ కమిషనర్ నీరభ్‌కుమార్‌ప్రసాద్ సందర్శించారు. సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తయ్యేవరకు నిరీక్షించకుండా అందుబాటులోకి వచ్చిన మెయిన్ క్యారేజ్ (ప్రధాన రోడ్డు)ను వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. వాయిదాల్లేకుండా మెయిన్ రోడ్లో మిగిలిన పనులను జనవరి నెలాఖరుకల్లా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు లక్ష్యం నిర్దేశించారు. ఘట్కేసర్- పెద్దఅంబర్‌పేట వరకు నిర్మించాల్సిన సర్వీసురోడ్లను కూడా జూన్, జూలై నాటికి పూర్తిచేయాలన్నారు. దీంతో ఆ దిశగా పనుల పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా కండ్లకోయ జంక్షన్, ఘట్కేసర్ వద్ద ఆర్వోబీ నిర్మాణం, ఘట్కేసర్ జంక్షన్ల వద్ద నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇక్కడ భూసేకరణకు సంబంధించి కోర్టు కేసులుండటంతో పనులు చేపట్టే అవకాశం లేదు. అయితే... ఘట్కేసర్ వద్ద ఆర్వోబీకి సంబంధించి రైల్వే శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో 2014 ఏప్రిల్ -మే నాటికల్లా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఘట్కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గం అందుబాటులోకి వస్తే.. మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుకు గాను 15 కి.మీ.లు తప్ప ఔటర్ అంతా వినియోగంలోకి వచ్చినట్లవుతుంది. వివిధ కారణాల వల్ల ప్రస్తుతం షామీర్పేట-కీసర (11 కి.మీ.), కీసర-ఘట్కేసర్ (4 కి.మీ.) వరకు 15 కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీన్ని కూడా 2014 మార్చి-ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. -
సైబరాబాద్‌లో 110 ‘నిర్భయ’ కేసులు
ఢిల్లీ ఘటన జరిగి రేపటికి ఏడాది సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్భయ చట్టం కింద ఈ ఏడాది 110 కేసులు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ 16న ఢిల్లీ బస్సులో ప్రయాణిస్తున్న మెడికల్ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన యావత్‌దేశాన్ని కదిలించిం ది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలన్న ఉద్దేశంతో కొత్తగా నిర్భయ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సైబరాబాద్‌లో 110 కేసులు నమోదయ్యా యి. సైబరాబాద్‌లో మొత్తం 40 శాంతిభద్రతల పోలీసుస్టేషన్లు ఉండగా.. వీటిలో 26 ఠాణాల్లో ‘నిర్భయ’ కేసులు నమోదయ్యాయి. హయత్‌నగర్, మంచాల్, యాచారం, నా ర్సింగి, మైలార్దేవులపల్లి, మొయినాబాద్, శామీర్‌పేట, మియాపూర్, అల్వాల్, కుషాయిగూడ, కీసర, ఉప్పల్, ఘట్కేసర్, మేడిపల్లి ఠాణాల్లో ఈ చట్టం కింద ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. లైంగిక దాడి ఘటనల్లో మహిళలు, బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొం దించేందుకు మహిళా పోలీసు అధికారులతో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. బాధితులు కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండేం దుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే బాధితులు అందరి ముందు కోర్టుకు హాజరయ్యే పరిస్థితి తొలగిపోతుంది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు హాజరై తమకు జరిగిన ఘోరం గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ మీడియాతో పాటు ఇతరులెవ్వరినీ అనుమతించరు కాబట్టి.. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా న్యాయమూర్తికి చెప్పుకోగలుగుతారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు వస్తే చాలా మంచిది: బాధితులు లైంగిక దాడి ఘటనల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే బాధితులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇలాంటి కోర్టులకు రావడానికి బాధితులకు ఎలాంటి ఇబ్బందులుండ వ్. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల వల్ల విచారణ త్వరగా పూర్తైనిందితులకు త్వరగా శిక్షపడుతుంది. శిక్ష పడే విధంగా చార్జిషీట్లు: నిర్భయ చట్టం కింద నమోదైన కేసులో కఠినంగా వ్యవహరిస్తాం. నిందితులకు శిక్ష పడే విధంగా సాక్ష్యాలను సేకరించి, సకాలంలో ఛార్జిషీట్లు వేస్తాం. మహిళలు, బాలికపై లైంగిక దాడి జరిగినప్పుడు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. పరువు పోతుందనే భయంతో కొందరు ఫిర్యాదు చేయడంలేదు. అలాంటి వారికి మహిళా పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. - సీవీ ఆనంద్, పోలీసు కమిషనర్